Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ కావాలన్న కోరిక: బయోకాన్ ఇండియా అధినేత అయ్యారు

కేవలం రూ.10 వేల పెట్టుబడితో బయోకాన్ ఇండియా ప్రస్థానం ప్రారంభించిన కిరణ్ మజుందార్ చిన్ననాట వైద్యురాలు కావాలని ఆశించారు. కానీ ప్రతికూల పరిస్థితులతో సాధ్యం కాలేదు. తండ్రి ప్రోత్సాహంతో బ్రూవరీస్ పై పీజీ పట్టా అందుకుని.. అటుపై ఎంజైములు తయారుచేసే బయో టెక్నాలజీ పరిశ్రమ స్థాపన దిశగా అడుగులేశారు. నిరంతరం అన్వేషణ సాగిస్తూ ముందుకెళ్లిన కిరణ్ మజుందార్ షా పయనంలో ఒడిదొడుకులు.. ఆమె ఎదుర్కొన్న సవాళ్లెన్నో ఒక్కసారి పరిశీలిద్దాం..

Life lessons with self-made billionaire Kiran Mazumdar Shaw
Author
Hyderabad, First Published Oct 28, 2019, 11:46 AM IST

న్యూఢిల్లీ: కిరణ్ మజుందార్.. కార్పొరేట్, పారిశ్రామిక రంగంలో పరిచయం అక్కర్లేని పేరు.. బయోకాన్ ఇండియా చైర్ పర్సన్ ఆమె. బెంగళూరులో స్థిర పడిన గుజరాతీ రసేంద్ర కుమార్ మజుందార్ షా కూతురు. చిన్ననాడు వైద్యురాలు కావాలని ఆమె ఆశించారు. కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల అడ్మిషన్ లభించలేదు. 

నిరాశకు గురైన కిరణ్ మజుందార్‌కు కోరుకున్న కోర్సు దొరకనప్పుడు దొరికినదాంట్లోనే అద్భుతాలు నెలకొల్పాలని హితబోధ చేశారు ఆమె తండ్రి. అంతే కాదు అనుక్షణం ఆమెకు వెన్నంటి నిలిచారు. అప్పటికే ఆయన మద్యం తయారీ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పటికే తాను రాణిస్తున్న బ్రూవరీ రంగంలో పీజీ చేయాలని రసేంద్ర కుమార్ సలహా ఇచ్చారు. 

నాటి పరిస్థితుల్లో ఇది పూర్తిగా సాహసోపేతమైన, అసాధారణ పని, వినూత్నంగా ఉండాలన్న తండ్రి సూచన మేరకు జంతుశాస్త్రంలో బీఎస్సీ.. అటుపై ఫెర్మెంటేషన్ సైన్స్‌లో పీజీ పూర్తి చేశారు. నాటి తండ్రి సలహాలు, కిరణ్ ధైర్యవంతమైన నిర్ణయమే ఈనాడు బయో టెక్నాలజీలో భారతదేశాన్ని ముందు వరుసలో నిలిపింది. 

also read గూగుల్‌లో ఉద్యోగుల అసమ్మతి

ఇలా ఆస్ట్రేలియాలోని ఫెడరేషన్ విశ్వవిద్యాలయంలో మాల్టింగ్ అండ్ బ్రూవింగ్‌లో పట్టా అందుకున్నారు. అలా బ్రూవింగ్ విభాగంలో పట్టా అందుకున్న తొలి బారతీయ మహిళ కిరణ్ మజుందార్ షా కావడం గమనార్హం. బ్రూవింగ్ విభాగంలో ఉన్న అవగాహనతో ఏదైనా ఉద్యోగంలో చేరాలన్న ఆకాంక్షతో 1975లో భారతదేశానికి తిరిగొచ్చిన కిరణ్ మజుందార్ ఎక్కడికి వెళ్లినా ఆమెకు నిరాశ తప్పలేదు. 

మగువలకు ఎందుకు ఈ ఉద్యోగం అంటూ నిరాశాపూరితంగా మాట్లాడారు. దీంతో కాసింత నిరాశకు గురైన ఆమెలో తండ్రి రసేంద్ర కుమార్ మళ్లీ స్ఫూర్తిని నింపారు. మద్యం కంపెనీలకు సలహాలు సంప్రదింపులు ఇచ్చే సంస్థను స్థాపించాలని సూచించారు. అందుకనుగుణంగానే భారతదేశంలోని బ్రూవరీ సంస్థలపై నిశితంగా అధ్యయనం చేయడంతోపాటు బయో టెక్నాలజీ రంగంలో పాశ్చాత్య ప్రపంచంలో వస్తున్న మార్పులను ఆసక్తిగా గమనించారు కిరణ్ మజుందార్. 

మధ్యం, ఔషధాలు, ఆహార పదార్థాల తయారీకి అవసరమైన, ఉపయోగించే ఎంజైమ్‌ల ప్రాధాన్యాన్ని గుర్తించారు. అటుపై ఐర్లాండ్లో అధ్యయనానికి వెళ్లారు. అక్కడ బయోకాన్ కెమికల్స్ చీఫ్ అచిన్ క్లోన్‌తో పరిచయం కిరణ్ మజుందార్ షా జీవితాన్నే పూర్తిగా మార్చేసిందంటే ఆశ్చర్యం కాదు. 

1977లో భారతదేశానికి వచ్చిన అజిన్ క్లోస్.. బ్రూవరీ విభాగంలో కిరణ్ మజుందార్ షాకు గల లోతైన అవగాహన, బయో టెక్నాలజీపై గల ఆసక్తిని గమనించారు. భారతదేశంలో బయోకాన్ స్థాపించాలన్న తన నిర్ణయాన్ని ఆమెతో షేర్ చేసుకున్నారు. తన బిజినెస్‌లో భాగస్వామిగా చేరాలని కోరారు. పురుషాధిక్య ప్రపంచంలో ఎదగగలనా? అన్న సంకోచాన్ని అజిన్ క్లోస్ ఇచ్చిన ధైర్యంతో పక్కన బెట్టేసి ముందడుగు వేశారు. 

ఐర్లాండ్ వెళ్లి బయో కాన్ కెమికల్స్‌లో ట్రైనీ మేనేజర్‌గా కొన్ని మెళకువలు నేర్చుకుని భారతదేశానికి తిరిగొచ్చారు. 1978లో బయోకాన్ ఇండియా పేరిట ఎంజైమ్‌ల తయారీ స్టార్టప్ స్థాపించాను. బెంగళూరులోని ఒక కారు షెడ్ నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నాటి కఠిన నిబంధనల వల్ల 30 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించారు. దీంతో 70 శాతం నిధులను సమకూర్చుకున్నారు. తన బ్యాంకు ఖాతాలోని రూ.10,000లను తొలి పెట్టుబడిగా వాడేశారు. 

ఒక మహిళ ‘ఎంజైమ్’ల వ్యాపారం ప్రారంభిస్తున్నారంటే ఎవరూ నమ్మకలేదు. ఆమె వద్ద ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపలేదు. తొలి ఉద్యోగిని నియామకానికి దాదాపు 30-40 మందిని ఆమె సంప్రదించారు. చివరకు కొంత మంది ఆసక్తి గల యువకులు ముందుకు రావడంతో కిరణ్ మజుందార్ షాకు ఉద్యోగుల కోసం వేట తప్పింది.

మరోవైపు పెట్టుబడి సంపాదించడానికి బ్యాంకుల చుట్టూ కాళ్ల చెప్పులరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోయింది. మహిళ అంటే ఒక చిన్నచూపు. ఏ బ్యాంకు ఆమెను నమ్మలేదు. చివరకు కర్ణాటక రాష్ట్ర ఆర్థిక సంస్థ రుణమివ్వడానికి అంగీకరించడంతో కిరణ్ మజుందార్ పెట్టుబడి కష్టాలు తప్పాయి. 

వీటికితోడు నాణ్యమైన ఎంజైములను తయారు చేయాలంటే అత్యంత నాణ్యమైన నీరు, నైపుణ్యం గల ఉద్యోగులు, కోతల్లేని విద్యుత్ చాలా అవసరం. ఆ రోజుల్లో ఇవన్నీ సమకూర్చుకోవడం కిరణ్ మజుందార్ షాకు సవాల్‌గా పరిణమించాయి. కానీ ఇటువంటి సవాళ్లను తనదైన శైలిలో అధిగమించడంతోపాటు ఏడాది తిరక్కుండానే భారతదేశంలోనే తొలి ఎంజైముల తయారీ సంస్థగా నిలిపారు. 

అమెరికాతోపాటు యూరప్ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి కిరణ్ మజుందార్ షా సారథ్యంలోని బయోకాన్ ఇండియా చేరింది. అలా తొలి ఏడాది వచ్చిన లాబాలతో 1980లో హొసూరులో 20 ఎకరాల స్థలం కొని.. పూర్తిస్థాయి కార్యాలయాన్ని ప్రారంభించి.. తన సామ్రాజ్యానికి కేంద్రంగా తీర్చిదిద్దారు. 

ఎంజైమ్స్ సంస్తను పూర్తిస్థాయి జీవ ఔషధ ఉత్పత్తుల సంస్థగా తీర్చిదిద్దారు. ఎంజైమ్స్ తయారీ సంస్థను ఇన్సులిన్ కంపెనీగా మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధ సమస్యల నివారణ ప్రయోగాలపై కేంద్రీకరించారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెపోటు దరి చేరనీయకుండా జీవ రక్షాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టి బయోకాన్ సంచలనం నెలకొల్పింది. ప్రస్తుతం పలు రకాల జీవ ఔషధాల తయారీలో బయోకాన్ సంస్థను ప్రపంచంలోనే మేటి సంస్థగా నిలిపారు కిరణ్ మజుందార్. 

also read పన్నుల్లో కోత.. ‘ఐటీ’ లిమిట్స్‌పై ‘నిర్మల’ ఫోకస్

తర్వాత మరో అడుగు ముందుకేసిన కిరణ్ మజుందార్.. సింజిన్ పేరిట రీసెర్చి సంస్థను స్థాపించారు. ఔషధాలను మార్కెట్లోకి తెచ్చేముందే వాటిని జీవాలపై ప్రయోగించి ఫలితాల నిర్ధారణకు క్లీనిజిన్ అనే మరో సంస్థను నెలకొల్పారు. ఇలా పలు ప్రమాదకర వ్యాధులపై బయోకాన్ చేస్తున్న ద్రుష్టిని ఆకర్షించాయి. 

1989లో యూని లివర్‌కు ఐర్లాండ్ బయోకాన్ బయో కెమికల్స్ విక్రయించింది. యూనిలీవర్ సంస్థతో కలిసి బయోకాన్ ఇండియా సుదీర్ఘంగా సాగించిన ప్రయాణం.. పలు నూతన ఆవిష్కరణలకు దారి తీసింది. 1998లో ఐసీఐ వద్ద బయోకాన్ వాటాలను పూర్తిగా జాన్ షా కొనుగోలు చేశారు. తర్వాత కొద్ది రోజులకే కిరణ్, జాన్ షా మధ్య పెండ్లి జరిగింది. 

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సలహాతో 2004లో బయోకాన్ సంస్థను కిరణ్ మజుందార్ ఐపీవోకు తీసుకు వెళ్లారు. అప్పట్లో బయోకాన్ ఐపీవో 33 శాతం ఓవర్ సబ్ స్క్రైబ్ కావడం సంచలనం. మార్కెట్లో లిస్టయిన తొలినాడే 1.1 బిలియన్ డాలర్ల విలువను సాధించింది. స్టాక్ మార్కెట్లో చేరిన తొలి రోజే బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన రెండో భారతీయ సంస్థగా బయోకాన్ నిలిచింది. ఇలా వచ్చిన నిధులన్నీ పరిశోధనకే కేటాయించారు.

వైద్యురాలు కావాలన్న కల సాకారం కాకున్నా పేదలకు ఆరోగ్య సేవలందించాలన్న ఆశ మాత్రం పోలేదు. ‘ఆరోగ్య రక్ష యోజన’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఏడాదికి రూ.120 చందాతో పలు గ్రామాల్లో వైద్య సేవలందిస్తున్నారు. ఆరోగ్య బీమా వసతి కల్పిస్తున్నారు. తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలందిస్తున్నారు. క్లిష్టమైన ఆరోగ్య సమస్యల పరిష్కారానికి క్రుషి చేస్తున్నారు. బెంగళూరు నగరంలో పచ్చదనం పెంపుదలకు తన వంతు సహకారం అందిస్తున్నారు. 

మజుందార్ షా మరో అడుగు ముందుకేసి మెడికల్ ఫౌండేషన్ నెలకొల్పారు. క్యాన్సర్ నివారణ ప్రయోగాలపై కేంద్రీకరించారు. లాభాపేక్ష లేకుండా క్యాన్సర్ రోగులకు చికిత్స చేయిస్తున్నారు. అసాధారణ ప్రతిభతో బయో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిన కిరణ్ మజుందార్ షా సేవలకు గుర్తింపుగా 1989లో పద్మ శ్రీ, 2005లో పద్మ భూషణ్ అవార్డులతో ఆమెను భారత ప్రభుత్వం సత్కరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios