LIC IPO: స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో LIC IPOకు సెబి ఆమోదం లభించింది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం మొత్తం 31 కోట్ల షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. లిస్టింగ్ తర్వాత LIC మార్కెట్ క్యాప్ RIL, TCS లాంటి దిగ్గజ కంపెనీలతో సరిసమానంగా ఉండనుంది.
Sebi Approves LIC IPO DRHP: దేశీయ ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న LIC IPOలో కీలక ఘట్టం ముగిసింది. దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మంగళవారం ఐపిఓ (IPO) ద్వారా నిధులను సేకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబి (SEBI) ఆమోదం తెలిపింది.
SEBIకి దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం, ప్రభుత్వం LIC యొక్క 31 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. IPOలో కొంత భాగం యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేయనుంది. అలాగే, LIC IPO ఇష్యూ పరిమాణంలో 10 శాతం వరకు పాలసీదారులకు రిజర్వ్ చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.78,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి జీవిత బీమా సంస్థలో 5 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.63,000 కోట్లను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. LIC తరపున ఫిబ్రవరి 13న SEBIకి DRHP సమర్పించగా, అందుకు సెబి ఆమోదం తెలపడం విశేషం. LICలో భారత ప్రభుత్వానికి 100% వాటా లేదా 632.49 కోట్ల కంటే ఎక్కువ షేర్లు ఉన్నాయి. ఒక్కో షేరు ముఖ విలువ రూ.10గా ఉంది.
స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద IPO
LIC పబ్లిక్ ఇష్యూ భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద IPO అవుతుంది. ఒకసారి లిస్టింగ్ అయ్యాక , LIC మార్కెట్ క్యాప్ RIL, TCS వంటి అగ్రశ్రేణి కంపెనీలతో సమానంగా ఉంటుంది.
ఇప్పటి వరకు IPO ద్వారా నిధులను సేకరించిన కంపెనీల్లో Paytm ముందంజలో ఉంది. 2021 సంవత్సరంలో, ఇది IPO ద్వారా 18,300 కోట్ల రూపాయలను సేకరించింది. దీని తర్వాత కోల్ ఇండియా 2010లో సుమారు రూ.15,500 కోట్లు, రిలయన్స్ పవర్ 2008లో రూ.11,700 కోట్లు సమీకరించాయి.
యాక్చురియల్ సంస్థ మిల్లిమాన్ అడ్వైజర్స్ LLP ఇండియా (Milliman Advisors LLP India) LIC ఎంబెడెడ్ వేల్యూపై పని చేయనుంది. డెలాయిట్, SBI క్యాప్స్ ప్రీ-ఐపిఓ లావాదేవీల సలహాదారులుగా (pre-IPO transaction advisors) నియమించారు
LICలో 20% FDIలకు అనుమతి
తాజాగా ఈ ఐపీఓలో విదేశీ ఇన్వెస్టర్లను చేర్చుకునేందుకు కేంద్ర కేబినెట్ ఎఫ్డీఐ విధానాన్ని మార్చింది. ఈ మార్పు ప్రకారం, LIC IPOలో 20 శాతం వరకు ఆటోమేటిక్ మార్గంలో విదేశీ పెట్టుబడులు అనుమతించారు. ప్రస్తుతం, ఆటోమేటిక్ రూట్‌లో బీమా రంగంలో 74 శాతం ఎఫ్‌డిఐ ఆమోదించారు.
LIC తన వ్యాపారాన్ని నాన్ పార్టిసిటింగ్ పాలసీ వైపు మళ్లించడం ద్వారా రాబోయే కాలంలో ప్రైవేట్ బీమా కంపెనీలకు గట్టి సవాలును ఇవ్వనుంది. స్విస్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ సూయిస్ IPO ఆమోదం కోసం మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి దాఖలు చేసిన దరఖాస్తు వివరాలను విశ్లేషించిన తర్వాత రూపొందించిన నివేదికలో ఈ అవకాశాన్ని వ్యక్తం చేసింది. నివేదిక ప్రకారం, ఎస్‌బిఐ లైఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, మ్యాక్స్ లైఫ్ వంటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఎల్‌ఐసి గట్టి పోటీదారుగా నిలవనుంది.
