Asianet News TeluguAsianet News Telugu

‘ఇన్‌ఫ్రా లీజింగ్‌’ను పడిపోనివ్వం.. నిలబెడతాం: ఎల్ఐసీ

ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) డిపాజిట్లు చేసిన వివిధ సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేయలేక చతికిల పడింది. దీంతో గతవారం సంస్థ చైర్మన్, డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఐఎల్ఎఫ్ఎస్ సంస్థను నిలబెట్టేందుకు జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ముందుకు వచ్చింది

LIC chairman says all options open to revive IL&FS
Author
Mumbai, First Published Sep 26, 2018, 8:04 AM IST

దేశీయంగా ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) సంస్థ దెబ్బ తినకుండా అండగా ఉంటామని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రకటించింది. పతనం కానివ్వబోమని పేర్కొంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థను ఆదుకుంటామని ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ మీడియాకు చెప్పారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థలో వాటాలను పెంచుకోవడంతో అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నామని శర్మ చెప్పారు.

ఇటీవలి కాలంలో వరుసగా ఐఎల్‌ఎఫ్ఎస్‌ గ్రూపు ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమైంది. కొన్ని కమర్షియల్‌ పేపర్‌ (సీపీ) రుణ పత్రాలపై సోమవారం చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపుల విషయమై ఐఎల్‌ఎఫ్ఎస్‌ గ్రూపు కంపెనీ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విఫలమైంది.

కంపెనీ ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకూ తెలిపింది. అయితే ఈ చెల్లింపులు జరుపాల్సింది మొత్తం ఎంత అన్న విషయం కంపెనీ పేర్కొనలేదు. రుణదాతలకు చెల్లింపుల విషయమై ఈ కంపెనీ విఫలమవడం ఈ నెలలో ఇది మూడోసారి. స్వల్పకాలిక నిధుల అవసరాల కోసం కంపెనీలు ఏడు రోజుల నుంచి ఏడాది కాల పరిమితితో కూడిన సీపీ రుణ పత్రాలు జారీ చేస్తుంటాయి. 

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ క్షీణించడంతో గత వారమే కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒతో సహా పలువురు డైరెక్టర్లు రాజీనామా చేసి తప్పుకున్నారు. ఆ వెంటనే ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఐఎల్‌ఎ్‌ఫఎస్‌ గ్రూపు కంపెనీలు ఇప్పటికే సిడ్బీకి చెల్లించాల్సిన రూ.1,500 కోట్ల స్వల్ప కాలిక రుణాల చెల్లింపుల్లో విఫలమయ్యాయి. గ్రూపు కంపెనీలన్నీ ఇలా వరుసగా రుణాల చెల్లింపుల్లో విఫలమవడంతో కంపెనీ ఆర్థిక మనుగడపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు సంస్థల డెట్‌ సెక్యూరిటీల రేటింగ్‌లను రేటింగ్‌ ఏజెన్సీలు తగ్గించడంతోపాటు ఈ కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల రాబడులను దెబ్బతీసే ప్రమాదం ఏర్పడింది.

దీంతో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారు తమ పథకాలు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాయా, లేదా అన్నది తెలుసుకోవడం అవసరం. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కార్పొరేట్‌ కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం సర్వసాధారణం. 

గత నెలాఖరు నాటికి 13 అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు) సుమారు 34 డెట్‌, హైబ్రిడ్‌ పథకాల ద్వారా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు డెట్‌ సెక్యూరిటీల్లో రూ.2,900 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేశాయి.

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు లిస్టెడ్‌ కాగా, వీటి మాతృ సంస్థే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌ఎఫ్‌ఎస్‌). ఇది ఇప్పటికే ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ను కోల్పోయింది. సెక్యూరిటీల చెల్లింపుల్లో విఫలం కావడమే సమస్యకు మూలం. 

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు పరిధిలో ఏడు సంస్థలు జారీ చేసిన సెక్యూరిటీల్లో, వివిధ ఏఎంసీలు పలు పథకాల ద్వారా (ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్లు, లిక్విడ్‌ ఫండ్స్‌, కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌, క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌, మీడియం, అల్ట్రా షార్ట్‌, లో డ్యురేషన్‌ ఫండ్స్‌) ఎక్స్‌పోజర్‌ తీసుకున్నాయి.

ఎల్‌ఐసీకి చెందిన లిక్విడ్‌ ఫండ్‌ సుమారుగా రూ. 697 కోట్లను ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమర్షియల్‌ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేసింది. శాతం వారీగా చూస్తే 4.19 శాతం మేర ఈ కంపెనీలకు నిధులను కేటాయించింది. ఈ సెక్యూరిటీలు ఈ నెలలోనే గడువు తీరనుండడం గమనార్హం.

డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ కూడా రూ.628 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సైతం ఆరు పథకాల ద్వారా రూ.607 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఇవి 2020లో గడువు తీరతాయి. టాటా ఏఎంసీ (రూ.240 కోట్లు), ప్రిన్సిపల్‌ (రూ.124 కోట్లు), హెచ్‌ఎస్‌బీసీ మ్యూచువల్‌ ఫండ్స్‌(రూ.105 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసినవే. యూనియన్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌, కోటక్‌, మిరే, యూటీఐ, ఇన్వెస్కో సంస్థలకూ రూ.30 నుంచి 99 కోట్ల మధ్య ఎక్స్‌పోజర్‌ ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios