వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుండి మొదలవుతాయి. 

మొదటి దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుండి ఫిబ్రవరి 11 వరకు, రెండో దశ మార్చి రెండో తేదీ నుండి ఏప్రిల్ మూడో తేదీ వరకు నడుస్తాయి. బడ్జెట్ సమావేశాల మధ్యలో ఒక నెల రోజులు సెలవు ఉంటుంది. 

ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వ రెండో దఫా అధికారంలోకి వచ్చాక తొలి పూర్తికాల బడ్జెట్ ఇదే. 
ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ఆర్థికవేత్తలు, ఆర్థిక రంగంలో నిపుణులతో పలుసార్లు భేటీ అయ్యారు.

Also Read:ట్యాక్స్ పే చేస్తున్నారా..? అయితే రూ.62,400 వరకు ఆదా చేసుకోవచ్చు...

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మందగమనం, దానిని అధిగమించడానికి అవసరమైన చర్యలపై చర్చించారు. ప్రస్తుతం దేశీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనం, జీడీపీ తగ్గుతుందనే అంచనాల మధ్య రాబోయే బడ్జెట్ మోడీ సర్కాక్ పెను సవాలేనని చెప్పాలి.

సాధారణ బడ్జెట్ 2020 ఫిబ్రవరి 1న ప్రవేశపెడితే, ఆర్థిక సర్వే జనవరి 31వ తేదీన వస్తుంది. బడ్జెట్‌ను సమర్పించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పలు రాయితీలను ప్రకటించవచ్చని తెలుస్తోంది.

బడ్జెట్ ముద్రణ పూర్తిగా రహస్యంగా నిర్వహిస్తారు. బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారులు, ఉద్యోగులు మొత్తం ప్రపంచం నుండి 10 రోజులు దూరంగా ఉంటారు. ఈ 100 మంది అధికారులు, ఉద్యోగులను ఇంటికి వెళ్ళడానికి కూడా అనుమతించరు.

ఆర్థిక మంత్రి, చాలా సీనియర్ అధికారులకు మాత్రమే ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఉంటుంది. ఈ కాలంలో ఆర్థిక మంత్రిత్వశాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. బయటి వ్యక్తి ఎవరూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి ప్రవేశించరు.

బడ్జెట్ ముద్రణ సమయంలో ప్రింటింగ్ అధికారులు, ఉద్యోగులు బయటకు రావడం లేదా వారి సహచరులను కలవడం కూడా నిషేధిస్తారు. ఒకవేళ సందర్శకులకు చాలా ముఖ్య విషయం ఉంటే వారిని భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో లోపలికి పంపుతారు.

వైద్యుల బృందాన్ని కూడా 10 రోజుల పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలో నియమిస్తారు. ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురైతే అతనికి వైద్య సదుపాయాలు కల్పిస్తారు.

ఇంటర్నెట్, ఎన్‌ఐసీ సర్వర్లు బడ్జెట్ పత్రం ఉన్న కంప్యూటర్ల నుండి తొలగిస్తారు. ఎలాంటి హ్యాకింగ్ లేకుండా ఏర్పాట్లు చేస్తారు. ఈ కంప్యూటర్లు ప్రింటర్, ప్రింటింగ్ మెషిన్‌కు మాత్రమే అనుసంధానిస్తారు. ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ఆర్థిక మంత్రిత్వశాఖలో ఎంపిక చేసిన సీనియర్ అధికారులను మాత్రమే సందర్శించడానికి అనుమతిస్తారు.

2020 బడ్జెట్‌పై ప్రజలకు అధిక అంచనాలు ఉన్నాయి. ఈసారి మోదీ ప్రభుత్వం ప్రజలకు మరింత ఉపశమనం కలిగించేందుకు యత్నిస్తోందని భావిస్తున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా మాంద్యానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ తరుణంలో బడ్జెట్ వస్తోంది. అన్ని ప్రాంతాలలో మందగమన పరిస్థితుల కారణంగా వేలాది ఉద్యోగాలు పోయాయి.

మోదీ ప్రభుత్వం 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ వేగవంతానికి తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లోటు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 3.8 శాతానికి పెరగవచ్చు.

అనిశ్చిత ఆర్థిక ప్రభావంతో నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా వెళుతుంటే ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా మారింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధి ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి చేరుకుంది. 

Also Read:రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి కొత్త చిక్కులు....

అనేక మంది ఆర్థికవేత్తలు, ఆర్థిక సంస్థలు దీనికి కారణం డిమాండ్, వినియోగం తగ్గడమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ కార్పొరేట్ పన్నులో భారీ కోతలను ఇటీవల ప్రకటించింది. అలాగే ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చేలా 102 లక్షల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రకటించారు.

గణాంక మంత్రిత్వ శాఖ జాతీయ ఆదాయానికి సంబంధించిన ముందస్తు అంచనాను విడుదల చేసింది. భారతదేశ తలసరి ఆదాయం పెరిగినట్లు నమోదైంది. ప్రభుత్వానికి ఈ అంచనాలను చెక్కుచెదరకుండా ఉంచడం సవాలే. 2020 మొదటి త్రైమాసికం నాటికి దేశ జిడిపి 5 శాతానికి పైగా సాధిస్తుందని భావిస్తున్నా ఇది 11 సంవత్సరాలలో నెమ్మది అభివృద్ధి అవుతుంది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆర్థిక వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంది. ఇది 2019 మార్చిలో ముగిసింది. జిడిపికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు నిరంతరం ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి అటువంటి పరిస్థితిలో, జిడిపిని మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతిపక్షాలు గమనిస్తున్నాయి.