గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం ఇటీవల కాలంలో భారీగా పుంజుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగులను నియమించుకోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాగా, గత మూడేళ్లలో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. 

2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగుల నియామకం జరగడం ఇదే తొలిసారి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్ లాంటి ఆరు దిగ్గజ ఐటీ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 1,04,820మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను తమ సంస్థల్లో రిక్రూట్ చేసుకున్నాయి. వచ్చే త్రైమాసికంలో కూడా ఇదే దోరణి కొనసాగుతుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.

దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్, రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఇప్పటికే 53వేల ఉద్యోగాలను కల్పించడం గమనార్హం. మార్చి 31తో ముగిసిన క్యూ4 ఫలితాల్లో టీసీఎస్ ఈ ఏడాది సుమారు 29, 287మంది టెక్కీలను కొత్తగా నియమించుకున్నట్లు వెల్లడించింది. దీంతో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,24,285కు చేరిందని టీసీఎస్ పేర్కొంది.

ఇక ఇన్ఫోసిస్ కూడా 24,016 ఉద్యోగులను కొత్తగా నియమించుకోవడంతో 2019, మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,28,123కు చేరుకుంది.  అయితే, విప్రో, హెచ్‌సీఎల్ ఫలితాలు తమ ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.

అంతకుముందు 2017, 2018 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 82,919 ఉద్యోగులు, 30,181 ఉద్యోగుల నియామకాలు మాత్రమే జరిగాయి. ఇందులో టీసీఎస్ 7770మందిని, ఇన్ఫోసిస్ 3740మందిని మాత్రమే  నియమించుకుంది.