న్యూఢిల్లీ: ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలికాం రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రారంభించిన తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో కస్టమర్లను తనవైపు తిప్పుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు టెలికాం రంగంలో వెలుగొందుతున్న మరో దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్‌ను కూడా వెనక్కి నెట్టింది. 

ప్రారంభించి దాదాపు రెండున్నరేళ్లే అయినప్పటికీ దేశంలో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా జియో అవతరించడం గమనార్హం. ఇప్పటి వరకు జియోకు 30.6కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఇంతకంటే కొద్దిపాటి ఎక్కువ మంది వినియోగదారులను కలిగివున్న వోడాఫోన్-ఐడియా మొదటి స్థానంలో ఉంది.

2018 డిసెంబర్ నాటికి వోడాఫోన్-ఐడియాకు 38.7కోట్ల మంది వినియోగదారులున్నారు. ఇక ఎయిర్‌టెల్ 28.4కోట్ల వినియోగదారులతో మూడో స్థానానికి పరిమితమైంది. జియో ప్రభంజనాన్ని చూస్తోంటే వచ్చే త్రైమాసికంలోనే వోడాఫోన్-ఐడియాను కూడా అధిగమించి ప్రథమ స్థానంలోకి వచ్చేలా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కాగా, సునీల్ మిట్టల్ ఆధ్వర్యంలోని ఎయిర్‌టెల్ దాదాపు రెండు దశాబ్ధాలపాటు మనదేశంలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. అయితే, జియో రాకతో ఎక్కువమంది కస్టమర్లు జియోకు మారిపోయారు. ఇక వోడాఫోన్, ఐడియా సంస్థలు కలవడంతో ఈ సంస్థే ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతానికి ప్రథమ స్థానంలో కొనసాగుతోంది.