రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఎనిమిది నెలల ముందే తమ లక్ష్యానికి చేరుకున్నామని ప్రకటించారు. 2021 మార్చి నాటికి రుణ రహిత సంస్థగా ‘రిలయన్స్’ను నిలపాలని ఆయన నిర్ణయించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ రైట్స్ ఇష్యూ, జియో ప్లాట్ పామ్స్‌లో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకున్నామని శుక్రవారం ప్రకటించారు. 

58 రోజుల్లో రిలయన్స్ రూ.1,68, 818 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని ముకేశ్ అంబానీ వెల్లడించారు. వాటిలో జియోలో పెట్టుబడుల ద్వారా రూ.1,15,693.95 కోట్లు, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124.20 కోట్లు సేకరించామని చెప్పారు. దీంతోపాటు బ్రిటిష్ పెట్రోలియంతో జాయింట్ వెంచర్ తో కలిపి మొత్తం రాబట్టిన పెట్టుబడుల విలువ రూ.1.75 లక్షల కోట్లు అని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. 

మరోవైపు దేశీయ టెలికం సంచలనం ‘రిలయన్స్ జియో’లోకి వెల్లువలా పెట్టుబడులు దూసుకువస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్‌వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) సంస్థ 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. దాని విలువ రూ.11,367 కోట్లు. కేవలం తొమ్మిది వారాల్లో రిలయన్స్ జియోలోకి 11వ పెట్టుబడి. 

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సారథ్యంలోని డిజిటల్ సర్వీసెస్ సంస్థ జియో ఇన్ఫోకామ్ వాటాల విక్రయం ద్వారా రూ.1,15,693.95 కోట్ల పెట్టుబడులు రాబట్టంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలో ఏ సంస్థ ఈ స్థాయిలో పెట్టుబడులు రాబట్టలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 

also read  మారటోరియంపై పట్టించుకోకుంటే ఎలా.. కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి..

‘జియోలో పీఐఎఫ్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. పీఐఎఫ్ మాకు అత్యంత ముఖ్య వాటాదారు. భారతదేశంలోని 130 కోట్ల మందికి జియో డిజిటల్ సేవలందించేందుకు ముందుకు సాగడంలో పీఐఎఫ్ సలహాలు, సూచనలు మాకు ఎంతగానో తోడ్పడతాయి’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఓ ప్రకటనలో తెలిపారు.


ఇదిలా ఉంటే దేశీయ ఈ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌, అంతర్జాతీయ ఆన్‌లైన్‌ మార్కెట్‌ దిగ్గజం అమెజాన్‌కు దీటుగా జియో ప్లాట్‌ఫామ్‌ను నిలిపేందుకు ముకేశ్‌ అంబానీ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం, సంప్రదాయ ఈ-కామర్స్‌ మోడల్‌కు బదులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ హైబ్రిడ్‌ మోడల్‌ను ఎంచుకున్నారు.

ఫేస్‌బుక్‌ సహా పలు అంతర్జాతీయ కంపెనీలకు జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా ఇప్పటికే రూ.లక్ష కోట్లకు పైగా నిధులు సేకరించారు అంబానీ. ఈ-కామర్స్‌ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు ఈ నిధులను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఆఫ్‌లైన్‌ నెట్‌వర్క్‌తో పాటు వినియోగదారుల ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు ఫ్యూచర్‌తో ఒప్పందం జియోకు భారీగా కలిసిరానుందని అంచనా.