న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ విమాన సేవలను నిలిపేయడంతో ఆ సంస్థ ఉద్యోగులంతా రోడ్డునపడ్డారు. కొద్ది నెలలుగా జీతాలు లేకపోవడంతోపాటు ఇప్పుడు ఉన్నపళంగా ఉద్యోగాలే పోవడంతో దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లపర్యంతమవుతున్నారు. 

అప్పులు ఊబిలో కూరుకుపోయిన కారణంగా బుధవారం రాత్రి నుంచి తాత్కాలికంగా సేవలను నిలిపివేయనున్నట్లు జెట్ ఎయిర్‌వేస్  ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ సంస్థ ఉద్యోగులు దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు ముంబైలో శాంతియుత నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా భోజా పూజారి అనే ఉద్యోగి మాట్లాడుతూ.. తాను ఇదే సంస్థలో గత 26ఏళ్లుగా పనిచేస్తున్నానని చెప్పారు. సంస్థ స్థాపించినప్పుడే తాను ఈ సంస్థలో చేరానని, ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎప్పుడూ అనుకోలేదని వాపోయారు. రెండు రోజులుగా నిద్రలేదని, తన పిల్లలు కూడా తన పరిస్థితి చెప్పలేదన్నారు. ఇంకా కొన్ని రోజులుగా ఇలాగేపోతే తన పిల్లలకు తిండి పెట్టడం కూడా కష్టమవుతుందని కన్నీటిపర్యంతమయ్యాడు.

నాలుగు నెలలుగా తమకు జీతాలు లేవని, దయజేసి తమ కుటుంబాలను కాపాడాలని మరో ఉద్యోగి చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల స్కూలు ఫీజులు కట్టడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని వాపోయారు. జెట్ సేవలు నిలిపేయడంతో తాము రోడ్డునపడ్డామని అన్నారు. తమకు రావాల్సిన వేతనాలు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు.

పరిస్థితిపై మీడియాతో మాట్లాడొద్దు

ఇది ఇలా ఉండగా, జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభం గురించి ఎవరూ మీడియాతో మాట్లాడరాదంటూ ఆ సంస్థ తమ సిబ్బందికి సూచించింది. జెట్‌ కొనుగోలు ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 
అంతేగాక, ఉద్యోగుల నిరసనపై స్పందించిన ఎయిర్‌లైన్స్‌ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మీడియాకు దూరంగా ఉండాలని సూచించింది. 

‘ప్రస్తుతం మనం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. జెట్‌ కొనుగోలు కోసం మన రుణదాతలు బిడ్డింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఇలాంటి సమయంలో మీరంతా మీడియాకు దూరంగా ఉండాలని కోరుతున్నాం. కేవలం కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ విభాగంలోని సిబ్బంది మాత్రమే మీడియాతో మాట్లాడతారు’ అని కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ విభాగం సిబ్బందికి ఈ-మెయిల్‌ ద్వారా స్పష్టం చేసింది.

అంతేగాక, ‘మన ఎయిర్‌లైన్స్‌ను అందరూ ఇష్టపడుతున్నారు. జెట్ సంక్షోభం గురించి ప్రతీ వార్తా పత్రిక రోజూ కథనాలు రాస్తున్నాయి’ అని తెలిపింది. కాగా, జెట్ విమాన సేవలు నిలిపివేయడంతో 20,000మంది ఉద్యోగులు ఇప్పుడు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌కు అత్యవసరంగా రూ. 400కోట్ల నిధులు ఇచ్చేందుకు రుణదాతలు అంగీకరించలేదు. దీంతో కార్యకలాపాలు సాగించలేదని స్థితిలో జెట్‌ సేవలు తాత్కాలికంగా మూతబడ్డాయి.