న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్ సంచలన నిర్ణయం ప్రకటించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేర్‌కు నిధులు వచ్చే మార్గం కనిపించకపోవడంతో బుధవారం రాత్రి నుంచి తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

జెట్ విమానాలు నడవాలంటే కనీసం రూ. 400 కోట్లు అవసరం ఉంది. ఆ డబ్బు ఇవ్వడానికి రుణదాతలు కానీ, బ్యాంకులు గానీ ముందుకు రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సేవలను ఆపేయాల్సి వచ్చిందని పేర్కొంది. 

బుధవారం రాత్రి 10.30గంటలకు నడిచే విమానమే(అమృత్‌సర్-ఢిల్లీ-ముంబై) చివరిదని ప్రకటించింది. అయితే పూర్తిస్థాయి విమాన సర్వీసుల రద్దుపై ఈ సంస్థ స్పష్టతనివ్వలేదు. కాగా, నిధుల విషయమై సోమవారం నుంచి బ్యాంకర్లు, జెట్ ఎయిర్‌వేస్ ప్రతినిధుల మధ్య సుదీర్ఘ సమావేశాలు జరిగాయి. 

జెట్ ఎయిర్‌వేస్ సేవలు నిలిచిపోకుండా ఉండేందుకు రూ. 400 కోట్లు అత్యవసర రుణం కావాలని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. అయితే అప్పటి వరకు జెట్ యాజమాన్యాన్ని ఆశ కల్పించిన రుణదాతలు, బ్యాంకులు చివరి నిమిషంలో తాము సాయం చేయలేమంటూ చేతులెత్తేశాయి. 

ఈ క్రమంలో జెట్ ఎయిర్‌వేస్‌కు తమ విమాన సర్వీసులను నిలిపివేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అప్పుల భారం కారణంగా ఇప్పటికే ఈ సంస్థ చాలా విమానాలు నిలిపివేసింది. ఒకప్పుడు 123 విమానాలతో సేవలందించిన ఈ సంస్థ ప్రస్తుతం 5 విమానాలతోనే సర్వీసులను అందిస్తోంది. 

ఓ వైపు రుణ భారం, మరో వైపు సిబ్బంది జీతాలు, డబ్బులు ఇస్తేనే ఇంధనం సరఫరా చేస్తామంటూ ఇంధన సంస్థల ఒత్తిడి.. నేపథ్యంలో చివరకు జెట్ ఎయిర్‌వేస్ తమ సేవలను బుధవారం రాత్రి నుంచి తాత్కాలికంగా నిలిపేసింది. 

కాగా, తమ సంస్థను కాపాడాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికే ఆ సంస్థ సిబ్బంది, పైలట్లు మొరపెట్టుకున్నారు.  ఇది ఇలావుంటే, జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకులైన నరేశ్ గోయల్‌కు విజయ్ మాల్యా తన సానుభూతిని తెలియజేశారు. ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం ఆదుకోవడం లేదంటూ మండిపడ్డారు.