ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి చివరకు తాత్కాలికంగా సేవలను నిలిపేయడంతో జెట్ ఎయిర్‌వేస్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి విమాన సేవలను నిలిపేస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్‌లో ఏకంగా 30శాతం షేర్లు నష్టపోయింది. అయితే నలుగురు బిడ్డర్లు వాటాల కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నారన్న అంచనాలతో ప్రస్తుతం 26శాతం నష్టంతో 179 వద్ద ట్రేడ్ అవుతోంది. 

ఇది ఇలావుంటే, ఇతర విమానయాన సంస్థల షేర్లు లాభాల బాట పట్టాయి. స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్‌లైన్స్ షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.

కాగా, నిధుల కొరతతో ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్‌కు రూ. 400 కోట్ల మేర అత్యవసర నిధులు అందించేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో జెట్ తన విమాన సేవలను బుధవారం రాత్రి నుంచి నిలిపివేసింది.