న్యూఢిల్లీ: అమెరికాలోని రిటైల్ దిగ్గజ సంస్థలన్నీ మన దేశీయ రిటైల్ సంస్థల స్వాధీనానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటివరకు దేశీయంగా రిలయన్స్ జియో సంచలనంతో టెలికం రంగంలో భారీ ఆఫర్ల యుద్ధం.. ఆయా సంస్థలు తమ మార్కెట్‌ను కాపాడుకునేందుకు ఒకదానిలో మరొకటి విలీనమయ్యాయి. తాజాగా రిటైల్ రంగంలోనూ అదే చిత్రం ఆవిష్క్రుతం కాబోతున్నది. దేశీయంగా అన్ని రంగాల్లోనూ చేతులు జాపుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవలే రిలయన్స్ సంస్థ రిటైల్ రంగంలోకి కూడా అడుగు పెడుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

రిటైల్ లోనూ జియో జోష్ కోసం ముకేశ్ తహతహ
2025 నాటికి భారత్‌ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్‌ డాలర్లు.. ప్రస్తుతం డాలర్‌ మారకం ధర ప్రకారం చూస్తే.. రూ.70 లక్షల కోట్లకు చేరుతుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రిటైలర్ల దృష్టి భారత్‌పై పడింది. ముఖేష్‌ అంబానీ ఇప్పటికే రిలయన్స్‌ జియోతో టెలికం రంగంలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు అన్నీ పోటీ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదే జోష్‌తో ఆయన ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌ ద్వారా ఈ కామర్స్‌ రంగంలోకి రావాలని చూస్తున్నారు. 

ముకేశ్, జెఫ్ బోజెస్ మధ్య ‘రిటైల్’ పోరు
అంతర్జాతీయంగా అభినవ ప్రపంచ కుబేరుడిగా పేరొందిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్‌తో ముకేశ్ అంబానీ తలపడపోతున్నారు. భారత్‌ రిటైల్‌ రంగంలో ఎంట్రీ ఇవ్వడానికి బెజోస్‌ గోల్డ్‌మన్‌ సాచెస్‌తో పాటు దేశీయ ప్రైవేట్‌ ఈక్విటి ఫండ్‌ కంపెనీ సహారా క్యాపిటల్‌తో ఒక కన్సార్షియం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కన్సార్షియం ఆదిత్యబిర్లా గ్రూపునకు చెందిన సూపర్‌మార్కెట్‌ చెయిన్‌ మోర్‌ను టేకోవర్‌ చేయబోతోంది. దీని విలువ ప్రస్తుతం రూ.4,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. 

‘మోర్’లో 49% వాటా కొనుగోలు చేయనున్న అమెజాన్?
మోర్‌ సూపర్‌ మార్కెట్ల నిర్వహణ సంస్థ ఆదిత్య బిర్లా రిటైల్‌ లిమిటెడ్‌లో అమెజాన్‌ 42-49 శాతం వాటా దక్కించుకునే అవకాశం ఉంది. మిగతా వాటాను సహారా క్యాపిటల్‌ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ కోసం అమెజాన్‌, సహారా క్యాపిటల్‌ కలిసి ఉమ్మడి సంస్థను ప్రారంభించనున్నాయి. ఈ కంపెనీ ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు నుంచి మోర్‌ సూపర్‌ మార్కెట్లను కొనుగోలు చేయన్నట్లు తెలుస్తోంది. ఇందులో గోల్డ్ మన్ సాచెస్ స్పెషల్ సొల్యూషన్స్ గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు కూడా భాగస్వామి కానున్నది. అమెజాన్ - సహారా - గోల్డ్ మాన్ సాచెస్ లతో కూడిన జాయింట్ వెంచర్ మోర్ స్వాధీనంపై ఈ నెలాఖరున లేదా వచ్చే నెల ప్రారంభంలో అధికారికంగా ప్రకటన చేయొచ్చు. తాజా పరిణామాలపై అమెజాన్‌, గోల్డ్‌మన్‌ సాచేస్‌, సమారా వ్యవస్థాపకుడు సుమిత్‌ నారంగ్‌ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అలాగే ఆదిత్యబిర్లా గ్రూపు అధికారి ప్రతినిధి కూడా మార్కెట్లో వచ్చే ఊహాగానాలపై స్పందించమని స్పష్టం చేశారు. అయితే అన్ని సవ్యంగా జరిగితే దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అమెజాన్‌ చేతికి మోర్‌ రెండో కంపెనీగా అవుతుంది. గతేడాది సెప్టెంబర్‌లో అమెజాన్‌ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ చెయిన్‌ స్టాపర్‌ స్టాప్‌లో 5 శాతం వాటాలు రూ.180 కోట్లకు కొనుగోలు చేసింది.

మాల్‌మార్ట్ - ప్లిఫ్ కార్ట్‌తో సంచలనం
వాల్‌మార్ట్‌ దేశీయ ఈ- కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ను 1,600 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో అమెజాన్‌ కూడా భారత్‌ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి 386 మిలియన్‌ డాలర్లు రూ.2,700 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది. దీంతో జెఫ్‌బేజోస్‌ గత ఐదేళ్ల నుంచి భారత్‌ మార్కెట్‌ 400 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లయింది. బేజోఫ్‌ భారత్‌ మార్కెట్లో 500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చైనాకు చెందిన అలీబాబా గ్రూపు కూడా భారతీయ రిటైల్‌ మార్కెట్లో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. పేటీఎం, బిగ్‌బాస్కెట్‌లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది. దీంతో పాటు రిలయన్స్‌ రిటైల్‌తో పాటు టాటా గ్రూపుతో భాగస్వామ్యం చేపట్టాలని చూస్తోంది.

భారత రిటైల్ సంస్థల్లో 49 శాతం విదేశీ ఇన్వెస్టర్ల వాటాకు ఓకే
భారతీయ చట్టం ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ కంపెనీల్లో 49 శాతం వరకు మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ రంగంలో వాటాలు కొనుగోలు చేయడానికి అనుమతిస్తోంది. సాధారణంగా విదేశీ కంపెనీలు ఈ ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి కొత్తగా హోల్డింగ్‌ కంపెనీ ఏర్పాటు చేసి క్యాష్‌ అండ్‌ క్యారీ రిటైలింగ్‌లోకి ఎంట్రీ ఇస్తుంటాయి. క్యాష్‌ అండ్‌ క్యారీ రిటైల్‌రంగంలో విదేశీ యజమాని 100 శాతం వాటాలు కొనుగోలు చేయడానికి భారతీయ చట్టాలు అనుమతి ఇస్తున్నాయి. ఇక్కడ భారత యాజమాన్య గ్రూపులు ఈ కంపెనీలకు ఫ్రాంచైజీలుగా లేదా ఫ్రంట్‌ ఎండ్‌ స్టోర్‌లు నిర్వహిస్తుంటాయి. 

అందుకే పరోక్ష మార్గం!
విదేశీ రిటైల్‌ సంస్థలు దేశీయ మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ వెంచర్లలో గరిష్ఠంగా 51 శాతం వాటా కొనుగోలుకు కూడా అనుమతి ఉంటుంది. అయితే, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంతేకాదు, పలు షరతులకు లోబడి పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ చిక్కులు తప్పించుకునేందుకు అమెజాన్‌ పరోక్ష పెట్టుబడుల మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. దేశంలోని అతిపెద్ద గొలుసుకట్టు సూపర్‌ మార్కెట్‌ సంస్థల్లో రిలయన్స్‌ రిటైల్‌, ఫ్యూచర్‌ గ్రూపు, డి-మార్ట్‌ తర్వాత మోర్‌ నాలుగో స్థానంలో ఉంది.
 
ఇప్పటికే పలు రిటైల్‌ సంస్థలతో అమెజాన్ సంప్రదింపులు 
భారత రిటైల్‌ మార్కెట్లో వ్యాపార విస్తరణపై అమెజాన్‌ ప్రత్యేక దృష్టి సారించింది. దేశీయ ఫుడ్‌ రిటైల్‌ విభాగంలో 50 కోట్ల డాలర్ల స్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. ఇప్పటికే పలు రిటైల్‌ కంపెనీల వ్యాపారాలను చేజిక్కించుకునే దిశగా అమెజాన్‌ ప్రయత్నాలు సాగించింది. ఆర్‌పి-సంజీవ్‌ గోయెంకా గ్రూపునకు చెందిన స్పెన్సర్‌ సూపర్‌ మార్కెట్లను కొనుగోలు చేసేందుకు ఈమధ్య సంప్రదింపులు సాగించింది. కానీ చర్చలు ఫలప్రదం కాలేదని తెలిసింది. కిశోర్‌ బియానికి చెందిన దేశీయ రిటైల్‌ దిగ్గజం ఫ్యూచర్‌ గ్రూపుతోనూ సంప్రదింపులు మొదలు పెట్టింది.

1980ల్లో త్రివేణి సూపర్ మార్కెట్.. క్రమంగా ‘మోర్’గా రూపాంతరం
ఇంతకుముందు ఆదిత్యబిర్లా చేతికి ‘మోర్’ రాకముందే హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంగా త్రివేణి సూపర్‌ మార్కెట్‌ చెయిన్‌గా 1980వ దశకంలో మార్కెట్లో హవా కొనసాగింది. కాలక్రమంలో ఈ సూపర్‌ మార్కెట్‌ బాగా ప్రజాదరణ పొందిన తర్వాత ఆదిత్యబిర్లాకు రూ.700 నుంచి రూ.800 కోట్లకు విక్రయించినట్లు అప్పడు వార్తలు వచ్చాయి. ఇటీవల రిటైల్‌ కంపెనీ డిమార్ట్‌ ఐపీవోకు రావడం.. దీనికి విశేష స్పందన లభించడంతో కుమారమంగళం బిర్లా కూడా మోర్‌ను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. గతంలో మోర్‌ను విక్రయించాలని రెండుసార్లు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇక మోర్‌ స్టోర్‌ విషయానికి వస్తే దేశంలోని సూపర్‌మార్కెట్‌ చెయిన్‌ ఆపరేటర్లలో నాలుగవ స్థానంలో ఉంది. అయితే లాభాలను రుచిన చూసిన దాఖలాల్లేవు. దేశవ్యాప్తంగా 493 మోర్‌ బ్రాండెడ్‌ స్టోర్లు, 20 హైపర్‌మార్కెట్లు మొత్తం 20 లక్షల చదరపు అడుగుల స్థలంలో రిటైల్‌ స్టోర్లు నిర్వహిస్తోంది.