ట్రైన్ టికెట్ బుకింగ్, రీఫండ్, పీఎన్‌ఆర్ చెక్ లాంటి సేవలు ఇప్పుడు 'ఆస్క్ దిశా 2.0' చాట్‌బాట్‌తో వాయిస్ కమాండ్ ఆధారంగా వేగంగా పూర్తి చేయవచ్చు.

రైల్లో తరచుగా ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌, క్యాన్సిలేషన్‌ లాంటి పనులు సులభతరం చేయడమే లక్ష్యంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్తగా వర్చువల్‌ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టింది. దీనిపేరు 'ఆస్క్ దిశా 2.0'. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పని చేస్తుంది.

ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్‌ యాప్‌ ఓపెన్ చేసిన వెంటనే ఈ కొత్త చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు. వాయిస్‌ ఆధారిత కమాండ్లతో సమాచారాన్ని అందించడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్‌, హిందీ, గుజరాతీ భాషల్ని మాత్రమే సపోర్ట్ చేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని భాషలు జోడించే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు టికెట్ బుకింగ్ కోసం పాస్‌వర్డ్ అవసరం పడితే, ఇప్పుడు మాత్రం ఓటీపీ ఆధారంగా లాగిన్ కావచ్చు. అలాగే టికెట్ క్యాన్సిలేషన్ అయినప్పుడు లేదా పేమెంట్ విఫలమైనప్పుడు, రీఫండ్ స్టేటస్ చెక్ చేయడం సులభమవుతుంది. ఈ వర్చువల్ అసిస్టెంట్, భవిష్యత్తులో బుకింగ్ వేగంగా చేయడం కోసం ప్రయాణికుల వివరాల్ని కూడా సేవ్ చేస్తుంది.

'AskDISHA 2.0'…

బ్రౌజర్‌లో 'AskDISHA 2.0' అని టైప్ చేస్తే సంబంధిత వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ టికెట్ బుకింగ్‌కు సంబంధించిన డిజిటల్ స్క్రీన్ కనిపిస్తుంది. కింద వాయిస్ కమాండ్ కోసం మైక్‌ ఐకాన్ ఉంటుంది. టికెట్ బుకింగ్ మాత్రమే కాదు, పీఎన్‌ఆర్ స్టేటస్, బుకింగ్ హిస్టరీ, టికెట్ క్యాన్సిలేషన్ వంటి అనేక సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి.

ఉదాహరణకు రీఫండ్ స్టేటస్ తెలుసుకోవాలంటే రిఫండ్ బటన్‌పై క్లిక్ చేస్తే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి: టికెట్ క్యాన్సిలేషన్‌, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్‌, టికెట్ డిపాజిట్‌ రిసిప్ట్‌. వీటిలో మీకు అవసరమైనదాన్ని ఎంచుకుని పీఎన్‌ఆర్ నంబర్ ఎంటర్ చేస్తే వెంటనే స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఈ విధంగా 'ఆస్క్ దిశా 2.0' వాడకం ద్వారా ప్రయాణికులు రైల్వే సేవలను మరింత వేగంగా, సులభంగా పొందవచ్చు. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ చాట్‌బాట్, రైల్వే యూజర్లకు సమర్థవంతమైన పరిష్కారంగా మారుతోంది.