స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నదన్న భయాలు మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టించాయి. మార్కెట్లు ప్రారంభమైన తొలి గంటలోనే ఐదు లక్షల కోట్లకు పైగా సంపద కోల్పోవడం చూస్తుంటే ఈ వైరస్‌ దెబ్బ ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థమవుతున్నది.

ఒక దశలో 1,500 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ వారాంతం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 1,448.37 పాయింట్లు లేదా 3.64 శాతం పడిపోయి 38,297.29 వద్ద ముగిసింది.  స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో రెండో అతిపెద్ద పతనం ఇదే. 
2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా అప్పట్లో భారీగా నష్టపోయిన సూచీలు మళ్లీ ఇప్పుడు కరోనా వైరస్‌తో కకావికలమయ్యాయి. 2015 ఆగస్టు 24న సూచీ 1,624.51 పాయింట్ల మేర నష్టపోయిన విషయం తెలిసిందే. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా 431.55 పాయింట్లు లేదా 3.71 శాతం క్షీణించి 11,201.75 వద్ద పరిమితమైంది. 

మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్‌ 2,872.83 పాయింట్లు లేదా 6.97 శాతం, నిఫ్టీ 879.10 పాయింట్లు లేదా 7.27 శాతం పడిపోయాయి. కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ మరో 57 దేశాలకు విస్తరించడం, ముఖ్యంగా న్యూజిలాండ్‌, నైజీరియా, నెదర్లాండ్స్‌ దేశాల్లో తొలి కేసు నమోదవడం ప్రపంచ మార్కెట్లలో ఆందోళనను పెంచింది. 

ఫలితంగా వరుసగా ఆరు రోజులుగా పతనమవుతూ వచ్చిన దేశీయ స్టాక్‌ మార్కెట్లలో శుక్రవారం బ్లాక్‌ ఫ్రైడేగా నిలిచిపోయింది. పవిత్ర మక్కాకు రాకపోకలనునిలిపివేస్తూ సౌదీ అరేబియా నిర్ణయించడం, యూరప్‌ దేశాలు దాదాపు పర్యవేక్షణలో ఉండటంతో మార్కెట్లపై  భయాలు మరింత పెరిగాయి. దీంతో దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ముఖ్యంగా మెటల్‌, ఐటీ, టెక్‌, బేసిక్‌ మేటిరీయల్‌, ఇండస్ట్రీయల్‌, ఎనర్జీ, ఫైనాన్స్‌, ఆటో, బ్యాంకెక్స్‌ సూచీలు ఏడు శాతానికి పైగా పతనమయ్యాయి.

స్టాక్‌ మార్కెట్ల భారీ పతనంతో మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. ఒక్క శుక్రవారమే మదుపరులు ఏకంగా రూ. 5,45,452.52 కోట్ల మేర సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్‌ఈలో లిస్టయిన సంస్థల మార్కె ట్‌ విలువ రూ. 1,46,94,571. 56 కోట్లకు పడిపోయింది. 

గురువారం ఇది రూ. 1,52,40, 024.08 కోట్లుగా ఉన్నది. వరుసగా ఆరు రోజుల్లో మదుపరులు రూ. 11,76,985.88 కోట్ల  సంపదను కోల్పోయారు. కరోనా వైరస్‌ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ  స్వల్పకాలంపాటు కుదేలవుతుందని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. 

వాహన రంగ షేర్లు ఢమాల్‌మన్నాయి. కరోనా వైరస్‌తో వాహన విడిభాగాల సరఫరా నిలిచిపోనున్నట్లు వచ్చిన సంకేతాలకు తోడు రెండు దశాబ్దాలకు పైగా అమ్మకాలు పడిపోవడంతో ఈ రంగ షేర్లు కుదేలయ్యాయి. టాటా మోటర్స్‌ 11.03 శాతం పతనమవగా, అశోక్‌ లేలాండ్‌ 8.15 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 7.50 శాతం, బజాజ్‌ ఆటో 1.60 శాతం, మారుతి సుజుకీలతోపాటు టీవీఎస్‌ మోటర్‌, ఎమ్మారెఫ్‌, హీరో మోటోకార్ప్‌, ఐచర్‌ మోటర్స్‌, అపోలో టైర్స్‌ కూడా పతనం అయ్యాయి. 

స్టాక్‌ మార్కెట్లతోపాటు బంగారం ధరలు కూడా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ పడిపోవడంతో ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.222 తగ్గి రూ.43,358కి పడిపోయింది. గురువారం ఈ ధర రూ.43,580గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి మద్దతు లభించకపోవడంతో కిలో వెండి ధర రూ.60 తగ్గి రూ.48, 130కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,632 డాలర్లకు, వెండి 17.25 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. 

కరోనా వైరస్‌ ప్రపంచ, అమెరికా ఆర్థిక మాంద్యానికి బీజంగా మారుతోందని రేటింగ్‌ సంస్థ మూడీస్‌ హెచ్చరించింది. అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ బీవోఎఫ్‌ఏ కూడా ప్రపంచ వృద్ధిరేటును ఇటీవల తగ్గించింది. అది కూడా.. ఆర్థిక సంక్షోభం నాటి స్థాయికి కోత విధించడం గమనార్హం. దీంతో అమెరికా వాల్‌స్ట్రీట్‌ మార్కెట్‌ గురువారం భారీగా పతమైంది. 

అమెరికాలోని డొజోన్స్‌ సూచీ చరిత్రలోనే అతిపెద్ద ఒక్కరోజు పతనాన్ని చవిచూసింది. దాదాపు 1200 పాయింట్లను కోల్పోయింది. ఫిబ్రవరి 19 తర్వాత ఎస్‌అండ్‌పీ 500 కూడా 10శాతం విలువ కోల్పోయింది. ఈ పరిణామాలు ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. జపాన్‌ సూచీలు 3.5శాతం, చైనా మార్కెట్లు 2.5శాతం విలువ కోల్పోయాయి.

మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ ఇటీవల స్పందిస్తూ ' కరోనా విషయమై మేం కీలక నిర్ణయం తీసుకొనే సమయం ఆసన్నమైంది’ అని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు స్పందిస్తేనే త్వరగా వైరస్‌ను అరికట్ట వచ్చు. ప్రజలు అనారోగ్యం పాలుకాకుండా కాపాడవచ్చు' అని పేర్కొన్నారు. ఈ వార్తలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. వ్యాధిగ్రస్తుల సంఖ్య లక్షల్లోకి చేరువ కావడం మార్కెట్లలో భయాలను నింపింది.

శుక్రవారం భారత ప్రభుత్వం మూడో త్రైమాసికానికి సంబంధించిన వృద్ధి అంచనాలను ప్రకటించనుండటం కూడా మార్కెట్లలో భయాలను నింపింది. ఒక వేళ వృద్ధి గతం కంటే తగ్గితే కనుక నష్టాలు కొనసాగే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి.