Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ రివ్యూ: రూ.7.25 లక్షల కోట్ల మదుపర్ల సొమ్ము ఆవిరి!!

2018లో దేశీయ స్టాక్ మార్కెట్ల విలువ పెరిగినా.. సంపద మాత్రం కరిగిపోయింది. జర్మనీ స్టాక్ మార్కెట్లను అధిగమించిన భారత దేశ స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో అంతర్జాతీయ అనిశ్చితులతో మదుపర్ల సొమ్ము రూ.7.25 లక్షల కోట్ల  ఆవిరైంది.

Investors become poorer by Rs 7.25 lakh crore in 2018
Author
Mumbai, First Published Jan 1, 2019, 11:48 AM IST

ముంబై: అంతర్జాతీయంగా వ్యతిరేక పవనాలు, మార్కెట్‌లో అనిశ్చితితో 2018లో రూ.7.25 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.7,25,401.31 కోట్లు తగ్గి రూ.1,44,48,465.69 కోట్లకు చేరుకుంది. 

ఏడాదిలో బీఎస్‌ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 2,011 (5.90%) పాయింట్ల మేర లాభపడింది. 2018 ఆగస్టు 29వ తేదీన సెనెక్స్‌ జీవిత కాల గరిష్ఠ స్థాయి 38,989.65 పాయింట్లను తాకిన సంగతి తెలిసిందే. అక్కడ్నుంచి 2,921.31 పాయింట్లు తగ్గి 36,068 వద్దకు చేరుకుంది. నిఫ్టీ కేవలం 3.2 శాతం లాభ పడింది.  

‘డిసెంబర్‌ 31న లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ సూచీ చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సూచనలు, కొత్తగా ఏ అడ్డంకులు లేకపోవడంతో సెషన్‌ చివరికి ఫ్లాట్‌గా ఉంది’ అని ఎంకీ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ జోసెఫ్‌ థామస్‌ తెలిపారు. ఇక 2019లో సార్వత్రిక ఎన్నికలు మార్కెట్‌ దశదిశను నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. 

ఏడాది చివరి రోజు మార్కెట్ ట్రేడింగ్‌లో ప్రారంభ లాభాలు చివరి దాకా నిలువలేకపోయాయి. 53 పాయింట్ల లాభంతో ప్రారంభం అయిన నిఫ్టీ ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ చివరికి కేవలం మూడు పాయింట్ల లాభంతోనే స్థిరపడింది. సెన్సెక్స్ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో ముగిసింది. రోజంతా ఊగిసలాట ధోరణితో ట్రేడ్ అయిన మార్కెట్‌లో మెటల్ షేర్లు మెరిశాయి. రూపాయి మారకం విలువ 16 పైసలు రికవరీతో ట్రేడ్ అవుతున్నా సెంటిమెంట్ మెరుగవ్వలేదు.

సంవత్సరాంతం కావడంతో ట్రేడర్లు తక్కువ స్థాయిలో మార్కెట్లో పాల్గొన్నారు. మెటల్ ఇండెక్స్ గరిష్ఠంగా 1.36 శాతం లాభపడింది. ఫార్మా ఇండెక్స్ 0.62 శాతం, ఐటీ ఇండెక్స్ 0.38 శాతం, మీడియా ఇండెక్స్ 0.39 శాతం, బ్యాంక్ నిఫ్టీ, ఆటో ఇండెక్స్‌లు 0.13 శాతం చొప్పున లాభపడ్డాయి. 

మార్కెట్‌ విలువ పరంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.7,10,584 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. టీసీఎస్‌ రూ.7,10,532 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.5,77,309 కోట్లు, హిందుస్థాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్) రూ.3,93,544 కోట్లు, ఐటీసీ రూ.3,44,934 కోట్లతోవరుసగా టాప్‌-5లో ఉన్నాయి.

ఇక మార్కెట్ క్యాపిటలైజేషన్‌వారీగా జర్మనీని అధిగమించి ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద స్టాక్‌మార్కెట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్ ఎదిగింది. 2.08 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో జర్మనీని అధిగమించినట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. 27 లక్షల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో అమెరికా అగ్రగామిగా ఉంది. ఆ తర్వాతీ స్థానాల్లో చైనా, జపాన్, హాంకాంగ్, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఉన్నాయి.

వర్దమాన దేశాల మార్కెట్లలో ఇండియా మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్నది. దేశీయ ఉత్పత్తి రంగం వృద్ధిరేటు వేగం పుంజుకోనప్పటికీ దేశీయ మార్కెట్ మిగతా మార్కెట్ల కన్నా అధిక రాబడులను ఇచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ గత ఏడాది కాలంలో రూపాయి మారకంలో 5 శాతం రాబడులను ఇస్తే, డాలర్ మారకంలో 4 శాతం నష్టపోయింది. 

మోర్గాన్ స్టాన్లీ ఎమర్జింగ్ మార్కెట్ల ఇండెక్స్‌తో పోల్చితే సెన్సెక్స్ అతి తక్కువగా పతనం అయింది. సాధారణంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతూ వస్తుంది. 2007లో దేశ జీడిపీ కన్నా 151 శాతం అధికంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండగా, ప్రస్తుతం 77 శాతం మాత్రమే ఉంది. 

భారతదేశ స్టాక్ మార్కెట్లు మరింత వృద్ధి చెందడానికే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అంచనా. 2027 నాటికి రూ.6.7 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు దేశీయ స్టాక్ మార్కెట్ ఎదుగుతుందని అంచనా. మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగే కొద్దీ బ్రోకింగ్, స్టాక్ ఎక్సేంజీలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల బిజినెస్ కూడా వృద్ధి చెందుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios