Asianet News TeluguAsianet News Telugu

నాలుగేళ్లలో 3 లక్షల కొలువులు.. ఇంటెల్ డిజైన్ కేంద్రం ప్రారంభంలో కేటీఆర్

మూడో ఈఎంసీని ప్రారంభించేందుకు కేంద్రం అనుమతినిస్తే వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగంలో మూడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు పేర్కొన్నారు. గత ఐదేండ్లలో 2 ఈఎంసీల ద్వారా 60 వేల ఉద్యోగాలు లభించాయన్నారు. మూడో ఈఎంసీకోసం కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు.  
 

Intel launches design, engineering centre in Hyderabad
Author
Hyderabad, First Published Dec 3, 2019, 11:17 AM IST

హైదరాబాద్: రానున్న నాలుగు సంవత్సరాలలో.. ఎలక్ట్రానిక్‌ పరిశ్రమద్వారా రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇందుకోసమే.. తెలంగాణకు మూడో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)ని మంజూరుచేయాలని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్లు, న్యాయశాఖల మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు లేఖ రాశామని చెప్పారు. 

 

సోమవారం రాయదుర్గంలో ఇంటెల్‌ డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఇంటెల్‌ సంస్థ భారతదేశంలో తన రెండో సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసింది. మొత్తం మూడు లక్షల చదరపు అడుగులు, ఆరు అంతస్తుల్లో నిర్మించిన సెంటర్‌లో 1500 మంది ఉద్యోగులు పని చేస్తారు. 

గత ఐదేండ్లలో ప్రపంచ దిగ్గజ కంపెనీలైన గూగుల్‌, అమెజాన్‌, ఉబర్‌, మైక్రాన్‌, ఇంటెల్‌, సేల్స్‌ఫోర్స్‌ తదితర కంపెనీలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటుచేశాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ రంగం ద్వారా 60 వేల ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవలే ఎలక్ట్రానిక్‌ రంగంలో చైనాకు చెందిన స్కైవర్త్‌ కంపెనీ 50 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ పారిశ్రామికవాడను ఏర్పాటుచేయాలని నిర్ణయించిందన్నారు.

Intel launches design, engineering centre in Hyderabad

తెలంగాణలో ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్లు (ఈఎంసీ) రెండు ఉన్నాయని, మూడో ఈఎంసీ మంజూరు కోసం చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి టీ వర్క్స్‌ పూర్తవుతాయని తెలిపారు. 

హైదరాబాద్‌ ఐటీ రంగంలో సుస్థిరతను, అభివృద్ధిని సాధించిందని, ఇది కేవలం సర్వీస్‌ సెక్టార్‌కు మాత్రమే పరిమితం కాకుండా ప్రొడక్ట్‌ ఇన్నోవేషన్‌కు ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఐటీ పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌లో అనుకూలమైన వాతావరణం ఉన్నదని పేర్కొన్నారు. 

Read more: బిల్ గేట్స్ చాలెంజ్.. డిజిటల్ ప్లాన్లు చెబితే 50 వేల డాలర్లు

భాగ్యనగరంలో ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, టాస్క్‌, రిచ్‌, టీహబ్‌, వీహబ్‌ లాంటివి ఎన్నో అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం ఇన్నోవేటివ్‌ రంగంపై దృష్టిపెట్టామన్నారు. గత రెండు క్వార్టర్స్‌లో ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును దాటామని ప్రకటించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, ఉత్పత్తి సృజనాత్మకతలో హైదరాబాద్‌ అందరికీ గమ్యస్థానంగా మారిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రానున్న రోజులో ఇక్కడ ఇంటెల్‌ కార్యకలాపాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Intel launches design, engineering centre in Hyderabad


హైదరాబాద్‌ నుంచే అమెరికాకు ఎక్సా స్కేల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌

ప్రపంచంలోనే కంప్యూటర్‌రంగంలో నూతన అధ్యాయంగా భావించే ఎక్సా స్కేల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ను హైదరాబాద్‌ ఇంటెల్‌ సెంటర్‌లో తయారు చేయనున్నారు. 2021 నాటికి అమెరికాకు ఈ కంప్యూటర్‌ను సరఫరా చేయనున్నట్లుగా ఇంటెల్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు కొడూరి రాజా తెలిపారు. 2022 నాటికి దీనిని భారతదేశంలో అందుబాటులోకి తెస్తామనిచెప్పారు. దీనిలో అనేక ప్రత్యేకతలు, సరికొత్త టెక్నాలజీ ఉంటుందని వివరించారు. 

Read more: తెలంగాణలో రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రంగం పెట్టుబడి...5వేల ఉద్యోగాలు...

హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభించిన ఇంటెల్‌లో వచ్చే సంవత్సరం తరువాత 1500 మంది ఉద్యోగులు పనిచేస్తారని ఇంటెల్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు కొడూరి రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఇంటెల్‌ కంట్రీహెడ్‌ నివృతిరాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios