Asianet News TeluguAsianet News Telugu

పారిశ్రామిక ప్రగతి నేలచూపులు.. రిటైల్ ద్రవ్యోల్బణం పైపైకి..

దేశ ఆర్థిక ప్రగతిపై కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ చెబుతున్న కబుర్లకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. మే నెల పారిశ్రామిక ప్రగతి ఏడు నెలల కనిష్టస్థాయికి పతనమైంది. మరోవైపు ముడి చమురు ధరల సెగతో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి చేరింది.

Industry growth slips to 7-month low of 3.2 pc in May

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ ప్రగతి గురించి ఎన్ని కబుర్లు చెబుతున్నా ఆచరణలో పారిశ్రామిక రంగం మళ్లీ నేల చూపులు చూస్తూనే ఉన్నది. పారిశ్రామిక వస్తువుల తయారీ, విద్యుత్ రంగాల్లో నెలకొన్న మందకొడి పరిస్థితులతో మే నెలలో పారిశ్రామిక రంగ ప్రగతి ఏడు నెలల కనిష్ఠ స్థాయి 3.2 శాతానికి పడిపోయింది. మరోవైపు ఆహార ధరలు తగ్గినా.. ముడి చమురు ధరల సెగ రిటైల్ ద్రవ్యోల్బణానికి బాగానే తగిలింది. 

కన్జూమర్ గూడ్స్ ఇలా నిరాశాజనకం


పారిశ్రామిక ప్రగతిలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ) రంగం కూడా నిరాశాజనక పనితీరు కనబరిచింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 2.9 శాతంగా ఉన్నది. 2017 అక్టోబర్‌లో నమోదైన 3.1 శాతం ఇప్పటి వరకు ఇదే తక్కువ స్థాయి. ఏప్రిల్ నెలకు గతంలో విడుదల చేసిన పారిశ్రామిక వృద్ధిరేటును కేంద్ర గణాంకాల శాఖ 4.9 శాతానికి బదులు 4.8 శాతానికి సవరించింది. 

ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే ప్రగతి


అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో పారిశ్రామిక వృద్ధిరేటు రికార్డు స్థాయి 4.4 శాతానికి చేరుకోవడం విశేషం. పారిశ్రామిక ప్రగతిలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం కేవలం 2.8 శాతం వృద్ధిని కనబరిచింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. 2017 మేలో 8.3 శాతం వృద్ధిని కనబరిచిన విద్యుత్ రంగం..గత మే నెలలో సగానికి సగం 4.2 శాతానికి పరిమితమైంది.

గనుల విభాగంలో ఇలా ప్రగతి


కానీ గనుల విభాగం దూసుకుపోయింది. ఈ రంగంలో వృద్ధి 5.7 శాతానికి ఎగిసింది. మిగతా రంగాలతో పోలిస్తే ఎఫ్‌ఎంసీజీ రంగం నిరాశాజనక పనితీరు కనబరిచింది. ఈ రంగ ప్రతికూల వృద్ధి 2.6 శాతానికి పరిమితమైనట్లు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. అలాగే ప్రాథమిక వస్తువుల్లో వృద్ధి 5.7 శాతంగాను, క్యాపిటల్ గూడ్స్‌లో 7.6 శాతం పెరుగుదల కనిపించింది. కన్జ్యూమర్ డ్యూరబుల్ విభాగం రికార్డు స్థాయిలో 4.3 శాతం వృద్ధి చెందింది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్, ఆప్టికల్, మోటార్ వాహనాలు, ట్రైలర్లు, సెమీ-ట్రైలర్లు కూడా మెరుగైన ప్రదర్శణగావించాయి. ఇదే సమయంలో దుస్తుల తయారీలో మాత్రం ప్రతికూల వృద్ధి 31.9 శాతానికి, పొగాకు 15.6 శాతానికి జారుకున్నాయి.

చమురు సెగతో ఐదు శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం


రిటైల్ ద్రవ్యోల్బణానికి చమురు సెగ గట్టిగానే తగిలింది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టినా ఇంధన ధరలు ఎగబాకడంతో జూన్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ఠ స్థాయి ఐదు శాతానికి చేరుకున్నది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 1.46 శాతంతో పోలిస్తే భారీగా పెరుగగా.. మే నెలలో నమోదైన 4.87 శాతంతో పోలిస్తే మాత్రం స్వల్ప పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది తొలి నెల జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా ఉన్నది. ఇప్పటి వరకు ఇదే గరిష్ఠ స్థాయి. ఆహార పదార్థాల ధరల సూచీ 3.1 శాతం నుంచి 2.91 శాతానికి తగ్గినప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు పెరుగడం విశేషం. కానీ, చమురు, లైట్ ఉత్పత్తుల ధరల సూచీ 7.14 శాతానికి పెరుగడం ఇందుకు కారణం. 

ద్రవ్యోల్బణానికి.. వడ్డీరేట్లకు ఇదీ లింక్


ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి కట్టడి చేయాలని రిజర్వు బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆగస్టు 1న ప్రకటించనున్న ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. జూన్‌లో జరిగిన సమీక్షలో సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పావుశాతం పెంచిన విషయం తెలిసిందే. యెస్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ శుభాదా రావు మాట్లాడుతూ..ఇంతకుముందు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు శిఖర స్థాయికి చేరుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఆర్బీఐ వడ్డీరేట్లను 25-50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని ఇక్రా ఆర్థికవేత్త అదితి నాయర్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios