వాషింగ్టన్‌: హెచ్‌ 1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వాములకు మరోసారి కష్టకాలం ఎదురైంది. వీరి పని అనుమతిని రద్దుచేసే విషయంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుంటామని ట్రంప్‌ సర్కార్‌ నేడు ఫెడరల్‌ కోర్టుకు తెలిపింది. హెచ్‌ 4 వీసాదారుల (హెచ్‌ 1బీ భాగస్వాములకు ఇచ్చే వీసా) వర్క్ పర్మిట్‌ను రద్దు చేస్తామని కొంతకాలంగా ట్రంప్‌ ప్రభుత్వం బహిరంగంగానే చెబుతోంది. తాజాగా మరో మూడు నెలల్లోగా దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్లు కొలంబియా ఫెడరల్ కోర్టుకు చెప్పింది. వచ్చే మూడునెలల్లోగా కొత్త నిబంధనల వివరాల్ని ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ బడ్జెట్ (ఓఎంబీ)కి సమర్పించనున్నట్లు తెలిపింది. దీంతో హెచ్‌-4 వీసాదారులు ఆందోళనకు గురవుతున్నారు.

హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురు చూస్తున్నవారి భాగస్వాములు హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేయొచ్చని పేర్కొంటూ 2015లో అప్పటి బారక్ ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒబామా సర్కార్ నిర్ణయంతో అమెరికన్లకు ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో హెచ్-‌4 వీసాదారులకు వర్క్‌ పర్మిట్‌ను రద్దు చేస్తామని ఈ ఏడాది ఫిబ్రవరి 28న ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది.

కొన్ని కారణాల వల్ల దీన్ని వాయిదా వేసింది. గత జూన్‌లోనూ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. మరికొంతకాలం వాయిదా వేసింది. అయితే రద్దు ప్రతిపాదనను హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ (డీహెచ్‌ఎస్‌) సీనియర్‌ యంత్రాంగం పరిశీలించిందని.. తదుపరి సమీక్ష కోసం అమెరికా పౌర, వలస సేవల సంస్థ (యూస్‌సీఐఎస్‌)కు పంపినట్లు డీహెచ్‌ఎస్ తెలిపింది. అందువల్లే నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతోందని డీహెచ్‌ఎస్‌ ఫెడరల్‌ కోర్టుకు పేర్కొన్నది.

హెచ్‌4 వీసాదారుల పని అనుమతిని రద్దు చేస్తే ఎక్కువగా నష్టపోయేది భారతీయులే. 2017 డిసెంబర్ 25 వ తేదీ నాటికి 1,26,853 మంది హెచ్‌4 వీసాదారులకు యూఎస్‌సీఐఎస్‌ పని అనుమతిని కల్పించింది. వీరిలో 93శాతం మంది భారతీయులే. ఇక ఐదు శాతం మంది చైనీయులు ఉన్నారు. ఒకవేళ వీరికి పని అనుమతిని రద్దు చేస్తే హెచ్‌-1బీ వీసాదారులు ఒక్కరి వేతనంతోనే కుటుంబాన్ని నడపాల్సి ఉంటుంది. అమెరికాలో అది అసాధ్యమని కొందరు డెమోక్రటిక్‌ పార్టీ నేతలు అభిప్రాయం పడుతున్నారు.