Asianet News TeluguAsianet News Telugu

ర్యాలీకి తెర: రూ.లక్ష కోట్లు ఆవిరి..అందరి చూపూ తీర్పుపైనే.. తేల్చేసిన గోల్డ్‌మాన్

ర్యాలీకి తెర: రూ.లక్ష కోట్లు ఆవిరి..అందరి చూపూ తీర్పుపైనే.. తేల్చేసిన గోల్డ్‌మాన్

India's world-beating stock market run is over: Goldman Sachs
Author
Mumbai, First Published Sep 18, 2018, 10:27 AM IST

ముంబై: స్టాక్ మార్కెట్ మరోసారి బేర్‌మంది. రెండు రోజుల ఉత్సాహం నీరుగారి పోయింది. వచ్చిన లాభాలు గాలి బుడగలయ్యాయి. సెన్సెక్స్ 505.13 పాయింట్లు నష్టపోయి 37.585.51 వద్ద ముగిసింది. నిఫ్టీ 137.45 పాయింట్లు పతనం అయి 11,377.75 వద్ద ముగిసింది. నికరంగా 1.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయ ఫైనాన్సియల్ రేటింగ్ సంస్థ ‘గోల్డ్ మాన్ సాచెస్’ పెదవి విరిచింది. అంతర్జాతీయంగా రికార్డులు నెలకొల్పిన భారతీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీకి తెర పడిందని తేల్చి చెప్పింది.

మరోవైపు రూపాయి విలువను బలోపేతం చేయడానికి ప్రభుత్వం గత వారాంతంలో ప్రకటించిన ఉద్దీపన చర్యలు ఉసూరుమనిపించాయి. మార్కెట్ ఏమాత్రం రుచించలేదు. రూపాయి మారకం విలువ 66 పైసలు తగ్గింది. ట్రేడ్ వార్ భయాలు మార్కెట్‌ను వెన్నాడాయి. వెరసి స్టాక్‌మార్కెట్ మరోసారి బేర్స్ పట్టులోకి వెళ్లింది. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలూ నష్టాల్లోనే ముగిశాయి. సోమవారం రాత్రికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 200 బిలియన్ డాలర్ల సుంకాలను విధిస్తారన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీన పరిచాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా స్తబ్దుగా ట్రేడ్ అవుతుండడంతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు.

అమెరికా అధ్యక్షుడు చైనా దిగుమతులపై 25 శాతం వరకు సుంకాలను విధించవచ్చుననీ, వీటి విలువ 200 బిలియన్ డాలర్లుంటుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది.దీంతో ఈ నెలాఖరులో జరుగనున్న వాణిజ్య చర్చల్లో పాల్గొనబోవడం లేదంటూ చైనా కాలుదువ్వింది. దీంతో ప్రతీకార సుంకాలకు చైనా దిగవచ్చునన్న అంచనాలు వెలువడుతున్నాయి. వీటన్నింటికీ తోడు ప్రపంచ మార్కెట్లన్నింటి కన్నా అధికంగా పెరిగిన ఇండియన్ స్టాక్ మార్కెట్ పరుగు ఇక అయిపోయిందంటూ గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రచురించడంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ మీద గట్టి దెబ్బ పడింది.

ఆర్థిక ప్రగతి మందగించే ముప్పు పొంచి ఉండటంతోపాటు అందరి ద్రుష్టి వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల తీర్పుపైనే ఉన్నదని గోల్డ్ మన్ సాచెస్ స్పష్టం చేసింది. 2014 మార్చి నుంచి ఇప్పటివరకు స్టాక్ మార్కెట్లు బుల్లిష్‌గా మారడంతోపాటు అంతర్జాతీయ స్టాక్స్ కంటే రెట్టింపు లాభాలు గడించి పెట్టాయి భారతీయ స్టాక్స్. అంతేకాదు ఇండియా రేటింగ్స్‌ను కొనుగోలు నుంచి తగ్గించి వేసింది. భారతీయ ఈక్విటీల్లో రిస్క్ రివార్డు తక్కువగా ఉన్నదని గోల్డ్ మాన్ సాచెస్ ప్రతినిధి సునీల్ కౌల్ పేర్కొన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివ్రుద్ధి చేస్తున్న ఆర్థిక రంగ విస్తరణకు పెరుగుతున్న ముడి చమురు ధరలు, డాలర్ పై రూపాయి విలువ పతనం వంటి సమస్యల నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ రెండు అంశాలు స్టాక్ మార్కెట్లలో ర్యాలీని అడ్డుకోవడంతోపాటు మదుపర్ల డబ్బు లక్షల కోట్లలో ఆవిరి కావడానికి దోహదపడుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బట్టి స్టాక్ మార్కెట్లలో పురోగతి ఉంటుందని గోల్డ్ మాన్ సాచెస్ అంచనా వేస్తున్నది. 

ఐటీ, చక్కెర రంగాలు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. ఆర్థికసేవల రంగం 1.68%, ఫార్మా 1.40%, ఎఫ్‌ఎంసీజీ 1.38%, బ్యాంక్ నిఫ్టీ 1.26% చొప్పున నష్టపోయాయి. కాగా, మిడ్‌క్యాప్-100 ఇండెక్స్ 0.65 నష్టపోయింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం 0.17% లాభంతో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 1012 షేర్లు నష్టాల్లో ముగిస్తే 805 షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ 2.85%, టైటాన్ 2.80 ఇన్‌ఫ్రాటెల్ 2.8%తో గరిష్ఠంగా నష్టపోయాయి. సన్ ఫార్మా 2.54%, టాటామోటార్స్ 2.53% చొప్పున నష్టపోయాయి. బీపీసీఎల్ 2.74%, హింద్‌పెట్రో 1.88%, టెక్‌మహీంద్రా 0.94%, ఐఓసీ 0.81% చొప్పున లాభపడ్డాయి. ఇకపోతే ఎఫ్‌ఐఐలు రూ.106.54 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు కూడా మరో రూ.180.36 కోట్ల అమ్మకాలను జరిపారు.

నిఫ్టీ 11400 స్థాయికి దిగువన ముగియడంతో రెండు రోజుల రికవరీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నిఫ్టీ స్వల్ప కాల మూవింగ్ యావరేజీలన్నింటి దిగువన ముగియడంద్వారా స్వల్పకాలిక ట్రెండ్ బేరిష్‌గా మారింది. గత వారం నమోదైన కనీస స్థాయి 11250 ప్రస్తుతానికి నిఫ్టీకి కీలకంగా మారింది. ఈ స్థాయికి దిగువన ముగిస్తే దీర్ఘకాల ట్రెండ్ కూడా బేరిష్‌గా మారుతుంది. అలాగే నిఫ్టీకి 11520-11600 జోన్ గట్టి నిరోధకంగా మారింది. ఈ జోన్‌కు ఎగువన మాత్రమే మార్కెట్ బుల్లిష్‌గా మారుతుంది.

డాలర్‌తో రూపాయి మారకం విలువను బలోపేతానికి గత వారం ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. సోమవారం మరో 67 పైసలు పతనం అయి డాలర్‌కు రూ. 72.51 గా ముగిసింది. ఒకదశలో రూ.72.69 స్థాయికి కూడా పతనమైంది  ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఏమాత్రం అంచనాలకు తగ్గట్టు లేవని ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, నోమురా లాంటి సంస్థలు నివేదికలను ప్రచురించాయి. రూపాయి పతనం ప్రభావం స్టాక్‌మార్కెట్ మీద కూడా పడింది. ఒకదశలో రూ.72.69 స్థాయికి చేరుకోగానే భారతీయ రిజర్వ్‌బ్యాంక్ జోక్యం చేసుకుని డాలర్లను అమ్మేసింది. గతవారం రూ.73 కనీస జీవితకాల కనీస స్థాయిని తాకిన తర్వాత ఆర్థిక గణాంకాల నేపథ్యంలో వేగంగా దాదాపు రూపాయికి పైగా మేర కోలుకుంది. మరోవైపు క్రూడాయిల్ బ్యారెల్ దర 78.52 డాలర్లకు చేరుకోవడంతో కూడా రూపాయి మారకం విలువపై ప్రభావం పడింది.

పెరుగుతున్న వాణిజ్య లోటు నేపథ్యంలో మిగతా ఆసియాదేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి మారకం విలువ ఎక్కువగా పతనం అయింది. మరో వైపు 10 ఏండ్ల సావరిన్ బాండ్లపై రాబడి 8.10 శాతానికి చేరుకుంది. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ గత పక్షం రోజుల్లో ఊపందుకోవడంతో దేశం నుంచి డాలర్ పెట్టుబడులు తరలివెళుతున్నాయని స్పష్టం అవుతుంది. గత రెండు వారాల్లో రూ. 9,406 కోట్ల పెట్టుబడులను క్యాపిటల్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్నారు. మరో వైపు విదేశీ కరెన్సీ నిల్వలు 400 బిలియన్ డాలర్ల దిగువకు పతనం అయ్యాయి. వరుస నెగెటివ్ అంశాలతో కరెన్సీ మార్కెట్ సెంటిమెంట్ బలహీన పడింది.

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్లనే రూపాయి పతనం చెందుతున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం, యూఎస్ ప్రభుత్వం తీసుకున్న అంతర్గత పాలసీ నిర్ణయాలు రూపాయి పతనానికి ఆజ్యం పోశాయని ఆయన విమర్శించారు. ఇంధన సరఫరాను తగ్గించడానికి ఇరాన్ చర్యలు తీసుకుంటుండటంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ భగ్గుమంటున్నదని, త్వరలో అన్ని సర్దుకుంటాయని ఆశిస్తున్నట్లు మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.

అంతకు ముందు రెండు సెషన్లలో భారీ లాభాలను నమోదు చేసిన స్టాక్‌ మార్కెట్లు సోమవారం అనూహ్యంగా నష్టాలోకి జారుకోవడంతో కంపెనీ మార్కెట్‌ విలువ కుదేలైంది. బీఎస్‌ఈలో నమోదైన స్టాక్స్‌ మొత్తం విలువ దాదాపు రూ.1.15 లక్షల కోట్ల మేర కుంగి.. రూ.155 లక్షల కోట్లకు చేరుకుంది. బీఎస్‌ఈలో మొత్తం 1441 స్టాక్స్‌ నష్టాల్లోకి జారుకోగా.. 1,282 స్టాక్స్‌ లాభాల బాట పట్టాయి. 191 స్టాక్స్‌లో ఎలాంటి చలనం కనిపించలేదు. నష్టాల నేపథ్యంలోనే దాదాపు 140 స్టాక్స్‌ సోమవారం 52 వారాల గరిష్టాన్ని తాకడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios