వన్నె తగ్గిన బంగారం: వాణిజ్యలోటుకు ఊరట

India’s gold imports in Apr-Jun dip 25% to $8.43 billion
Highlights

జనవరి నుంచే పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో పుత్తడి దిగుమతులు 25 శాతం తగ్గి 8.43 బిలియన్ల డాలర్లకు చేరాయి. 

ముంబై: బంగారం అంటే భారతీయ మహిళలకు ఎంతో మక్కువ. వివాహాలు, నూతన ఇంటి ప్రవేశాలు, సీమంతాలు, తదితర వేడుక ఏదైనా అతివలు తమ వద్దనున్న బంగారు ఆభరణాలు ధరించనిదే బయటకు వెళ్లరు. బంగారం అంటే అతివలు ప్రాణం పెడతారు. గతంలో బంగారంపై దిగుమతి సుంకం విధించినా డిమాండ్ తగ్గేది కాదు. కానీ గత నెలలో ముగిసిన త్రైమాసికంలో బంగారం దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 25 శాతం క్షీణించాయి. 

ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి మారకపు విలువ క్షీణించడం, పోర్ట్‌పోలియో పెట్టుబడులు తరలిపోవడం వల్ల కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌) పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమైంది. అయితే పసిడి దిగుమతులు తగ్గడం వల్ల పెద్దగా మారకపోవడమే ఊరట. పసిడి దిగుమతులు జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 8.43 బిలియన్ డాలర్ల (సుమారు రూ.58వేల కోట్లు)కే పరిమితమయ్యాయి. దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి ధరలు పడిపోవటమే ఇందుకు కారణం. వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2017-18) ఏప్రిల్-జూన్‌లో దేశంలోకి పుత్తడి దిగుమతులు 11.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 

నిజానికి ఈ ఏడాది జనవరి నుంచే బంగారం దిగుమతులు పతనం బాట పట్టాయి. 2017-18లో సీఏడీ 48.7 బిలియన్ డాలర్లుగా (జీడీపీలో 1.9 శాతం) నమోదైంది.అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2016-17) 14.4 బిలియన్ డాలర్లుగా (జీడీపీలో 0.6 శాతం) ఉన్నది. ఈ క్రమంలో తగ్గుతున్న బంగారం దిగుమతుల వల్ల క్యాడ్ మళ్లీ దిగివస్తుందన్న అంచనాలు పుష్కలంగా వినిపిస్తున్నాయి. విదేశీ మారకం రాకపోకల మధ్యనున్న వ్యత్యాసానికి సూచీ ‘క్యాడ్’ అన్న విషయం తెలిసిందే. దేశంలోని విదేశీ మారక (డాలర్) నిల్వలు తగ్గితే క్యాడ్ పెరుగుతుంది. నిల్వలు పెరిగితే క్యాడ్ తగ్గుతుంది. క్యాడ్ తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ఆవశ్యకం. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం అవుతుండటం, క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు వెనుకకు పోతుండటం తదితరాలు క్యాడ్ పెరుగుదలకు ప్రధాన కారణాలవుతున్నాయి.

దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతులతోనే తీరుతున్న విషయం తెలిసిందే. ఈ దిగుమతులకు డాలర్ల రూపంలోనే చెల్లించాలి. భారత దిగుమతుల్లో చమురు వాటా  ఎక్కువన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏప్రిల్-జూన్‌ త్రైమాసికంలో అధిక ముడి చమురు ధరల వల్ల వాణిజ్యలోటు (ఎగుమతి-దిగుమతుల మధ్య తేడా) 44.94 బిలియన్ డాలర్లకు చేరింది. నిరుడు ఇదే సమయంలో 40 బిలియన్ డాలర్లే. ఉన్నది. అయినా చమురు దిగుమతులు తగ్గించుకోలేని పరిస్థితి. పసిడి దిగుమతులు పూర్తిగా వాణిజ్యపరమైనవి కావడంతో క్యాడ్ప్రమాదకర స్థాయికి చేరినప్పుడల్లా ప్రభుత్వం ఈ పసిడి దిగుమతులపైనే పన్నులను విధిస్తూ ఉంటుంది. ఇది కూడా దిగుమతులను దెబ్బతీస్తున్నదని ఆభరణాల వర్తకులు అంటున్నారు.

కాగా, ప్రపంచంలోనే బంగారం దిగుమతుల్లో భారత్ ముందు వరుసలో ఉన్నది. నగల తయారీ పరిశ్రమకే ఎక్కువగా బంగారం వినియోగం అవుతున్నది. ఇక రత్నాలు, ఆభరణాల ఎగుమతులు జూన్‌లో సుమారు 3 శాతం పెరిగి 3.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మరోవైపు వెండి దిగుమతులు 104.5 శాతం ఎగిసి 364.24 మిలియన్ డాలర్లకు చేరాయి. ఏటా దేశంలోకి 700-800 టన్నుల బంగారం దిగుమతి అవుతున్నది.

loader