ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5.5 శాతానికే

భారతదేశంలో జాతీయ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల రుణాలు భారీగా కుంగిపోయాయని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ పేర్కొంది. ఫలితంగా వినియోగదారులకు అవసరమైన రుణ లభ్యత తగ్గుతుందని, దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5.5 శాతానికే పరిమితం అవుతుందని తేల్చేసింది. 
 

India's Economic Growth To Be At 5.5% In financial year 2019-20: Fitch Ratings

న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా వేసింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోవడంతో వృద్ధి అంచనాలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. రుణాల మంజూరులో స్తబ్దత, బ్యాంకులపై నీలినీడలు వృద్ధి రేటును ఆరేళ్ల కనిష్టానికి పడిపోయేలా చెయ్యొచ్చని విశ్లేషించింది. 

రుణ లభ్యత లేకపోవడం వల్లే భారత ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్టానికి చేరిందని ఫిచ్‌ విశ్లేషించింది. ఫిచ్‌ గత జూన్‌లో వృద్ధిరేటు అంచనాలను వెలువరించింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని తెలిపినా, ఇప్పుడు దానిని భారీగా తగ్గించేయడం విశేషం. 

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోదీ సర్కార్ ఇటీవల చేపట్టిన పలు చర్యలు, కార్పొరేట్‌ పన్నులు తగ్గించడం వంటి చర్యల వల్ల రానున్న రోజుల్లో భారత వృద్ధి రేటు క్రమంగా మెరుగయ్యే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. మెరుగైన పరిస్థితుల నేపథ్యంలో భారత జీడీపీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2020-21) 6.2 శాతం, ఆపై వచ్చే ఆర్థిక సంవత్సరం 6.7 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉన్నదని ఫిచ్ తెలిపింది. 

also read ఎంటిఎంఎల్, బీఎస్ఎన్ఎల్ విలీనం చేయాలి : కేంద్ర మంత్రి

ప్రస్తుత ఏడాదికి భారత ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం మేర వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని దేశ పెద్ద బ్యాంక్‌ ఆర్బీఐ అంచనా వేయగా.. ఇప్పుడు ఫిచ్‌ అనూహ్యంగా భారత వృద్ధి అంచనాను తగ్గించడం ఆర్థిక వర్గాలను విస్మయం వ్యక్తం చేసింది. 

వరుసగా ఐదో త్రైమాసికం గడిచిన ఏప్రిల్‌-జూన్‌లో దేశ జిడిపి 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. 2013 తర్వాత ఇదే అత్యల్ప వృద్ధి రేటు. 2018 ఇదే త్రైమాసికంలో 8 శాతం వృద్ధి నమోదైంది. 

దేశ ఆర్ధిక వ్యవస్థలో బలహీనతలు విస్తృతమవుతున్నాయని ఫిచ్‌ పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ వ్యయ డిమాండ్‌లో తగ్గుదల చోటు చేసుకుంటుందని తెలిపింది. బ్యాంకింగేతర విత్త సంస్థల్లో చోటు చేసుకున్న పరిణామాల వల్ల రుణాల మంజూరుపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది.

also read జీఎస్టీ రేట్లు తగ్గిస్తామన్న ‘నిర్మల’మ్మ

వ్యవస్థలో రుణాలు విరివిగా లభించని కారణంగా దేశీయ వినియోగం పడిపోవడంతో పాటు విదేశీ డిమాండ్‌ కూడా తగ్గుతూ వస్తోందని ఫిచ్‌ తెలిపింది. డిమాండ్‌ పెంచే దిశగా చర్యలు చేపట్టాలని సంస్థ సూచించింది. ఈ నెల తొలి అర్థ భాగంగా మూడీస్‌ ఇన్వెష్టర్‌ సర్వీసెస్‌ సంస్థ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 

గత ఏడాది ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలు కూడా భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గించి.. 2019-20లో భారత్‌ 6.5 శాతం, 5.9 శాతం మేర వృద్ధిని మాత్రమే సాధించేందుకు వీలుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ సంస్థ కూడా భారత వృద్ధి అంచనాలను 7.1 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా భారత జీడీపీ వృద్ధిని 7 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించేసిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios