న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల జరుగుతున్న వేళ నరేంద్ర మోడీ సర్కారుకు షాకిచ్చే వార్త ఒకటి బయటికి వచ్చింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఓ ప్రైవేటు సంస్థ తన నివేదికలో తేల్చింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 7.6శాతానికి ఎగబాకిందనే గణాంకాలు ఇప్పుడు మోడీ సర్కారుకు ఇబ్బందికరంగా మారాయి. ముంబైకి చెందిన సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) విడుదల చేసిన సర్వే గణాంకాలు ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి. 

కాంగ్రెస్ పార్టీతోపాటు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్సీలు కేంద్రంపై విమర్శలు దాడికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ 2 కోట్ల ఉద్యోగాలు ఏవీ? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా.. ఈ నివేదిక ఆయన ఆరోపణలకు మరింత బలాన్నిచ్చినట్లయింది. 

ప్రతి ఐదేళ్లకోసారి నిరుద్యోగ వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంటుంది. అయితే గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఆ గణాంకాలు మీడియాలో లీక్ అయ్యాయి. 2017-18లో నిరుద్యోగిత బాగా పెరిగిపోయిందని, గత 45ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగవకాశాలు తగ్గిపోయాయని ఆ గణాంకాలు వెల్లడించినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం ముందే లీకైన గణాంకాలను నిలిపివేసింది. పూర్తి స్పష్టత లేనందున ఈ గణాంకాలను విడుదల చేయడం లేదని తెలిపింది.

ఇది ఇలావుంటే, 2016 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే తొలిసారని వెల్లడించింది సీఎంఐఈ. మార్చిలో కొంత మేర నిరుద్యోగ రేటు తగ్గుతున్నట్లు కనిపించినా.. ఏప్రిల్ నాటికి భారీగా పెరిగిందని సీఎంఐఈ అధిపతి మహేశ్ వ్యాస్ తెలిపారు. మే నెల చివరికల్లా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుండటం, కొత్త పాలసీల కోసం కంపెనీలు ఎదురుచూస్తుండటం వంటి అంశాలు కూడా నిరుద్యోగిత పెరగడానికి కారణంగా నిలుస్తున్నాయి. 

కాగా, మొత్తం ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. మే 6న ఐదు, 12న ఆరు, 19వ తేదీన తుది దశ పోలింగ్ జరగనుంది. ఇంకా మూడు దశల పోలింగ్ జరగాల్సి ఉండగా.. సీఎంఐఈ వెల్లడించిన నిరుద్యోగ గణాంకాలు మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాలకు పదునైన విమర్శనాస్త్రాలుగా మారాయి.