న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు (ఐపీపీబీ) సేవల విస్తరణలో భాగంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదర్చుకోనున్నది. ఇలా థర్డ్‌ పార్టీతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా తమ ఖాతాదారులకు రుణాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా పథకాలను విక్రయించనున్నది.

ఐపీపీబీ సేవలు ప్రారంభమైన తర్వాత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్బీ)కి చెందిన రుణాలతోపాటు కొన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నదని సమాచారం. బజాజ్‌ అలయెంజ్‌తో భాగస్వామ్యంతో బీమాతోపాటు మరిన్ని పథకాలను విక్రయించనున్నదని తపాలాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

21న ప్రధాని మోదీ చేతుల మీదుగా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ప్రారంభం
ఈ నెల 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు (ఐపీపీబీ) 650 శాఖలను లాంచనంగా ప్రారంభించారు. దీంతో మరో పెద్ద బ్యాంకింగ్‌ సేవల సంస్థ అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం భారత్‌లో 1.55 లక్షల పోస్టు ఆఫీసు కార్యాలయాలు ఉన్నాయి.

ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి ఈ శాఖలతో ఐపీపీబీ అనుసంధానం కానున్నది. ఇందులోనూ 1.3 లక్షల పోస్టు ఆఫీసులు గ్రామాల్లోనే ఉన్నాయి. ఇవి పక్క గ్రామాలను కూడా చేరుకోగలవని, దీంతో దేశంలోని అన్ని గ్రామాల్లో ఐపిపిబి సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆ అధికారి తెలిపారు.

క్రెడిట్‌ కార్డులు మినహా రెండు శాఖల్లో విజయవంతంగా సేవలు
ఇప్పటికే రాయ్‌పూర్‌, రాంచీలో రెండు ఐపీపీబీ శాఖలు పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా విజయవంతంగా సేవలందిస్తున్నాయి. పేమెంట్‌ బ్యాంకులు వ్యక్తులు, చిన్న సంస్థల నుంచి లక్ష వరకు డిపాజిట్లు పొందే అవకాశం ఉంటుంది. అలాగు ఇతర బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయొచ్చు. ఇతర అన్ని రకాల బ్యాంకింగ్‌ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

రుణాలు ఇవ్వడం, క్రెడిట్‌ కార్డులను జారీ చేసే అధికారం ఉండదు. దీంతో ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు తమ ఖాతాదారులకు రుణాలు, ఇతర ఆర్థికసేవలు అందించడానికి వీలు కల్పించనున్నది.

ఇక ఇంటి వద్దకే పోస్టల్ బ్యాంకింగ్ సేవలు 
లక్ష రూపాయల పరిమితి మించిన డిపాజిట్లను పోస్టు ఆఫీసు సేవింగ్‌ బ్యాంక్స్‌ (పీఓఎస్‌బీ)కి బదిలీ చేయనున్నట్లు పోస్టాఫీసు వర్గాలు తెలిపాయి. పోస్టు ఆఫీసుల్లో రకరకాలైన 37 కోట్ల ఖాతాలు ఉన్నాయని, క్రమంగా వాటిని ఐపీపీబీతో అనుసంధానం చేస్తామని అన్నారు. తొలుత 11 వేల మంది పోస్టుమాన్‌లు ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలను అందిస్తారు. ఆ తర్వాత 3 లక్షల తపాల శాఖ ఉద్యోగులు ఈ సేవల్లో భాగస్వాములు అవుతారు. ఇంటి వద్దకే అందించే సేవలకు కొంత ఫీజు వసూలు చేయనున్నారు.

మోదీ సర్కార్‌కు ఆర్బీఐ రూ.50 వేల కోట్ల డివిడెండ్
డివిడెండ్ రూపంలో అక్షరాలా 50వేల కోట్లు ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చెల్లించనున్నది. జూన్‌ 30తో ముగిసే ప్రతి ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించడం ఆనవాయితీ. జులై - జూన్‌ మధ్య కాలాన్ని ఆర్బీఐ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.

2018 జూన్‌ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి డైరెక్టర్ల బోర్డు రూ.50,000 కోట్ల డివిడెండ్ ప్రభుత్వానికి చెల్లించాలని బుధవారం జరిగిన సమావేశంలో నిర్ణయించింది. ఈ ఏడాది మార్చిలో ఇప్పటికే రూ.10వేల కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కూడా ఆర్బీఐ ప్రభుత్వానికి చెల్లించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే 2017 జూన్‌ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ కేవలం రూ.30,659 కోట్ల డివిడెండ్ మాత్రమే చెల్లించింది. 

రూ.50 కోట్ల రుణం దాటితే విదేశీ యానంపై నిషేధం? 
బ్యాంకుల నుంచి రూ.50 కోట్ల పైనా రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్న వారికి విదేశీయానం నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని సమాచారం. ఇందులో భాగంగానే ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు ఇక మీదట ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకుండా ఉండేలా కఠిన వైఖరి అనుసరించాలని యోచిస్తోంది.

దీని కోసం ఆర్ధిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కమిటీ వేయగా పలు సూచనలు చేసింది. ఇందుకోసం దేశీయ పాస్‌పోర్టు చట్టం సెక్షన్‌ 10లో సవరణ. చేయనున్నది. రూ.50 కోట్లు, ఆపై రుణాలు తీసుకునే వారి పాస్‌పోర్టు వివరాలను కూడా తప్పనిసరిగా బ్యాంకులు సేకరించాలని ఇది వరకే ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.