న్యూఢిల్లీ: భారతావనిలో చరిత్రాత్మక వేడుకకు దేశ రాజధాని ‘హస్తిన’లోని తలత్కోరా స్టేడియం వేదిక కానున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, సాధారణ పొదుపు ఖాతాలను నిర్వహించిన తపాలాశాఖ శనివారం నుంచి యావత్ భారతీయులకు ప్రత్యేకించి గ్రామీణులకు బ్యాంకింగ్ సేవలను ప్రారంభించనున్నది. ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలోని తలత్కోరా స్టేడియంలో తపాలా బ్యాంక్‌ సేవలను  (ఐపీపీబీ) ప్రారంభిస్తారు. ఇదే సమయంలో ఐపీపీబీ సేవలు దేశంలోని 650 శాఖలు, 3,250 యాక్సెస్‌ పాయింట్ల వద్ద లైవ్‌లో ప్రారంభం కానున్నాయి. 

‘ఐపీపీబీ కార్యకలాపాలతో సాధారణ పౌరులకు వేగవంతంగా ఆర్థిక సేవలు అందుతాయి. గ్రామీణులకు ఈ సేవలు ఉపయుక్తంగా ఉంటాయి. ఈ ఏడాది దిసెంబర్ చివరి కల్లా దేశంలోని 1.55 లక్షల తపాలా శాఖ కార్యాలయాల్ని ఐపీపీబీ వ్యవస్థతో అనుసంధానిస్తాం. ఈ చెల్లింపుల బ్యాంకులో భారత ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది. తపాలా శాఖకు మూడు లక్షల పైచిలుకు పోస్ట్‌మ్యాన్‌లు, గ్రామీణ్‌ డాక్‌ సేవక్స్‌ ఉన్నారు’ అని తపాలా శాఖ అధికారులు చెప్పారు. 
 
సుమారు 20 ఏళ్ల క్రితం వరకు పోస్ట్‌  అన్న కేక వినడమే ఆలస్యం అన్నట్లు పరుగులు తీస్తూ వెళ్లేవాళ్లం. ఉత్తరమా.. టెలిగ్రామా.. అందులో ఏమిటి విషయం అన్న ఆతృత ఉండేది. ఇప్పటి వాట్సప్‌, ఫేస్‌బుక్‌ కాలంలో ఉత్తరాలు రాసుకోవడం పూర్తిగా తగ్గిపోయింది.  ఈ నేపథ్యంలో పోస్టాఫీసు పని అయిపోయిందనుకోగానే ఇండియాపోస్ట్‌కు చెల్లింపు బ్యాంకు లైసెన్సు దక్కిందన్న వార్త వచ్చింది. ఇక గ్రామీణులకు చిరపరిచితమైన ఈ పోస్టాఫీసులు బ్యాంకుల అవతారం ఎత్తనున్నాయి.  అంతే కాదు.. పోస్ట్‌ అంటూ వచ్చే పోస్ట్‌మాన్‌ ఇపుడు బ్యాంకర్‌గా మారి మీ ముంగిట్లోకి వచ్చి మరీ మరీ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తారు.

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఇది త్వరలో గ్రామాల్లో మరింతగా బ్యాంకింగ్‌ సేవలు చొచ్చుకెళ్లడానికి ఉపయోగపడనుంది. 100 శాతం ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటూ తపాలా విభాగం కింద పనిచేసే ఈ చెల్లింపుల బ్యాంకు సాధారణ పౌరులకూ బ్యాంకు సేవల్ని సులభతరం చేయనున్నది. అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతాల్లో 11 వేల మంది పోస్ట్‌మాన్‌లు ఇంటింటికీ సేవలు అందిస్తారు.

తపాలా శాఖకు  గ్రామీణ ప్రాంతంలో 1.3 లక్షల బ్రాంచ్‌లు వచ్చాయి. ఇప్పటికే పోస్టల్‌ విభాగానికి దేశవ్యాప్తంగా 37 కోట్ల ఖాతాలున్నాయి. అందులో 17 కోట్లు సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలు. వీటిని ఐపీపీబీతో అనుసంధానం చేస్తారు. ప్రస్తుత పోస్టల్‌ వినియోగదార్లకు సైతం ఐపీపీబీ సేవలను అందిస్తారు. ఆ లెక్కన ఐపీపీబీ గ్రామగ్రామాల్లోకీ వెళ్లడానికి ఎంతో సమయం పట్టదు. అదనంగా గ్రామీణ్‌ డాక్‌ సేవక్స్‌ల సేవలూ ఉండడం వల్ల మరింత వేగంతో ముందుకు వెళ్లవచ్చు.

గడపగడపకూ బ్యాంకింగ్‌ సేవలు ఐపీపీబీ ప్రత్యేకం కానున్నాయి. తద్వారా పోస్టాఫీస్ పేమెంట్ బ్యాంక్ గ్రామీణులకు, ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలను చాలా సులభతరం చేయనుంది. పోస్ట్‌మాన్‌ ద్వారా కొత్తతరం బ్యాంకింగ్‌, చెల్లింపు పద్ధతులను గ్రామీణులకు అందజేయనుంది. ఇందులో ముఖ్యంగా ఖాతా తెరవడం, నగదు డిపాజిటు/ఉపసంహరణ, నగదు బదిలీలు, రీఛార్జ్‌, బిల్లు చెల్లింపు సేవలు ఉంటాయి. ఇంకా ఎంటర్‌ప్రైజ్‌, మర్చంట్‌ చెల్లింపులూ చేసుకోవచ్చు. పాన్‌ అప్‌డేట్‌, నామినేషన్‌, స్టేట్‌మెంట్‌, స్టాండర్డ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ వంటి ఇతరత్రా సేవలు కూడా అందిస్తారు. 

అంతేకాదు.. ఐపీపీబీతో థర్డ్‌పార్టీ సేవలూ ఉంటాయి. బజాజ్‌ అలయంజ్‌తో జీవిత బీమా సేవలతోపాటు పీఎన్బీతో కలిసి రుణాలు ఇవ్వడానికి ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నది. మ్యూచువల్‌ ఫండ్‌ సేవలనూ ఇదే పద్ధతిలో అందిస్తుంది. ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌, ఐఎమ్‌పీఎస్‌ లావాదేవీల వసతులు కూడా లభిస్తాయి. పింఛను, సబ్సిడీ, ఎమ్‌ఎన్‌ఆర్‌ఈజీఏ నగదు బదిలీ కూడా ఐపీపీబీ ద్వారా చేయవచ్చు. 2017లో ఆర్‌బీఐ నుంచి పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్స్‌కు అనుమతి రావడంతో మొత్తం మీద అన్ని బ్యాంకు సేవలనూ ఇవి అందిస్తాయి. కాకపోతే రుణాలు మాత్రం ఇవ్వలేవు.

ఇంకా మైక్రో ఏటీఎమ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌, ఐవీఆర్‌ పద్ధతుల్లోనూ అందిస్తారు. వీటితో పాటు క్యూఆర్‌ కార్డ్‌నూ అందిస్తుంది. దీని ద్వారా మీ బ్యాంకు ఖాతాను మీరు వాడుకోవచ్చు. ఖాతా నంబర్ గుర్తు పెట్టుకోకుండానే లావాదేవీలు చేయడానికి దీని ద్వారా వీలవుతుంది. అయితే ఈ లావాదేవీలన్నిటికీ.. బయోమెట్రిక్‌ తనిఖీ ఉంటుంది. అంటే మీ క్యూఆర్‌ కార్డును పోగొట్టుకున్నా, మీ నగదు భద్రమేనన్న మాట.

ప్రస్తుతం పోస్టాఫీసుల్లో సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలున్నవారందరూ తమ ఖాతాలను ఐపీపీబీ ఖాతాలకు అనుసంధానం చేసుకోవడానికి వీలు కల్పిస్తారు. ఐపీపీబీ సేవింగ్స్‌ ఖాతాను రూ.100 నిల్వతో ప్రారంభించొచ్చు. రోజు చివరకు నగదు నిల్వ పరిమితి రూ.లక్ష మాత్రమే.  ఈ అనుసంధానంతో రూ.లక్ష కంటే ఎక్కువగా ఉన్న మొత్తం ఆటోమేటిక్‌గా వినియోగదారు పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాకు బదిలీ అవుతుంది. నెలవారీ సగటు నిల్వ పరిమితి లేదు. అంటే తక్కువ నిల్వలున్నా కూడా ఛార్జీలు పడవన్నమాట. అదే సమయంలో ఎన్ని సార్లయినా నగదు డిపాజిట్‌ చేయవచ్చు. ఉపసంహరించుకోవచ్చు. ఐపీపీబీ సేవింగ్స్‌ ఖాతాదార్లకు తమ ఖాతాలో ఉండే మొత్తంపై 4 శాతం వార్షిక వడ్డీ రేటును చెల్లిస్తారు. మూడు నెలలకోసారి దీనిని జమ చేస్తారు.

కాకుంటే ఇంటివద్దకే వచ్చి అందించే సేవలకు ఛార్జీలు వసూలు చేస్తారు. నగదు డిపాజిట్‌, ఉపసంహరణ కాకుండా చేసే ఇతరత్రా డిజిటల్‌ లావాదేవీలకి ఒక్కోదానికి రూ.15 చొప్పున ఛార్జీ ఉంటుంది. ఇక నగదు డిపాజిట్‌, ఉపసంహరణకైతే ఒక్కో లావాదేవీకి రూ.25 ఉంటుంది. ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయని కొన్ని మార్కెట్‌ వర్గాలు భావిస్తుండడం వేరే సంగతి. ఎంత ఇంటి వద్దకు వచ్చినా.. గ్రామీణులు చేసే నగదు డిపాజిట్లు,  ఉపసంహరణలు తక్కువ మొత్తంలోనే ఉంటాయి కాబటి ఇవి ఎక్కువ ఛార్జీలుగా అనిపిస్తాయని.. ప్రారంభంలోనే ఇంత ఛార్జీలతో వస్తే ప్రజలు ముందు ఎలా వస్తారని అంటున్నారు.

2016 ఆగస్టులో భారత ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉండేలా పోస్టల్‌ విభాగం ఐపీపీబీని ఏర్పాటు చేసింది. 2017 జనవరిలో పోస్టల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌, జార్ఖండ్ రాజధాని రాంచీల్లో రెండు పైలట్‌ శాఖల్లో సేవలు మొదలయ్యాయి. 650 శాఖల ఏర్పాటుతో దాదాపు అన్ని జిల్లాల్లోకి అడుగుపెట్టాలని ప్రతిపాదించింది. గతేడాది అక్టోబర్ నెలలో ఐపీపీబీ ఎండీ కం సీఈఓగా సురేశ్‌ సేథి నియమితులయ్యారు. గత నెల 21వ తేదీన ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలు ప్రారంభం కావాల్సి ఉన్నా మాజీ ప్రధాని వాజపేయి మరణంతో కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.