ప్రతి నెలలో మనమంతా కొన్ని పనులు గుర్తు పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఈ జూన్ నెలలో ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య జనం కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు, వాటి గడువులు గురించి తెలుసుకుందాం రండి. 

ప్రతి నెల కొన్ని బిల్లులు మనం కచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. వాటిని మర్చిపోతే జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని ప్రభుత్వాలు సూచించే పనులు కూడా మర్చిపోకుండా చేయాల్సి ఉంటుంది. జూన్ నెలలో తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఫైనాన్షియల్ పేమెంట్స్ డేట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆధార్ - పాన్ లింకింగ్ గడువు

ఆధార్ నంబరును పాన్ కార్డుతో లింక్ చేయాల్సిన తుది గడువు జూన్ 14. ఇంకా లింక్ చేయనివారు త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేకపోతే పాన్ కార్డ్ చెల్లుబాటు కాకపోవచ్చు. మీరు కూడా ఇప్పటికీ ఆధార్ నంబరును పాన్ కార్డుతో లింక్ చేయకపోతే వెంటనే చేసేయండి. గడువు దగ్గర వచ్చాకా చేద్దాం అనుకుంటే సర్వర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు 

ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అడ్వాన్స్ టాక్స్‌ను జూన్ 15వ తేదీ లోపు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని మర్చిపోతే, పైనాన్షియల్ పెనాల్టీలు విధించే అవకాశం ఉంటుంది.

ఉద్యోగులు ఈ నెలలోనే టీడీఎస్ దాఖలు చేయాలి

ఉద్యోగులకు జీతాలపై టీడీఎస్ (TDS) తీసుకునే సంస్థలు జూన్ 15వ తేదీలోపు ఫారం 16, 16A జారీ చేయాలి. ఇది వార్షిక ఆదాయపు పన్ను దాఖలుకు అవసరం. టీడీఎస్ మినహాయింపులకు సంబంధించిన సమాచారం సరైన సమయానికి అందకపోతే ఉద్యోగులు ITR ఫైల్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

HDFC బ్యాంక్ ముఖ్య సూచనలు

HDFC బ్యాంక్ తమ కస్టమర్‌లకు కొన్ని ముఖ్య సూచనలు చేసింది. టాటా ఇన్ఫినిటీ, న్యూ ప్లస్ క్రెడిట్ కార్డులతో ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ లాంజ్‌లలో సౌకర్యాలు ఉపయోగించుకోవాలంటే, గత 3 నెలల్లో చేసిన ఖర్చులకు సంబంధించి బ్యాంకు వోచర్లు సబ్మిట్ చేయాలని సూచించింది. కాబట్టి సంబంధిత ఖాతాదారులు ముందుగానే తెలుసుకుని అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి.