కొత్తగా తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల ఉద్యోగుల వేతనం , పీఎఫ్, పనిగంటలు పెరగనున్నాయి. 

జూలై 1 నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది . ఈ నేపథ్యంలో టేక్ హోమ్ శాలరీ, ప్రావిడెంట్ ఫండ్‌, పని గంటలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం వుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఇంకా నాలుగు లేబర్ కోడ్‌ల కింద నిబంధనలను రూపొందించలేదు. 23 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే వేతనాలపై కోడ్ కింద నిబంధనలను ప్రచురించాయని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. 

కొత్త చట్టాల ప్రకారం.. కంపెనీలు పని గంటలను రోజుకు 8-9 గంటల నుంచి 12 గంటలకు పెంచవచ్చు. అయితే, వారు ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లను అందించాల్సి వుంటుంది. దీంతో వారంలో పనిదినాలు నాలుగు రోజులకు తగ్గించబడతాయి. కానీ వారం మొత్తంలో పనిగంటల్లో ఎలాంటి ప్రభావం వుండదు. కొత్త వేతన కోడ్ ప్రకారం వారానికి 48 గంటలు తప్పనిసరి. కొత్త వేతన కోడ్ ప్రకారం స్థూల నెలవారీ జీతంలో కనీసం 50 శాతం బేసిక్ జీతం వుంటుంది. దీని వల్ల ఉద్యోగుల టేక్ హోమ్ జీతం కూడా గణనీయంగా మారుతుంది. 

అంతేకాదు.. ఉద్యోగులు, యజమానులు అందించే పీఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా పెరగనుంది. కొత్త కార్మిక చట్టాల ప్రకారం.. రిటైర్‌మెంట్ కార్పస్, గ్రాట్యుటీ కూడా పెరగనుంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్ధితులు వంటి 29 కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవడం ద్వారా నాలుగు లేబర్ కోడ్‌లు సృష్టించబడ్డాయి. పార్లమెంట్ సైతం ఈ కోడ్‌లను ఆమోదించింది. అయితే రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో కార్మికులు ఒక అంశం కాబట్టి.. రాష్ట్రాలు కూడా కొత్త కోడ్‌ల కింద నియమాలను తెలియజేయాల్సి వుంటుంది. 

కొత్త లేబర్‌ కోడ్‌ అమలు అనంతరం 180 రోజుల పని తర్వాత సెలవులకు అర్హులు. అంతకుముందు దీని కాల వ్యవధి 240 రోజులు. రోజుకు 10 గంటలు పనిచేసే వారికి రెండు వారాల సెలవులు ఉంటాయి. రోజుకు 8 గంటలు పని చేసే వారికి ఒక వారం సెలవు ఉంటుంది. ఏ కార్మికుడు వారానికి 48 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. కొత్త లేబర్ కోడ్ కంపెనీలకు కార్మికులను తొలగించడాన్ని సులభతరం చేస్తుంది. 300 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఉద్యోగులను తొలగించాల్సి వస్తే ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అలాగే ఉద్యోగులకు పాన్-ఇండియా కనీస వేతనం నిబంధన కూడా ఉంటుంది.