Asianet News TeluguAsianet News Telugu

మాంద్యం దిశగా ప్రపంచం..2009 నాటికంటే దారుణమే: ఐఎంఎఫ్

కరోనా మహమ్మారి వల్ల మందగమనం వైపు పయనిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2008-09 నాటి ఆర్థిక సంక్షోభం పరిస్థితుల కంటే ఘోరమైన స్థితిని ఎదుర్కోనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్​) హెచ్చరించింది. 

IMF warns coronavirus recession could be worse than 2009
Author
New Delhi, First Published Mar 24, 2020, 2:18 PM IST

వాషింగ్టన్: కరోనా మహమ్మారి వల్ల మందగమనం వైపు పయనిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2008-09 నాటి ఆర్థిక సంక్షోభం పరిస్థితుల కంటే ఘోరమైన స్థితిని ఎదుర్కోనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్​) హెచ్చరించింది. 2020 ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారుతుందని ఆ సంస్థ చీఫ్ క్రిస్టానియా జార్జివా తెలిపారు. 

తగిన చర్యలు తీసుకోవడం ద్వారా 2021 లోనే కోలుకోవచ్చని ఐఎంఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక నష్టాన్ని పరిమితం చేసేందకు అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని ఎంత వేగంగా అడ్డుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంత బలంగా పుంజుకుంటుందని పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్య విధానాన్ని సులభతరం చేస్తున్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల చర్యలను  ఐఎంఎఫ్ స్వాగతించింది​. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న సాహసోపేతమైన చర్యలు ఆ దేశ ప్రయోజనాలు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తాయని వివరించింది.

కరోనా వైరస్ వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, తక్కువ ఆదాయ దేశాలు గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని  ఐఎంఎప్ ఆందోళన వ్యక్తం చేసింది. మందగమనం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 83 బిలియన్ డాలర్లు మార్కెట్ల నుంచి తరలి వెళ్లినట్లు తెలిపింది. రుణ బాధలో ఉన్న తక్కువ-ఆదాయ దేశాల గురించి ఆందోళన చెందుతున్నామని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఈ సమస్యను ప్రపంచ దేశాలతో కలిసి పరిష్కరిస్తామని తెలిపింది.

Also read:ఫస్ట్ సేఫ్టీ.. తర్వాతే ప్రొడక్షన్ ప్లాంట్ల షట్ డౌన్‌కు సియామ్, ఏసీఎంఏ విజ్ఞప్తి

జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ చీఫ్ జార్జివా మాట్లాడుతూ తక్కువ ఆదాయం గల దేశాలను ఆదుకునేందుకు మద్దతు పలికేందుకు సంపన్న దేశాలు ముందుకు రావాలన్నారు. లక్ష కోట్ల డాలర్ల రుణాలను కల్పించేందుకు ముందుకు రావాలని కోరారు. 

మరోవైపు కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు డిఫెన్స్ వ్యూహం సరిపోదని, అటాకింగ్ ధోరణితో ముందుకెళ్లాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ ట్రెడ్రోన్ అథనోమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటాకింగ్ స్ఫూర్తితో దూసుకెళితేనే గెలుస్తామన్నారు. ఇంటికే పరిమితం కావడం వంటి చర్యలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని పునరుద్ఘాటించారు. కేవలం ఈ చర్యలు పాటిస్తే సరిపోదని, విజయం కోసం విస్త్రుత చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios