భారత జీడీపీ వృద్ధి రేటును ఇటీవల పలు అంతర్జాతీయ సంస్థలు తగ్గిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గతవారం ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా భారత్‌కు షాకిచ్చింది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత్‌కు షాకిచ్చింది. భారత వృద్ధి రేటులో కోత విధించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.8 శాతంగా వుండొచ్చని అంచనా వేసింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదవ్వగా.. 2022- 23 ఆర్ధిక సంవత్సరానికి గాను 8.2 శాతం నమోదయ్యే అవకాశం వుందని ఈ ఏడాది జనవరిలో ఐఎంఎఫ్ అంచనాను వెలువరించింది. తర్వాత జూలైలో 7.4 శాతం వృద్ధి అంచనా వేసింది. తాజాగా మరోసారి అంచనాల్లో కోత పెడుతూ.. భారత వృద్ధి రేటు 6.8 శాతం మాత్రమే నమోదు కావొచ్చని తెలిపింది. తక్కువ ఉత్పత్తితో పాటు డిమాండ్ అంతంత మాత్రంగానే వుండటం వంటి పరిణామాల కారణంగా వృద్ధి రేటులో కోత విధించినట్లు ఐఎంఎఫ్ పేర్కొంది.
ఇకపోతే... ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేటు అంచనాలను కూడా ఐఎంఎఫ్ మంగళవారం వెలువరించింది. 2021లో 6 శాతంగా వున్న ఈ రేటు.. ఈ ఏడాది 3.2 శాతం నమోదు కావొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇది వచ్చే ఆర్ధిక సంవత్సరం మరింత తగ్గి 2.7 శాతంగా నమదు కావొచ్చని తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, చైనాలో లాక్‌డౌన్ పరిస్ధితులు వంటివి ఇందుకు కారణమని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇక అగ్రరాజ్యం అమెరికా వృద్ధి రేటు కేవలం ఒక్క శాతానికే పరిమితం కావొచ్చని అంచనా వేసింది.
కాగా... అంతర్జాతీయంగా ఆర్ధిక పరిస్ధితులను పరిగణనలోనికి తీసుకుని 2022- 23 ఆర్ధిక సంవత్సరానికి గాను భారత ఆర్ధిక వ్యవస్థకు అంచనా వేసిన వృద్ధి రేటును గతవారం ప్రపంచ బ్యాంక్ తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా జూన్ 2022లో అంచనా వేసిన వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. అయితే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పుంజుకుంటుందని ప్రపంచబ్యాంక్ తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో భారత ఆర్ధిక వ్యవస్థ 8.7 శాతం వృద్ధిని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధితో వార్షిక సమావేశానికి ముందు విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్ తాజా దక్షిణాసియా ఆర్ధిక ఫోకస్‌లో సవరించిన అంచనాలు వెల్లడయ్యాయి.
ALso Read:భారత వృద్ధి రేటు అంచనాను సవరించిన ప్రపంచ బ్యాంక్.. కానీ పుంజుకుంటుందంటూ నివేదిక
ప్రపంచబ్యాంక్ దక్షిణాసియా చీఫ్ ఎకనామిస్ట్ హన్స్ టిమ్మర్ ప్రకారం దక్షిణాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గానే వుంది. సాపేక్షింగా బలమైన వృద్ధితో కోవిడ్ మొదటి దశలోనే భారత ఆర్ధిక వ్యవస్థ పదునైన సంకోచం నుంచి తిరిగి పుంజుకుందని టిమ్మర్... జాతీయ వార్తా సంస్థ పీటీఐతో చెప్పారు. విదేశీ రుణం పెద్దగా లేకపోవడం వల్ల ప్రయోజనం వుందని భావించిన హన్స్.. భారతదేశం బాగా పనిచేసిందని కితాబిచ్చారు. భారతదేశ ద్రవ్య విధానం వివేకవంతంగా వుందని.. ముఖ్యంగా సేవల రంగంలో ఇండియా బాగా రాణిస్తోందన్నారు.
ప్రస్తుత అంతర్జాతీయ వాతావరణం కారణంగా ఆర్ధిక సంవత్సరానికి తగ్గిన అంచనా ఎక్కువగా వుందన్నారు. ఇది భారత్ సహా అన్ని దేశాల్లో క్షీణిస్తోందని టిమ్మర్ పేర్కొన్నారు. ఏడాది మధ్యలో ఒక ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ కనిపిస్తోందని.. ప్రపంచవ్యాప్తంగా మందగమనం యొక్క తొలి సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. క్యాలెండర్ ఇయర్ రెండవ భాగంలో భారత్ సహా అనేక ఇతర దేశాలలో సాపేక్షంగా బలహీనంగా వుంటుందని టిమ్మర్ అభిప్రాయపడ్డారు.
