న్యూఢిల్లీ: భారత పన్నుల విధానాల్లో జీఎస్టీని ప్రవేశపెడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కీలకమైన మైలురాయి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. అంతే కాదు వచ్చే మూడు దశాబ్ధాల్లో ప్రపంచ ఆర్థిక ప్రగతికి భారత్ చోధక శక్తిగా ఉంటుందని కూడా వ్యాఖ్యానించింది. జీఎస్టీ ప్రవేశపెడుతూ కేంద్రం చేపట్టిన సంస్కరణ అతిపెద్దదని తెలిపింది. 

జీఎస్టీ రేట్లు సులువుగా ఉండాలి
అయితే జీఎస్టీ రేట్ల విధానం ఇంకా సులువుగా ఉండాలని ఐఎంఎఫ్‌ సూచించింది. వివిధ రకాల జీఎస్టీ రేట్లు, ఫీచర్ల కారణంగా ఫిర్యాదులు, నిర్వహణ ఖర్చు ఎక్కువ అవుతోందని తెలిపింది.

తక్కువ పన్ను రేట్లతో రెండు శ్లాబులు, ఎంపిక చేసిన వస్తువులకు ఎక్కువ పన్ను రేటుతో ఒక శ్లాబులో జీఎస్టీ విధిస్తే సత్ఫలితాలతో మంచి పురోగతి ఉంటుందని, ఆదాయం స్థిరంగా ఉంటుందని ఐఎంఎఫ్‌ తన వార్షిక నివేదికలో తెలిపింది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పరోక్ష పన్నుల విధానం.. జీఎస్టీని 2017 జులై 1 నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

పలురకాల శ్లాబ్‌లతో క్లిష్టంగా జీఎస్టీ
జీఎస్టీలో పలు రకాల పన్ను శ్లాబ్‌లతో క్లిష్టంగా ఉందని, దాని పురోగతిని ఏ మాత్రం దెబ్బతినకుండా విధానాన్ని సరళతరం చేయాలని ఐఎంఎఫ్‌ పేర్కొంది. వస్తు సేవలపై పరోక్ష పన్నుల విధానాన్ని తేవడంలో జీఎస్టీది కీలక పాత్ర అని తెలిపింది.

భారత్‌ కాకుండా మరో నాలుగు దేశాలు నాలుగు శ్లాబుల పన్ను రేట్లు విధిస్తున్నాయన్నది. వ్యాట్‌ విధిస్తున్న 115 దేశాల్లో 49 దేశాలు ఒకే రేటులో పన్ను విధిస్తున్నాయని, 28 దేశాలు రెండు శ్లాబుల్లో పన్నులు వేస్తున్నాయని ఐఎంఎఫ్‌ తెలిపింది. భారత్‌లో సున్నా శాతం, 12శాతం, 18శాతం, 28శాతం శ్లాబుల్లో జీఎస్టీ విధిస్తున్నసంగతి తెలిసిందే.

30 ఏళ్ల పాటు ప్రపంచాన్నిశాసించనున్న భారత్‌ వృద్ధి
వచ్చే మూడు దశాబ్దాల్లోనూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి భారత్‌ చుక్కానిలా నిలుస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. మరిన్ని వ్యవస్థీకృత సంస్కరణల దిశగా భారత్‌ అడుగులు వేయాలని సూచించింది. కొనుగోలు శక్తిపరంగా ప్రస్తుతం ప్రపంచ వృద్ధికి భారత్‌ 15 శాతం సహకారం అందిస్తుందని ఐఎంఎఫ్‌ డైరెక్టర్ రనిల్‌ సాల్గాడో అన్నారు.

అయితే చైనా స్థాయిలో వాణిజ్యం లేదని చెప్పారు. ‘యువత సంఖ్య తగ్గడం ప్రారంభం అవ్వడానికి భారత్‌కు మరో మూడు దశాబ్దాల సమయం ఉంది. ఇది చాలా ఎక్కువ సమయమే. భారత్‌ చేతిలో ఉన్న మంచి అవకాశం ఇది. ఆసియాలో కొన్ని దేశాలు మాత్రమే ఇలాంటి అవకాశాన్ని కలిగి ఉన్నాయ’ని ఆయన చెప్పారు.

2018-19లో వృద్ధి 7.3% 
వచ్చే మూడేళ్లు అంతర్జాతీయ వృద్ధికి భారత్‌ కేంద్ర బిందువుగా నిలుస్తుందని ఐఎంఎఫ్ డైరెక్టర్ రనిలో సాల్గాడో అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా అందిస్తున్న సహకారం స్థాయికి త్వరలోనే భారత్‌కు చేరుకుంటుందని ఆయన చెప్పారు.

వినియోగం పుంజుకోవడం, పెట్టుబడుల వాతావరణం మెరుగవ్వడం లాంటి వాటి కారణంగా 2018-19లో భారత వృద్ధి 7.3 శాతంగా నమోదుకావచ్చని నివేదికలో ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు అంచనా వేసింది. ‘2016 తర్వాత నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు రూపంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ రెండు రకాల కుదుపులకు లోనైంది. ఇప్పుడు వృద్ధి పుంజుకుంటోంది. సాధారణంగా సానుకూల స్థూల ఆర్థిక విధానాలు, స్థిర విధానాలు, కీలక సంస్కరణలు తదితరాలు ఇటీవల కొన్నేళ్లలో భారత్‌కు కలిసొచ్చాయ’ని సాల్గాడో చెప్పారు. 

ఇబ్బందులు స్వల్పకాలికమే
స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, దీర్ఘకాలంలో జీఎస్‌టీ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ‘జీఎస్‌టీ అమలు ప్రక్రియ కొంచెం కష్టమైనదే. ఇతర దేశాలు కూడా ఇబ్బంది పడ్డాయి. భారత్‌లో ఇది మరింత కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ప్రతిపాదనకు 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఒప్పించాల్సి ఉంటుంది. అయినప్పటికీ దీనిని అమల్లోకి తీసుకొని రావడం గొప్ప విజయమేన’ని అన్నారు.

సంస్కరణలు కొనసాగించాల్సిందే
దివాలా చట్టం అమల్లోకి తేవడం ఇటీవల భారత్‌ సాధించిన ఇతర విజయాల్లో ఒకటని ఐఎంఎఫ్ డైరెక్టర్ రనిల్ సాల్గాడో అన్నారు. ‘ఈ చట్టం అమల్లోకి వచ్చాక కొన్ని సానుకూలతలు కనిపిస్తున్నాయి. మున్ముందు కూడా ఈ ధోరణి కనిపిస్తుందని భావిస్తున్నాం.

ఇక మూడో విజయం.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిత స్థాయిలో ఉంచేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. అధికారికంగా 2016లోనే ఈ తరహా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ.. అంతకుముందు నుంచి కూడా ఈ విధానాన్ని భారత్‌ ఆచరించింది’ అని అన్నారు. వ్యాపార వాతావరణాన్ని మెరుగపర్చడం, ఎఫ్‌డీఐల సరళీకరణ కూడా మరికొన్ని కీలక సంస్కరణలను భారత్‌ చేపట్టిందని తెలిపారు. సమీపకాలంలో ప్రస్తుత సంస్కరణలు సమర్థంగా అమలు చేస్తే అనుకున్న వృద్ధి దిశగా భారత్‌ ముందుకు వెళుతోందని పేర్కొన్నారు.

క్రమంగా కఠిన ద్రవ్య విధానం దిశగా అడుగులేయాలి
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకొని క్రమంగా కఠిన విధాన దిశగా ఆర్‌బీఐ మొగ్గు చూపాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్‌ అభిప్రాయపడింది. కనీస మద్దతు ధర పెంపు, చమురు ధరలు పెరగడం లాంటివి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచుతాయని తెలిపింది. ద్రవ్యలోటు పెరిగేందుకు కూడా ఇది దోహదం చేయొచ్చని పేర్కొంది. జీఎస్‌టీ పన్ను విధానాన్ని సరళీకరించే అంశాన్ని భారత్‌ పరిశీలించాలని సూచించింది.