ఎయిర్ ఇండియా నూతన సీఈవోగా టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ అయిన ఇల్కర్ ఐసీని నియమించాలని సంస్థ భావించింది. అయితే తన నియామకంపై భారతీయ మీడియాలో వస్తున్న కథనాలకు కలత చెందానని, అందుకే టాటా సన్స్ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.
ఎయిరిండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (Air India New Ceo) టాటా సన్స్ ఆఫర్‌ను టర్కీ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్ ఇల్కర్ ఐసీ (Ilker Ayci) తిరస్కరించారు. టాటా యాజమాన్యంలోకి వచ్చిన జాతీయ ఎయిర్ లైన్స్ అయినటువంటి ఎయిర్ ఇండియా నూతన సీఈవోగా (Air India New Ceo) టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ అయిన ఇల్కర్ ఐసీని (Ilker Ayci) నియమించాలని సంస్థ భావించింది. అయితే తన నియామకంపై భారతీయ మీడియాలో వస్తున్న కథనాలకు కలత చెందినట్లు ఇల్కర్ ఐసీ తెలిపారు.
తను చేపట్టబోయే స్థానానికి అర్హతను తనపై రంగు అద్ది చూస్తున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా నూతన సీఈవో పదవిని అంగీకరించడం గౌరవప్రదమైన నిర్ణయం కాదని ఐసీ తెలిపారు.
ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియాకు నాయకత్వం వహించడానికి ఇల్కర్ ఐసీ నియామకాన్ని ఫిబ్రవరి 14న టాటా సన్స్ ధృవీకరించింది. ఏప్రిల్ 1న లేదా అంతకు ముందు ఎయిర్‌లైన్‌లో ఐసీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కానీ ఐసీ నియామకాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచ్ వ్యతిరేకించింది. 1971లో ఇస్తాంబుల్‌లో జన్మించిన ఇల్కర్ ఐసీ, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు సన్నిహితుడిగా పేరుంది. అంతేకాదు 1994-1998 మధ్య ఇస్తాంబుల్ మేయర్‌గా ఎర్డోగాన్ ఉన్న సమయంలో ఐసీ ఆయనకు సలహాదారుగా కూడా ఉన్నారు.
కశ్మీర్ విషయంలో ఎర్డోగన్ పలుమార్లు పాకిస్థాన్‌కు మద్దతు పలికారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు టర్కీ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని ఆయన చాలాసార్లు చెప్పారు. ఎర్డోగాన్ కాశ్మీర్‌ను పాలస్తీనాతో పోల్చారు కాశ్మీర్‌లో భారతదేశం దురాగతాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎర్డోగాన్ సన్నిహితుడికి పదవి ఇవ్వడం ఎంత వరకూ సబబు అవుతుందని స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రశ్నించింది. వివాదం ముదరక ముందే ఇల్కర్ ఐసీ టాటా సన్స్ ప్రతిపాదనను వదులుకోవడం గమనార్హం.
