Asianet News TeluguAsianet News Telugu

ఐఎల్&ఎఫ్ఎస్ క్రైసిస్: ‘లేమాన్’ ముప్పు పొంచి ఉందా?

దివాళా దశకు చేరిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ క్రైసిస్ వెనుక దశాబ్ధ క్రితం అమెరికాలో ‘లేమాన్ బ్రదర్స్’ సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థను పొంచి ఉన్నదా? అని ఆర్థిక వేత్తలు అనుమానిస్తున్నారు. బ్యాంకర్ ఉదయ్ కోటక్ సారథ్యంలోని నూతన బోర్డుకు పరిస్థితిని చక్కదిద్ది ఐఎల్ఎఫ్ఎస్ సంస్థను గాడిలో పెట్టడం సాధ్యమేనా? అని అభిప్రాయ పడుతున్నారు. 

IL&FS: India dodges a Lehman moment. That was the easy part
Author
Mumbai, First Published Oct 3, 2018, 8:51 AM IST

పేరుకు ప్రైవేట్ సంస్థైనా ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న సంస్థ ఐఎల్‌&ఎఫ్‌ఎస్. దాదాపు రూ.90 వేల కోట్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఐఎల్‌&ఎఫ్‌ఎస్ దివాళా స్థాయిలో ఉంది. ఆర్థిక వ్యవస్థపై ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఫైనాన్స్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ సంస్థల బకాయిలు చెల్లించలేక చతికిల పడింది.

పరిస్థితి తీవ్రతకు చేరుకోవడంతో కేంద్రం.. ఆర్బీఐ, సెబీ అప్రమత్తం అయ్యాయి. మూడు నెలలుగా సాగుతున్న సంక్షోభానికి తెర దించేందుకు ఐఎల్‌&ఎఫ్‌ఎస్ సంస్థను ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకున్నా.. సమస్య నుంచి బయట పడవేయగలుగుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభుత్వానికి పరోక్షంగా 40 శాతం వాటా 
ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ను తన ఆధీనంలోకి తీసుకోకపోతే సంక్షోభం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదమని ప్రభుత్వం భావించడానికి కారణాలేమిటి? ఎల్‌ఐసీ, వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాతో ప్రభుత్వానికి ఇందులో పరోక్షంగా దాదాపు 40 శాతం వాటా ఉన్న నేపథ్యంలో దారి తప్పుతున్న కంపెనీని తన చేతిలో తీసుకోవడంలో ఆశ్యర్యం లేదు.

కానీ, కంపెనీ డిఫాల్ట్ కావడం ఆర్థిక వ్యవస్థకు విఘాతం అన్న వ్యాఖ్యానాలే ఇన్వెస్టర్ల మదిని తొలిచేస్తున్నాయి. మరి పరిస్థితిని చక్కదిద్దడం బ్యాంకర్ ఉదయ్ కోటక్ సారథ్యంలోని కొత్త బోర్డుకు తలకు మించిన భారమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం మార్కెట్‌కే హెచ్చరిక
ఈ పరిణామాలు కేవలం ఒక్క ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌కే పరిమితం కాకుండా, రుణ మార్కెట్లను, ఎన్‌బీఎఫ్‌సీలను, మ్యూచువల్ ఫండ్లను, స్టాక్ మార్కెట్లను వెరసి మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ప్రమాదం పొంచి ఉంది. స్టాక్ మార్కెట్ పెరుగుదలను తన పనితీరుకు గీటురాయిగా చూపిన ప్రభుత్వం.. ఇప్పుడు వివిధ జాతీయ, అంతర్జాతీయ కారణాలతో పతనమైతే ఎలా జీర్ణించుకోగలదన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. 

ఇదీ పరిస్థితి తీవ్రత
దశాబ్ధ క్రితం ‘సత్యం కంప్యూటర్స్’ స్థాయిలో పరిస్థితులను చక్కదిద్దేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నదంటే దాని తీవ్రత ఏ స్థాయిదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సత్యం కంప్యూటర్స్ విషయమై పూర్తిస్థాయిలో జోక్యం చేసుకున్న తర్వాత మళ్లీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వ్యవహారంపైనే దృష్టి సారించిండంతోనే తీవ్రతేమిటో అవగతమవుతూనే ఉంది.  

పీకల్లోతు కష్టాల్లో ఐఎల్ఎఫ్ఎస్
అమెరికాకు చెందిన లేమన్ బ్రదర్స్ సంక్షోభ పరిస్థితులు దేశంలో తలెత్తుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. అసలే భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ మోసాలు, మొండి బకాయిలతో కుదేలైంది. ఈ తరుణంలో దేశంలోనే అతిపెద్ద మౌలికాభివృద్ధి, ఆర్థిక సేవల సంస్థగా ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థను కలవర పరుస్తోందని ఆర్థికవేత్తలు అభివర్ణిస్తున్నారు. 

మ్యూచువల్ ఫండ్ మార్కెట్లపై ప్రభావం ఇలా
మరోవైపు ఈ సంక్షోభం ప్రభావం మ్యూచువల్ ఫండ్ మార్కెట్లపై ఏ మేరకు ఉంటుందా? అన్నదానిపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఆర్బీఐ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుండగా, ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌లో వాటాదారులుగా ఉన్న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ తగినన్ని ద్రవ్యనిల్వలను సమకూరుస్తామని ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. అయినా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభం ఎంత వరకు కొలిక్కి వస్తుందనేది ప్రశ్నార్థకంగానే కనిపిస్తున్నది.

ఇదంతా ఐఎల్ఎఫ్ఎస్ సాచివేత ధోరణితోనే 
ఆర్థిక పరిస్థితుల్ని పట్టించుకోకుండా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ బోర్డు ప్రదర్శించిన నిర్లక్ష్య పూరిత, సాచివేత ధోరణే ఈ సంక్షోభానికి కారణమా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ముంబైలోని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయ నివేదిక ప్రకారం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కార్పొరేట్ పరిపాలన అత్యంత పేలవంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

ఆర్థిక స్థోమత లేకున్నా వాటాదారులకు  డివిడెండ్లను జారీ చేయడం, సంస్థ ఆర్థిక విషయాల ప్రకటనల్లో వాస్తవ పరిస్థితుల్ని మరుగున పెట్టడం, సంస్థ ఉన్నతోద్యోగులకు భారీగా జీతాలు ఇవ్వడం వంటివి జరిగాయి. తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం కూడా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభంపై విచారిస్తున్నది.

ఐఎల్ఎఫ్ఎస్ మాజీ యాజమాన్యానికి లుకౌట్ నోటీసులు
పీకల్లోతు రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ మాజీ యాజమాన్యం కోసం కేంద్ర ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. రాత్రికిరాత్రి వీరంతా దేశం విడిచి పారిపోయే వీలుందని కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్సీఎల్టీలో పిటిషన్‌ దాఖలు చేసింది.

మాజీ చైర్మన్ రవి పార్థసారథితోపాటు వైస్ చైర్మన్ హరి శంకరన్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాజీ ఎండీ రమేశ్ బవ, డైరెక్టర్ కే రాంచంద్‌లపై ఈ నోటీసులనిచ్చింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు వీటిని పంపారు.

అనారోగ్యంతో లండన్‌లో పార్థసారథి చికిత్స
అనారోగ్యంతో బాధపడుతున్న పార్థసారథి ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నారు. తాజా నోటీసుల నేపథ్యంలో మిగతా ముగ్గురు డైరెక్టర్లు దర్యాప్తు పూర్తయ్యేదాకా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదు.  జూలైలో పార్థసారథి తప్పుకోగా, గత నెల రమేశ్‌తోపాటు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వైభవ్ కపూర్, మరో నలుగురు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేశారు.

కొత్త బోర్డుకు సహకరిస్తామన్న మాజీ బోర్డు సభ్యులు
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ బోర్డును రద్దు చేసి ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నూతన బోర్డుకు చైర్మన్‌గా ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కొటక్‌ను నియమించారు.

ఈ క్రమంలో సంస్థ పరిరక్షణకు అన్నివిధాలా సహకరిస్తామని, కొత్త బోర్డుతో కలిసి పనిచేస్తామని కొటక్‌కు రైద్దెన బోర్డు సభ్యులు, మాజీ స్వతంత్ర డైరెక్టైర్లెన ఎస్‌బీ మాథూర్, ఆర్‌సీ భార్గవ, మైఖెల్ పింటో, జైతీర్థ్ రావు, రీనా కామత్ లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనన్నారు.

నిధుల సమీకరణ యత్నం ఇలా విఫలం
నిధుల సమీకరణకు తాము చాలా ప్రయత్నాలు చేశామని, కానీ అవేవీ ఫలించలేదని ప్రస్తుతం ఐఎల్‌&ఎఫ్‌ఎస్ సంస్థలో మిగిలి ఉన్న సభ్యులు చెప్పారు. వివిధ ప్రాజెక్టులు ఆగిపోయాయని, వీటిని పూర్తి చేయడానికి సంస్థ బ్రతకడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా, నూతన బోర్డు సభ్యులుగా వినీత్ నయ్యర్, జీఎన్ బాజ్‌పాయ్, జీసీ చతుర్వేది, మాలిని శంకర్, నంద్ కిశోర్‌ కొత్త బోర్డులో ఇతర సభ్యులుగా ఉన్న సంగతి విదితమే.

ఇదీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ చరిత్ర
ఎంజే ఫేర్వానీ 1987లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్)ను నెలకొల్పారు. ప్రస్తుతం సంస్థ ఆస్తులు రూ.1,15,000 కోట్లకు పైమాటే అన్న మాట ఎంత నిజమో.. అప్పులు కూడా రూ.91,000 కోట్లు ఉండటం గమనార్హం.

ఈ సంస్థలో 250కిపైగా అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్లు ఉన్నాయి. ఢిల్లీ-నోయిడా టోల్ బ్రిడ్జ్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్), జోజీ లా పాస్ టన్నెల్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతోపాటు రోడ్డు, పవర్, వాటర్, పోర్టు తదితర మౌలిక రంగ ప్రాజెక్టులను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ చేపడుతున్నది.

ఎల్ఐసీ, ఒరిక్స్ సంస్థలకు వాటాలు
ఐఎల్‌&ఎఫ్‌ఎస్ ప్రధాన వాటాదార్లుగా ఎల్‌ఐసీ, ఓరిక్స్ కార్పొరేషన్‌లు ఉన్నాయి. సంస్థ గ్రూప్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ లిమిటెడ్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్స్ లిమిటెడ్ సంస్థలు స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతున్నాయి.

ఎల్ఐసీకి అత్యధిక వాటా ఇలా
ఈ ఏడాది మార్చి నాటికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి అత్యధికంగా 25.34 శాతం.. జపాన్‌కు చెందిన ఓరిక్స్ కార్పొరేషన్‌కు 23.54 శాతం వాటా ఉన్నాయి. అబుదాబీ  ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి 12.56 శాతం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి 12 శాతం, హెచ్‌డీఎఫ్‌సీకి 9.02 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 7.67 శాతం, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐకి 6.42 శాతం వాటాలు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios