ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రిటైలర్‌గా పేరొందిన స్వీడిష్ కంపెనీ ఐకియా తన తొలి స్టోర్‌ను భారత్‌లో ఈ రోజు ప్రారంభమైంది. అది కూడా మన హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేశారు. గత దశాబ్ధకాలంగా భారత్ లో ఐకియా తన స్టోర్ ని భారత్ లో ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. గతంలో అధికారికంగా ప్రకటించినప్పటికీ  కార్యరూపం దాల్చలేదు. చివరకు ఈరోజు హైదరాబాద్ ఐకియా స్టోర్ అట్టహాసంగా ప్రారంభమైంది.

ఈ ఐకియా స్టోర్ కి  చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఈ స్టోర్ ఏర్పాటుకు రూ.1000కోట్లు ఖర్చు చేశారు. నగర శివారు హైటెక్ సిటీ పరిధిలో  13 ఎకరాల్లో 4 లక్షల చదరపు అడుగుల్లో దీనిని నిర్మించారు. మొత్తం 950 ప్రత్యక్ష ఉద్యోగులు మరో 1500 పరోక్ష ఉద్యోగులు ఈ స్టోర్‌లో పనిచేయనున్నారు. అందులో కనీసం సగం మంది మహిళలే కావడం విశేషం.

మొత్తం 7500 ఉత్పత్తులు ఈ స్టోర్‌లో లభిస్తాయి. అందులో 20 శాతం ఉత్పత్తులను స్థానికంగా కొనుగోలు చేస్తున్నవే కావడం గమనార్హం. ఈ స్టోర్ లో లభించే  దాదాపు 1000 ఉత్పత్తులు రూ. 200 లోపే లభించనున్నాయి. ఇందులో లభించే టెక్స్‌టైల్ ఉత్పత్తులన్నీ అత్యుత్తమ కాటన్‌తో తయారు చేసినవి.

బెడ్‌లు, కుర్చీలు, కుక్‌వేర్, కర్టైన్లు, టేబుల్స్‌, లైటింగ్‌, కిచెన్‌ ట్రోలీ, ఓవెన్స్‌, హ్యాంగర్స్‌ వంటి సుమారు 7500 హోం ఫర్నిషింగ్ ఉత్పత్తులు విక్రయించనున్నట్లు తెలిపింది. భారత్‌లోని వెయ్యికిపైగా ఇళ్లను సందర్శించి వారి ఆర్థిక పరిస్థిని, జీవన విధానాన్ని ఐకియా టీం అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా స్టోర్‌లో ఉత్పత్తులు ఏర్పాటుచేశారు. 

అంతేకాకుండా ఈ స్టోర్‌లో రెస్టారెంట్ కూడా ఉంది. ప్రపంచంలో అన్ని ఐకియా స్టోర్స్‌లోకెల్లా అతి పెద్ద రెస్టారెంట్ ఇక్కడే ఉంది. 1000 సీట్ల ఈ రెస్టారెంట్‌లో సగం ఆహార పదార్థాలు స్వీడిష్ స్పెషాలిటీస్ కాగా మిగిలిన సగం ఇండియన్ ఆహార పదార్థాలు.స్కిల్ డెవలప్‌మెంట్ కోసం దిశ పైలట్ ప్రాజెక్టు కింద వంద మంది మహిళలను నియమించుకున్నారు. ఇందులో 8 మంది ఫోర్క్‌లిఫ్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. 

లైఫ్ ఎట్ హోమ్ ఇన్ హైదరాబాద్ థీమ్‌తో రెండు పూర్తి స్థాయి ఇండ్లను ప్రదర్శిస్తున్నారు. ఇందులో వివిధ గదుల అలంకరణ అందుబాటు ధరలో ఆధునికతకు అద్దం పట్టేలా రూపొందించారు. ఈ స్టోర్ 365 రోజులూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. కుటుంబంతో సహా దీనిని సందర్శించి.. నచ్చినవి కొనుగోలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సంవత్సరానికి 60లక్షల మంది వినియోగదారులు తమ స్టోర్ కి వస్తారని ఐకియా అభిప్రాయపడుతోంది.