ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యాను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నది. అసలే కరోనా ప్రభావంతో ఇబ్బందుల్లో ఉన్న రష్యా ఆర్థిక వ్యవస్థకు అమెరికా, దాని మిత్ర దేశాలు, ఐరోపా అగ్ర దేశాల ఆంక్షలు మరిన్ని కష్టాల్ని తెచ్చిపెడుతున్నాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యాను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నది. అసలే కరోనా ప్రభావంతో ఇబ్బందుల్లో ఉన్న రష్యా ఆర్థిక వ్యవస్థకు అమెరికా, దాని మిత్ర దేశాలు, ఐరోపా అగ్ర దేశాల ఆంక్షలు మరిన్ని కష్టాల్ని తెచ్చిపెడుతున్నాయి. ఎవరెన్ని చెప్పినా ఉక్రెయిన్‌పై పోరు విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా వ్యాపార కష్టాలు మొదలయ్యాయి. ఎగుమతులు-దిగుమతులు, తయారీ, ఉత్పాదక రంగాలు అధికంగా ప్రభావితమవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు సజావుగా సాగలేని పరిస్థితులుండగా, పెట్టుబడిదారులూ వెనుకకుపోతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ప్రతిస్పందనగా రష్యా, బెలారస్‌లలో ఉన్న దాదాపు 15,000 మంది ఉద్యోగులు, 17 స్టోర్‌లు, 3 ప్రొడక్షన్ సైట్‌లను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు దేశాల్లో తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు స్వీడిష్ సంస్థ ఐకియా గురువారం తెలిపింది.
‘ఈ దాడి వల్ల రెండు దేశాలపై పెద్ద మొత్తంలో ప్రభావం చూపుతోంది. సప్లయ్ చెయిన్‌కి తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. ట్రేడింగ్ పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఈ కారణంతోనే రష్యాలో ఐకియా కార్యకలాపాలను కొన్ని రోజులు పాటు నిలిపివేయాలని కంపెనీ గ్రూప్‌లు నిర్ణయించాయి’ అని బ్రాండ్ ఓనర్ ఇంటర్ ఐకియా, స్టోర్ ఓనర్ ఇంగ్కా గ్రూప్‌లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
రష్యాలో ఐకియా 22 ఏళ్లుగా ఉనికిలో ఉంది. అంతేగాక, ఐకియా ఉద్యోగుల్లో ఎక్కువ మంది రష్యాలోనే ఉన్నారు. ఇక, బెలారస్‌లో ఐకియా షాపులు లేనప్పటికీ అక్కడ ఈ సంస్థకు కొందరు సప్లయర్స్ ఉన్నారు.
ఐకియా తీసుకున్న ఈ నిర్ణయాలు స్థానికంగా 15,000 మంది ఉద్యోగులు, కంపెనీ గ్రూపులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుబోతున్నాయి.
అయితే.. వారందరిపై సంస్థ తన బాధ్యతను మరిచిపోవట్లేదనీ, వాళ్ల ఉద్యోగాలకు భరోసా ఇస్తూ, ఆదాయం నష్టపోకుండా వారికీ, వారి కుటుంబాలకు మద్దతును అందిస్తామని సంస్థ ప్రకటించింది. ఇంటర్.. ఐకియా సప్లైకి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యత వహిస్తుండగా.. ఇంగ్కా గ్రూప్ రష్యాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐకియా స్టోర్లకు ఓనర్‌గా ఉంది. గత ఆగస్ట్ నెలతో రష్యా ఐకియాకు 10వ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. మొత్తం రిటైల్ సేల్స్ 1.6 బిలియన్ యూరోలుగా ఉన్నాయి.
