కొన్ని రోజులుగా తన పెళ్లి విశేషాలతో వార్తల్లో నిలిచిన ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ ముద్దుల తనయ ఇశా అంబానీ మరోసారి వార్తల్లోకెక్కారు. తన తల్లిదండ్రులు ఏడవటం చూసి తానూ ఏడ్చేశానని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కుమార్తె ఇశా అంబానీ అంటున్నారు.

గతేడాది డిసెంబర్లో ముంబైలోని ముఖేశ్ నివాసమైన యాంటీలియాలో ఇషా, పిరామల్ ఇండస్ట్రీస్ అధినేత అజయ్ పిరామల్ కుమారుడు ఆనంద్ పిరామల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

పెళ్లి వేడుకలో ఇశాను చూసిన ముఖేశ్, నీతా మిగతా తల్లిదండ్రుల మాదిరిగానే కన్నీరు పెట్టుకున్నారు. వారు ఏడవటం చూసి తానూ భావోద్వేగానికి గురయ్యానని వోగ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈశా అంబానీ చెప్పారు. ‘పెళ్లి వేడుకలో మా అమ్మ ఓ సీఈవోలా అన్ని బాధ్యతలు చూసుకున్నారు. పెళ్లయ్యేవరకు అమ్మానాన్న ఎంతో కష్టపడ్డారు.

వారికి నచ్చిందే నాకూ నచ్చడంతో అన్నీ సవ్యంగా జరిగిపోయాయి’ అని పేర్కొన్నారు. ‘పెళ్లికి సంబంధించి జరిగిన సంప్రదింపుల్లో నేను పాల్గొనలేదు. నా పెళ్లి అలా జరగాలి, ఇలా జరగాలి అని కలలు కనలేదు. అయినా నేను ఊహించుకున్నదానికంటే ఎంతో అందంగా వేడుక జరిగింది. పెళ్లి తంతు ముగుస్తుండగా నా చుట్టూ ఉన్నవారు కన్నీరుపెట్టారు.

అమ్మానాన్నలు కూడా ఏడ్చేసరికి నాకూ కన్నీళ్లాగలేదు’ అని  ఇశా అంబానీ చెప్పారు. అంగరంగ వైభంగా జరిగిన వివాహ వేడుకకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు హాజరై సందడి చేశారు. దేశంలో అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచిన ఇషా పరిణయం నిలిచింది.

‘మా అమ్మానాన్నల పెళ్లి జరిగిన ఏడేళ్లకు నేను, నా కవల సోదరుడు ఆకాశ్ జన్మించాం. మేమిద్దరం ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్- టెస్ట్ట్యూబ్ బేబీ) పద్ధతి ద్వారా జన్మించాం. మాకు ఐదేళ్లు వచ్చేవరకు మా అమ్మ తన పూర్తి సమయాన్ని మాకోసమే వెచ్చించారు. తను చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు’ అంటూ ఇశా అంబానీ చెప్పారు.

‘తన కలలను నెరవేర్చుకునేందుకు, రిలయన్స్‌ను మేటి సంస్థగా నిలిపేందుకు మా నాన్న పడ్డ కష్టాన్ని చూస్తూ పెరిగా. ఎంత బిజీగా ఉన్నా మాకు తన అవసరం ఉందనిపిస్తే మాత్రం మా దగ్గరే ఉండిపోయేవారు. మా అమ్మానాన్నలు ఎలాంటి పరిస్థితుల్లో పెరిగారో మమ్మల్ని కూడా అలాగే పెంచారు. వారి పెంపకం వల్లే క్రమశిక్షణ, వినయ విధేయతలు అలవడ్డాయి. డబ్బు విలువ కూడా మాకు బాగా తెలుసు’ అని ‘జియో’ సృష్టికర్త ఇశా అంబానీ చెప్పారు.