గంటకు రూ.7కోట్లు... ప్రపంచ బిలీనియర్లలో ముకేష్ అంబానీ
హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ జాబితాలో మరోమారు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ టాప్ గా నిలిచారు. భారత్ నుంచి రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ తొమ్మిదో స్థానానికి ఎదిగారు. ఓయో వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ కొత్తగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. హైదరాబాదీలు ఏడుగురు బిలియనీర్లు జత కలిశారు.
చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లు భారత్‌లోనే ఉన్నారు. దేశంలో సంపన్నుల సంఖ్య 2019లో ఎక్స్‌ప్రెస్ వేగంతో పెరిగింది. ప్రతీ నెలా సుమారు ముగ్గురు చొప్పున కొత్తగా బిలియనీర్లు పుట్టుకొచ్చారు.
మొత్తం మీద 2019లో 34 మంది బిలియనీర్లు అదనంగా జత కలవడంతో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 138కి చేరుకుందని హరూన్ గ్లోబల్‌రిచ్ లిస్ట్- 2020 తొమ్మిదో ఎడిషన్ తెలిపింది. 67 బిలియన్ డాలర్ల నికర విలువతో దేశంలోకెల్లా సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీయేనని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2020 నివేదిక ప్రకటించింది.
799 మంది బిలియనీర్లతో చైనా, 626 మంది బిలియనీర్లతో అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌కు వెలుపల ఉన్న భారత సంతతి బిలియనీర్లనూ కలుపుకుంటే మొత్తం సంఖ్య 170గా ఉంటుందని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2020 నివేదిక తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్లు (రూ.7,000 కోట్లు), అంతకుమించిన నికర విలువ ఉన్న వారిని ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది. బిలియన్ల డాలర్లకు పైగా ఆదాయం గల ప్రపంచవ్యాప్తంగా 2,817 మంది ఉన్నారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన వారు కొత్తగా 480 మంది తోడయ్యారు.
ముఖ్యంగా భారత్‌లో ప్రతీ నెలా ముగ్గురు చొప్పున పెరగ్గా, చైనాలో ప్రతీ వారానికి ముగ్గురు చొప్పున బిలియనీర్లు పుట్టుకొచ్చినట్టు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2020తెలియజేసింది. ముకేశ్ అంబానీ 67 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 9వ సంపన్నుడిగా నిలిచారు.
అమెజాన్ జెఫ్ బెజోస్ 140 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఎస్‌పీ హిందుజా కుటుంబం 27 బిలియన్ డాలర్లు, గౌతం అదానీ 17 బిలియన్ డాలర్లు, శివ్‌నాడార్, అతని కుటుంబం 17 బిలియన్ డాలర్లు, లక్ష్మీ నివాస్ మిట్టల్ 15 బిలియన్ డాలర్లు కలిగి ఉన్నారు.
ఇంకా ఉదయ్ కోటక్ 15 బిలియన్ డాలర్లు, అజీమ్ ప్రేమ్‌జీ 14 బిలియన్ డాలర్లు, సైరస్ పూనవాలా 12 బిలియన్ డాలర్లు, సైరస్ పల్లోంజీ మిస్త్రీ, ఆయన కుమారుడు షాపూర్ పల్లోంజీ 11 బిలియన్ డాలర్లు, ఓయో ప్రమోటర్ రితేష్ అగర్వాల్ 1.1 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 67 బిలియన్ డాలర్లతో టాప్-10లో ఉన్నారు. గంటకు రూ. 7 కోట్ల సంపద పెరిగింది. ఆసియాలోనే ధనవంతుడిగా మరోసారి నిలిచిన ముకేశ్.. గ్లోబల్ టాప్-10 బిలియనీర్లలో ఉన్న ఏకైక ఆసియా దేశస్తుడు కావడం గమనార్హం.
ఇక గౌతమ్ అదానీ సంపద 7.1 బిలియన్ డాలర్లు ఎగిసి 17 బిలియన్ డాలర్లకు చేరగా, ఈసారి 15 బిలియన్ డాలర్లతో టాప్-100 లిస్టులోకి ఉదయ్ కొటక్ చేరడం విశేషం. అలాగే 10.6 బిలియన్ డాలర్లకు డీ-మార్ట్ దమానీ సంపద ఎగబాకింది.
ఓయో వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ బిలియనీర్లలో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈయన వయసు 24 ఏళ్లు మాత్రమే. సంపద విలువ 1.1 బిలియన్ డాలర్లు. కాగా, గోద్రేజ్ గ్రూప్‌నకు చెందిన స్మిత వీ కృష్ణ భారతీయ సంపన్న మహిళగా నిలిచారు. ఈమె సంపద విలువ 4.5 బిలియన్ డాలర్లు.
జాబితాలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు సంపన్నులకు చోటు దక్కింది. వీరి సంపద విలువ 13 బిలియన్ డాలర్లుగా ఉన్నది. 50 మంది బిలియనీర్లతో ముంబై అగ్ర స్థానంలో ఉండగా, వీరి వద్ద ఉన్న సంపద విలువ దాదాపు 218 బిలియన్ డాలర్లు. ఢిల్లీలో 30 మంది, బెంగళూరులో 17 మంది, అహ్మదాబాద్‌లో 12 మంది ఉన్నారు.