మీ అకౌంట్లో డబ్బులు లేవా.. అయినా మనీ డ్రా చేయొచ్చు
మీ అకౌంట్లో డబ్బులు లేవా.. జీరో బ్యాలన్స్ చూపిస్తోందా.. అయినా కూడా మీ అకౌంట్లోంచి డబ్బులు డ్రా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాంకులు తమ ఖాతాదారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంటాయి. అకౌంట్లో డబ్బులు లేకపోయినా అవసరమైన మేరకు విత్ డ్రా చేసుకొనే అవకాశం ఇస్తాయి. దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అంటే బ్యాంకులు మన మీద నమ్మకంతో ముందుగానే మనకు డబ్బులు ఇస్తాయన్న మాట. అయితే ఈ డబ్బులు తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది మరి.
ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందిన వారు బ్యాంకు డబ్బును రుణంగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. అంటే ఖాతాదారులు తమకు అవసరమైనప్పుడు వారి శాలరీకి మూడు రెట్లు అడ్వాన్స్ రూపంలో పొందవచ్చు. అయితే ఇది ఖాతాదారుడి ఫైనాన్సియల్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన షరతులు కూడా ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉంటాయి.
ఓవర్ డ్రాఫ్ట్ అంటే స్వల్ప కాలిక రుణం. అంటే అత్యవసర ఆర్థిక పరిస్థితి ఏర్పడితే ఆ కష్టం నుంచి బయట పడటానికి ఇది ఉపయోగపడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, వంటి ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రైవేటు బ్యాంకులు కూడా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వారి ఖాతాదారులకు అందిస్తున్నాయి. ఓవర్ డ్రాఫ్ట్ తిరిగి చెల్లించడానికి ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు. మీ వద్ద డబ్బు అందుబాటులో ఉన్నప్పుడు తిరిగి చెల్లించవచ్చు.
అర్హులు ఎవరంటే..
శాలరీ బ్యాంకు అకౌంట్ ఉన్న ఎంప్లాయిస్ మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందడానికి అర్హులు. బ్యాంకులు అడ్వాన్స్ బదిలీ చేయడానికి ముందు ఖాతాదారుడి క్రెడిట్ స్కోర్లను కూడా తనిఖీ చేస్తాయి. నెలవారీ జీతం తీసుకొనే అందరూ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందడానికి అర్హులు కారు. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందాలనుకున్నవారు బ్యాంకు నిబంధనలు తప్పక పాటించాలి.
చెల్లింపు ఆలస్యమైతే..
ఒకవేళ మీరు ఓవర్ డ్రాఫ్ట్ చెల్లింపును ఎక్కువ కాలం ఆలస్యం చేస్తే అది మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావితం చూపుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకున్న డబ్బుకు రోజూవారీ వడ్డీ కడతారు. ఇది నెలాఖరులో ఖాతాకు కలుపుతారు. ఒకవేళ సమయానికి ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ చెల్లించకపోతే అప్పుడు వడ్డీ మొత్తాన్ని నెలాఖరులో అసలు మొత్తానికి బ్యాంకులు కలుపుతాయి. అంతేకాకుండా మొత్తం అసలుపై వడ్డీని కూడా లెక్కిస్తాయి. ఓవర్ డ్రాఫ్ట్ పై అదనపు ఫీజు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు వర్తించవు.