Investment Portfolio : హోర్ముజ్ జలసంధి సంక్షోభం భారత్‌లో చమురు ధరలు, రూపాయి విలువను ఎలా దెబ్బతీసింది, పెట్టుబడిదారులు ఎలా అలర్ట్ అవ్వాలనే ఆసక్తికరమైన విషయాల పై బజాజ్ ఫిన్‌సర్వ్ మ్యూచువల్ ఫండ్‌లో ఫండ్ మేనేజర్ సౌరభ్ గుప్తా విశ్లేషణ ఇక్కడ తెలుసుకుందాం.
- రచన: సౌరభ్ గుప్తా, హెడ్ – ఈక్విటీ, బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్
మీరు బహుశా 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ జలమార్గాన్ని ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. కానీ ఇది మీ వంటగది నుంచి రోజువారీ ప్రయాణం వరకు, కిరాణా ఖర్చుల నుంచి పెట్టుబడి పోర్ట్‌ఫోలియో వరకు మీ జీవితంపై నిశ్శబ్దంగా ప్రభావం చూపుతోంది.
ప్రపంచ ఇంధన వాణిజ్యంలో హోర్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన స్థానం కలిగి ఉంది. ప్రతిరోజూ సుమారు 2 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ప్రతి ఐదు బ్యారెళ్లలో దాదాపు ఒక బ్యారెల్ ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. దీనిని మరింత ముఖ్యమైనదిగా మార్చేది ప్రత్యామ్నాయ మార్గాల కొరత. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ద్వారా కొంతమేర చమురును మళ్లించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ మార్గాలు రోజుకు సుమారు 55 లక్షల బ్యారెళ్ల రవాణానే నిర్వహించగలవు. ఫలితంగా ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఇప్పటికీ ఈ ఒక్క జలమార్గంపైనే ఆధారపడి ఉంది.
ఇది కేవలం ఒక అపాయం మాత్రమే కాదు.. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలోని ప్రధాన బలహీనత
2026 ఫిబ్రవరి చివర్లో అమెరికా–ఇజ్రాయెల్ సైనిక దాడులు ఇరాన్‌పై జరగడంతో సంక్షోభం తలెత్తింది. అనంతరం ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. కొద్ది రోజుల్లోనే బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల లోపు స్థాయి నుంచి 138 డాలర్ల గరిష్ఠానికి చేరుకుంది. అలాగే నౌకలకు సంబంధించిన యుద్ధ ప్రమాద ఇన్సూరెన్స్ ఖర్చులు అనేక రెట్లు పెరిగాయి. ఈ అంతరాయం తీవ్రత అంత ఎక్కువగా ఉండటంతో, అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) దీన్ని తన చరిత్రలోనే అతిపెద్ద అంతరాయంగా అభివర్ణించింది.
భారత్‌కు ఈ పరిస్థితి మరింత కీలకమైనది. దేశం తన ముడి చమురు అవసరాల్లో 87 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. వాటిలో దాదాపు సగం సరఫరా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాల నుంచి హోర్ముజ్ జలసంధి ద్వారానే వస్తుంది. దీనికి తోడు ద్రవీభవించిన సహజ వాయువు (LNG), ద్రవీభవించిన పెట్రోలియం వాయువు (LPG) దిగుమతులను కూడా పరిగణనలోకి తీసుకుంటే, భారత ఆధారపడటం మరింత స్పష్టమవుతుంది. దేశ సహజ వాయువు దిగుమతుల్లో 60 శాతం, మొత్తం ఎల్పీజీ సరఫరాలో 54 శాతం ఈ ఒక్క జలసంధి గుండా రవాణా అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా కుటుంబాలు వంటగ్యాస్ సిలిండర్ల కోసం ఈ సరఫరా వ్యవస్థపై ఆధారపడుతున్నాయి.
ఈ పరిణామాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై వేగంగా కనిపించింది. 2026 మే నెలలో రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి అయిన 95.63కు పడిపోయింది. అలాగే దేశ ప్రస్తుత ఖాతా లోటు (Current Account Deficit) గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2 శాతం వద్ద ఉన్న ద్రవ్యోల్బణం, 2026-27లో 5.1 శాతానికి పెరుగుతుందని అంచనా. మరోవైపు ఆర్థిక వృద్ధి అంచనాలు దిగజారాయి.
అయితే భారత్ పూర్తిగా నిస్సహాయ స్థితిలో లేదు
దేశానికి అనుకూలంగా పనిచేస్తున్న అంశాల్లో ముఖ్యమైనది ఇంధన వనరుల వైవిధ్యీకరణ. 2017లో కేవలం 1 శాతం మాత్రమే ఉన్న రష్యా ముడి చమురు దిగుమతులు ప్రస్తుతం మొత్తం సరఫరాలో 36 శాతానికి చేరుకున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడే అంతరాయాల ప్రభావం కొంత మేర తగ్గి, ఒకే ప్రాంతంపై ఆధారపడటం కూడా తగ్గింది.
ఈ నేపథ్యంలో ఈక్విటీ పెట్టుబడిదారులుగా మనం ఏమి గ్రహించాలి?
దేశీయ ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ పరిణామాలతో పాటు భౌగోళిక-రాజకీయ సంఘటనలు కూడా పెట్టుబడిదారులు పరిగణనలోకి తీసుకోవాల్సిన కీలక అంశాలుగా మారాయి. ఇవి ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల బలమైన వ్యాపార నమూనా, స్థిరమైన దేశీయ డిమాండ్, పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కోగల సామర్థ్యం ఉన్న సంస్థలు అనిశ్చితి కాలాల్లో మెరుగైన స్థితిలో ఉంటాయి.
అదే సమయంలో ప్రపంచ సంఘటనల వల్ల మార్కెట్లలో ఏర్పడే అస్థిరత కొత్త విషయం కాదని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాలి. గత దశాబ్ద కాలంలో యూరోపియన్ రుణ సంక్షోభం, నోట్ల రద్దు, కోవిడ్-19 మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి అనేక సంఘటనలను మార్కెట్లు ఎదుర్కొన్నాయి. ప్రతి సంఘటన ప్రత్యేకమైనదే అయినప్పటికీ, మార్కెట్ల స్పందనలో ఒకే విధమైన ధోరణి కనిపించింది — మొదట అనిశ్చితి, అనంతరం కోలుకోవడం. చరిత్ర చెబుతున్నదేమిటంటే, ఇలాంటి కాలాల్లో పెట్టుబడులను కొనసాగించిన వారు దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందారు.
అనిశ్చితి కొన్నిసార్లు ఆందోళన కలిగించవచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అది అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ విలువలు మరింత ఆకర్షణీయంగా మారాయి. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధి కథనం యథాతథంగా కొనసాగుతోంది. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టిన కొద్దీ, మార్కెట్లు మరింత సానుకూల వృద్ధి దిశగా పయనించే అవకాశం ఉంది. మంచి ధరలు సాధారణంగా మంచి కాలాల్లో రావు. కానీ అనిశ్చితి సమయంలో కూడా పెట్టుబడులను కొనసాగించే వారు కాలక్రమేణా మంచి ఫలితాలను పొందుతారు.
హోర్ముజ్ జలసంధి మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. ఎంతో సన్నని జలమార్గం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపగలదు. ఇంధన భద్రత, ఆర్థిక భద్రత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ సంబంధాన్ని అర్థం చేసుకున్న పెట్టుబడిదారులు అనిశ్చిత పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కొని, అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోగలరు.


