ముంబై: ఆర్థిక మందగమనం నేపథ్యంలో కొత్త ఉద్యోగాల కల్పన, వ్యాపార విస్తరణ వంటి అంశాల్లో ప్రస్తుత పరిస్థితులే వచ్చే ఏడాదిలోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయని వ్యాపార, కన్సల్టెన్సీ సంస్థల నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది దేశం ఎదుర్కొంటున్న మాంద్యంతో ఆటోమొబైల్‌, రియల్‌ఎస్టేట్‌తో పాటు ఐటీ రంగంలోనూ ఉద్యోగాలు ఊడిపోతున్న నేపథ్యంలో.. వ్యాపార సంస్థలు కొత్త ఉద్యోగులను తీసుకునే అవకాశాలు తక్కువేనని వారు చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్నవారితోనే సర్దుకుపోయే యోచనలో చాలా సంస్థలున్నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 'దేశం ఎదుర్కొంటున్న మందగమన సమస్యతో ఆర్థిక వృద్ధిరేటు క్రమంగా క్షీణిస్తున్నది. జీడీపీతో పాటు పలు కీలక సూచీలన్నీ నేలచూపులు చూస్తున్న తరుణంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ పెట్టుబడులు పెరుగుతాయో లేదో చూడాలి.

also read వరుసగా మూడు రోజు కూడా పెరిగిన డీజిల్ ధరలు

పెట్టుబడులు పెరగకుంటే మాత్రం వచ్చే ఏడాదీ కీలకరంగాల్లో ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి' అని ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రీతూపర్ణ చక్రవర్తి తెలిపారు. కొత్త ఉద్యోగాల సంగతి అటుంచితే ఉన్నవారికే మరికొన్ని రంగాల్లో శిక్షణ ఇప్పించేందుకు పలు సంస్థలు యోచిస్తున్నట్టు చక్రవర్తి అన్నారు. 'జీడీపీ వృద్ధిరేటు క్షీణిస్తుండటంతో 2020 తొలి అర్ధభాగం అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు.

వ్యాపార సంస్థలు తమ వ్యాపార విస్తరణనూ వాయిదా వేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి' అని గ్లోబల్‌ హంట్‌ ఇండియన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ గోయల్‌ అభిప్రాయపడ్డారు.ఇదే విషయమై ప్రిన్సిపల్‌ ఇండియా ప్రొడక్ట్స్‌ లీడర్‌ అండ్‌ కెరీర్‌-కన్సల్టింగ్‌ లీడర్‌ నమితా భరద్వాజ్‌ స్పందిస్తూ... 'ఉద్యోగులను తీసుకునే విషయంపై వ్యాపార సంస్థలు వచ్చే ఏడాదీ అంతగా ఆసక్తి చూపకపోవచ్చు.

also read ఉల్లి తరువాత, ఇప్పుడు వంట నూనె ధరలకు రెక్కలు...

ఇప్పటికే ఉన్నవారిపైనే ఎక్కువగా ఆధారపడవచ్చు' అని తెలిపారు.అంతేగాక సంస్థలు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌), డిజిటల్‌ మార్కెటింగ్‌, డిజైన్‌ థింకింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింకింగ్స్‌ (ఐవోటీ) వంటి వాటిపై సంస్థలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని ప్రిన్సిపల్‌ ఇండియా ప్రొడక్ట్స్‌ లీడర్‌ అండ్‌ కెరీర్‌-కన్సల్టింగ్‌ లీడర్‌ నమితా భరద్వాజ్‌ వివరించారు. ఈ నేపథ్యంలో దేశంలో నిరుద్యోగులకు వచ్చే ఏడాదీ కష్టాలు తప్పేలా లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.