Asianet News TeluguAsianet News Telugu

పురి ఆదిత్య తర్వాత? హెచ్‌డీఎఫ్‌సీ ఫ్యూచర్ ప్రశ్నార్థకమేనా?

25 ఏళ్ల చరిత్ర గల ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ భవితవ్యం 2020 అక్టోబర్ తర్వాత ప్రశ్నార్థకం కానున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుత ఎండీ ఆదిత్య పురి వచ్చే ఏడాది అక్టోబర్‌లో రిటైరవుతున్నారు. 

HDFC Banks next boss needs to win Aditya Puris 15-day challenge
Author
New Delhi, First Published Jul 14, 2019, 10:50 AM IST

హెచ్‌డీఎఫ్‌సీ.. అది 25 ఏళ్ల చరిత్ర గల ప్రైవేట్ బ్యాంక్. 2020 అక్టోబర్ నెలలో ఆ బ్యాంకు ఎండీ ఆదిత్య పురి రిటైరవుతున్నారు. ఆయన రిటైర్మెంట్ బ్యాంకు భవితవ్యంపై ప్రభావం చూపుతుందా? ఆయన పేరు తప్ప ఇంకో పేరు వినిపించని ఆ బ్యాంకు డీలా పడుతుందా? లేదంటే ఆయన నెలకొల్పిన క్రమశిక్షణ కొనసాగుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

భారత్‌లో అత్యంత విలువైన బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. డిజిటలైజేషన్‌లో గట్టి ముందంజ వేసింది. మార్కెట్‌లో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. వచ్చే ఏడాది బ్యాంకు ఎండీ ఆదిత్య పురి పదవీ విమరణ చేయనున్నా, దాని ప్రభావం బ్యాంకుపై పెద్దగా పడదని సీనియర్‌ జర్నలిస్ట్‌ తమల్‌ బంధోపాధ్యాయ్‌ తన తాజా పుస్తకం ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.0-ఫ్రం డాన్‌ టు డిజిటల్‌’లో స్పష్టం చేశారు. 

‘ఏ బ్యాంక్‌ ఫర్‌ ద బక్‌’ పుస్తకానికి కొనసాగింపుగా వచ్చిన ఈ పుస్తకంలో మాజీ డిప్యూటీ ఎండీ పరేశ్‌ సూక్తాంకర్‌ హఠాత్‌ నిష్క్రమణ, హెచ్‌డీఎఫ్‌సీతో సంబంధాలు, పురి వారసుడు తదితర అంశాలపై చర్చించారు. 
 
2012లో ఈ పుస్తకం ముద్రితమైన తర్వాత నుంచి ఇప్పటి దాకా భారత బ్యాంకింగ్‌ రంగం భారీ మార్పులకు గురైంది. రెండు దశాబ్దాలుగా జరగని పలు పరిణామాలు  చోటు చేసుకున్నాయి.

కేవలం మొండి బకాయిలే కాదు.. ఆస్తుల నాణ్యత సమీక్ష, దివాలా స్మృతి వంటి వాటితో పాటు ఆర్‌బీఐ కఠిన వైఖరి తదితరాల వల్ల బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర రంగంపై ప్రభావం పడింది. 

అన్నింటికన్నా ముఖ్యమైనది పెద్ద నోట్ల రద్దు తర్వాత నరేంద్రమోదీ ప్రభుత్వం తెచ్చిన డిజిటైజేషన్‌ ప్రక్రియలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చాలా ముందుంది. చెల్లింపుల బ్యాంకులు రాకముందు.. వచ్చిన తర్వాత కూడా ఇది పోటీలో చాలా ముందుంది. 

గతేడాది మార్చినాటికి 85 శాతానికి పైగా లావాదేవీలు డిజిటల్‌లోనే జరుగుతున్నాయి. ఒక సంప్రదాయ బ్యాంకు నుంచి ఆధునిక బ్యాంకుగా మారిన వైనాన్ని మనం గమనించాలి. 

ఎండీగా ఆదిత్య పురి బ్యాంకుపై వేసిన ముద్ర చూస్తే ఎవరికైనా ఈ అనుమానం వస్తుంది. పురి తర్వాత బ్యాంకుపై ఎటువంటి ప్రభావం ఉండదని చెప్పడం అబద్ధమే అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పోల్చడం సరికాదు కానీ.. వ్యవస్థ, ఇతరత్రా అంశాల విషయంలో ఎస్‌బీఐ తరహాలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా ఉంటుంది.

చాలా క్రమశిక్షణా వాతావరణంలో బ్యాంకు ప్రక్రియ సాగేలా పురి చూసుకున్నారు. అయితే బ్యాంకులోని రెండో శ్రేణి అత్యున్నతాధికారులు ఎవరూ ప్రముఖులు కాకపోవడంతో పురి అనంతరం ఎవరు వారసులనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. బ్యాంకు వెలుపల నుంచి లేదంటే భారత్‌ బయటి నుంచే వారసుడు వచ్చే అవకాశం ఉంది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 100 శాతం అనుబంధ కంపెనీగా ఉన్న హెచ్‌బీడీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు ఆదిత్య పురి ఛైర్మన్‌గా ఉన్నారు. అంటే బ్యాంకింగ్‌ వ్యవస్థలో పురి ఉంటారన్నమాట. పురి హెచ్‌డీఎఫ్‌సీ కుటుంబంలో ఉన్నంత వరకు ఆయన సానుకూల ప్రభావం ఉంటుంది. 

తమ బ్యాంకు పగ్గాలు చేపట్టే వ్యక్తి కేవలం 15 రోజుల్లోగా అన్ని విషయాలనూ ఆకళింపు చేసుకోవాల్సి ఉంటుందని ప్రస్తుత హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ ఆదిత్య పురి అన్నారు. కొత్త ఎండీ కోసం త్వరలోనే మొదలయ్యే శోధనపై వార్షిక సాధారణ సమావేశంలో ఆయన ఈ సంగతి చెప్పారు.

‘నా స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి ఏడాది వ్యవధి తీసుకుంటే.. అలాంటి వ్యక్తి మాకొద్దు’అని పురి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో పురి పదవీ విరమణకు ఎంతో సమయం లేదు. పురి వారసుడిని వెతికే ప్రక్రియను మొదలుపెడతారు. అయితే ఏజీఎమ్‌లో చాలా మంది వాటాదార్లు పురికి పదవీ విమరణ వయసు(70) తర్వాత కూడా కొనసాగాలని కోరినా అందుకు పురి స్పందించలేదు. 

వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి 70వ వసంతంలో అడుగు పెట్టనున్న ఆదిత్య పురి భారతదేశంలోనే అత్యంత విలువైన బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీని రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. 1994లో భారతదేశంలో బ్యాంక్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ స్థిరంగా అభివ్రుద్ధి చెందడంలో ప్రధాన పాత్రధారి పురి. 

కానీ 2016 ఫిబ్రవరిలో కార్డియాక్ సర్జరీ తర్వాత ఆయన, బ్యాంక్ మేనేజ్మెంట్ కూడా పురి వారసుడి ఎంపికపై కేంద్రీకరించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రెండేళ్ల ముందు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీగా పురి వారసుడిని ఎంపిక చేయడానికి ప్రాతిపదిక సిద్దం చేశారు. పురితో కలిసి ఏడాది పాటు పని చేస్తే తర్వాత బ్యాంక్ పనితీరు సజావుగా సాగుతుందని అందరి విశ్వాసంగా ఉంది. 

2000 ఫిబ్రవరిలో టైమ్స్‌ బ్యాంక్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీనం చేసుకుంది. కొత్త తరం ప్రైవేట్ బ్యాంకుల్లో ఇది తొలి విలీనంగా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2008లో సెంచూరియన్‌ బ్యాంకును కొనుగోలు చేసింది.

ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 2748 నగరాల్లో 5103 శాఖలున్నాయి. 4.3 లక్షల పీఓఎస్‌ టర్మినళ్లను నెలకొల్పింది.98 వేల మంది సిబ్బందితో సేవలందిస్తున్నది. బ్యాంకు మొండి బాకీలు రూ.3,214.52 కోట్లుగా ఉండగా, మొత్తం ఆస్తుల విలువ 12,44,540.69 కోట్లు.

Follow Us:
Download App:
  • android
  • ios