న్యూఢిల్లీ: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అవతరించింది. డాలర్ల రూపంలో అధిక ఆదాయం ఆర్జిస్తున్న కంపెనీని ‘విప్రో’ను హెచ్‌సీఎల్‌ టెక్‌ వెనక్కు నెట్టింది. జూన్‌ త్రైమాసికంలో విప్రో ఐటీ సేవల ఆదాయం 2.02 బిలియన్‌ డాలర్లు మాత్రమే.

హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం రూ.2,431 కోట్లు


కాగా, జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఏకీకృత ప్రాతిపదికన రూ.2,431 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.2,210 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ఇక మొత్తం కార్యకలాపాల ఆదాయం 14.2 శాతం వృద్ధితో రూ.13,878 కోట్లకు చేరుకున్నది. డాలర్ల రూపంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం 5.7% పెరిగి 356 మిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక ఆదాయం 9% వృద్ధితో 2.05 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 

కొత్త ఆర్డర్లు దక్కించుకోవడంతోనే పురోగతి ఇలా


‘తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో కొత్త ఆర్డర్లు దక్కించుకున్నాం. కొత్త తరం మౌలిక సేవలు, మోడల్‌-2 సేవలు ఇందుకు దన్నుగా నిలిచాయి. మొత్తం ఆదాయంలో మోడ్‌ -2, మోడ్‌-3 సేవల వాటా 26.6 శాతం నిలిచింది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఇవి 9.6% వృద్ధి చెందాయి’ అని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధ్యక్షుడు, సీఈఓ సీ విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో స్థిర మారకం రూపేణా ఆదాయ వృద్ధి 9.5% నుంచి 11.5% మధ్య ఉండొచ్చని కంపెనీ అంచనాలు వేసింది. 

27 కొత్త ఒప్పందాలు చేసుకున్న హెచ్‌సీఎల్ టెక్


జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 27 కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. టెలికాం, ఆర్థిక సేవలు, రిటైల్‌- సీపీజీ, , ఇంధన, యుటిలిటీస్‌ విభాగాలు ఇందుకు దన్నుగా నిలిచాయి. స్థిర మారకంలో టెక్నాలజీ, సర్వీసెస్‌ 36 శాతం, లైఫ్‌ సైన్సెస్‌, ఆరోగ్య సంరక్షణ 10.2%, ఆర్థిక సేవలు 9%, రిటైల్‌, సీపీజీ 7% చొప్పున వృద్ధి సాధించాయి. జూన్‌ నాటికి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 1,24,121కు చేరింది. ఐటీ సేవల విభాగంలో వలసల రేటు 16.3 శాతంగా ఉన్నది. రూ.2 విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.2 (100 శాతం) డివిడెండ్ చెల్లించాలని హెచ్ సీఎల్ టెక్నాలజీస్ బోర్డు నిర్ణయించింది.  

ఐసీఐసీఐ లాభాలను తినేసిన మొండి బకాయిలు 


ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాండలోన్‌ పద్ధతిలో రూ.119.50 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.2,049 కోట్ల నికర లాభం నమోదైంది. గత 20 ఏళ్లలో (1998లో షేర్లు నమోదయ్యాక) ఐసీసీఐ బ్యాంకుకు ఒక త్రైమాసికంలో నష్టం రావడం ఇదే తొలిసారి. కేటాయింపు భారీగా పెరగడం నష్టానికి కారణమైంది. మరోవైపు మొత్తం ఆదాయం రూ.16,847.04 కోట్ల నుంచి రూ.18,574.17 కోట్లకు చేరింది. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 4.93 కోట్లు. 2016 -17లో ఇదే ఏడాది రూ.2,604.73 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏప్రిల్‌- జూన్‌లో నికర వడ్డీ ఆదాయం రూ.6,102 కోట్లకు పెరిగింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో బ్యాంకుకు వచ్చిన నికర వడ్డీ ఆదాయం రూ.5,590 కోట్లు. వడ్డీయేతర ఆదాయం కూడా పెరిగి రూ.2,530 కోట్ల నుంచి రూ.3,085 కోట్లకు చేరింది. రుసుముల ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.2,754 కోట్లుగా నమోదైంది.

రూ.6,102 కోట్లకు పెరిగి ఐసీఐసీఐ నికర వడ్డీ ఆదాయం 


ఏప్రిల్‌- జూన్‌లో నికర వడ్డీ ఆదాయం రూ.6,102 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం ఇదే సమయంలో బ్యాంకుకు వచ్చిన నికర వడ్డీ ఆదాయం రూ.5,590 కోట్లు. వడ్డీయేతర ఆదాయం కూడా పెరిగి రూ.2,530 కోట్ల నుంచి రూ.3,085 కోట్లకు చేరింది. రుసుముల ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.2,754 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ 3.23 శాతం నుంచి తగ్గి 3.19 శాతానికి పరిమితమైంది.  ఏప్రిల్‌- జూన్‌లో దేశీయంగా ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చిన రుణాలు 15 శాతం పెరిగాయి. మొత్తం రుణాలు 11 శాతం వృద్ధితో రూ.5,16,289 కోట్లకు చేరాయి. ఇక మొత్తం రుణాల్లో 58 శాతం వరకు ఉండే రిటైల్‌ రుణాలు 20 శాతం పెరిగాయి.

7.99 శాతానికి చేరిన స్థూల మొండి బాకీలు


జూన్‌ 30 చివరినాటికి ఐసీఐసీఐ బ్యాంక్‌ స్థూల మొండి బాకీలు 7.99 శాతం నుంచి 8.81 శాతానికి పెరిగాయి. మొండి బాకీల నిష్పత్తి 4.86 శాతం నుంచి 4.19 శాతానికి తగ్గింది. మొండి బకాయిలు ఇతరత్రా వాటి కోసం బ్యాంకు రూ.5,971 కోట్ల కేటాయింపులు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.2,608.74 కోట్లతో పోలిస్తే కేటాయింపులు 129% పెరిగాయి. ఏప్రిల్‌- జూన్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లో రెండు శాతం వాటాకు సమానమైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ విక్రయించింది. విక్రయ సంబంధిత వ్యయాలు పోగా ఈ లావాదేవీ ద్వారా బ్యాంకుకు రూ.1,109.59 కోట్ల లాభం వచ్చింది.