Asianet News TeluguAsianet News Telugu

హెచ్-1బీ వీసా నిషేధంపై సంచలనం :బాధితుల్లో ఇండియన్లే అత్యధికులు..

హెచ్-1 బీ సహా అనుబంధ వీసాలను జారీ చేయకుండా తాత్కాలిక నిషేధం విధించడం వల్ల భారతీయులపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్-1 బీ వీసాతోపాటు ఏయే వీసాలను అమెరికా జారీ చేస్తుందో తెలుసుకుందాం..
 

H1 B visas ban effect will hit mostly on  Indian people
Author
Hyderabad, First Published Jun 24, 2020, 11:01 AM IST

వాషింగ్టన్‌: హెచ్-‌1బీతోపాటు ఇతర పని ఆధారిత వీసాల జారీపై ఈ ఏడాది చివరి వరకు నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జరీ చేసిన ఆదేశాలు భారతీయ ఐటీ నిపుణులకు శరాఘాతంగా మారనున్నాయి. అమెరికా ఏటా 85వేల హెచ్‌1బీ వీసాలను జారీచేస్తుండగా, అందులో సగటున 60వేల వీసాలు భారతీయులే పొందుతున్నారు. ట్రంప్‌ నిర్ణయంతో హెచ్-‌1బీతోపాటు పలు క్యాటగిరీల వీసాదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది.  

హెచ్-‌2బీ వీసాను నాన్‌ అగ్రికల్చరల్‌ వర్కర్ల కోసం జారీచేస్తారు. అమెరికా ఏటా 66 వేల హెచ్‌-2బీ వీసాలను జారీచేస్తున్నది. మూడేళ్ల వరకు వీటికి కాలపరిమితి ఉంటుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, హోటల్‌ తదితర రంగాల సంస్థలు ఈ వీసా ప్రోగ్రామ్‌ ద్వారా విదేశీ ఉద్యోగులను నియమించుకుంటాయి. 

హెచ్-‌1బీ, హెచ్‌-2బీ వీసాదారుల భాగస్వాములకు హెచ్‌-4 వీసా జారీచేస్తారు. హెచ్‌1బీకి ఉన్న గడువే దీనికి వర్తిస్తుంది. గతేడాది అమెరికా 1,25,999 హెచ్‌-4 వీసాలను జారీచేసింది. వీరిలో సుమారు 1,06,162 మంది భారతీయులే కావడం విశేషం. 5,701 మందితో ఆ తర్వాతి స్థానంలో చైనా ఉన్నది. 

also read చైనాకు ఆల్టర్నేటివ్ గా ఇతర దేశాలు.. ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్‌ దిగుమతికి మలేషియా, తైవాన్

సాంస్కృతిక, ఎడ్యుకేషనల్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్‌లలో భాగంగా అమెరికాలో పర్యటించే వారికి జే-1 వీసా జారీ చేస్తారు. ఈ వీసాకు గరిష్ఠంగా ఏడేళ్ల  గడువు ఉంటుంది. 2019లో 3,53,279 జే1 (రెన్యువల్స్‌తో కలిపి) వీసాలను జారీచేశారు. 

హెచ్-‌2బీ మాదిరిగా జే2 వీసాను జే1 వీసాదారుల భాగస్వాములకు జారీచేస్తారు. జే1 వీసా కాలపరిమితే దీనికీ వర్తిస్తుంది. ట్రంప్‌ సర్కార్‌ గతేడాది 38వేలకు పైగా జే-2 వీసాలను జారీచేసింది. 

అత్యున్నత స్థాయి ఉద్యోగులకు ఎల్‌-1 వీసాలను జారీచేస్తారు. గరిష్ఠ పరిమితి ఏడేళ్లు ఉంది. 2019లో 76,988 మందికి ఎల్-‌1 వీసాలను అమెరికా జారీచేసింది. 

ఎల్‌-1 వీసాదారుల భాగస్వాములు, వారిపై ఆధారపడిన వారికి ఎల్‌-2 వీసా జారీచేస్తారు. ఎల్‌1 వీసాకు ఉన్న కాలపరిమితే దీనికీ వర్తిస్తుంది. గతేడాది 80,720 మందికి ఎల్-‌2 వీసాలు జారీచేశారు. అందులో భారతీయులే 23,169 మంది ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios