ముంబై: మొండి బకాయిలపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సందించిన దివాళాచట్టం అస్త్రం దెబ్బకు రుణాలు తీసుకున్నవారు దిగిరాక తప్పడం లేదు. ఐబీసీ, సర్ఫేసి చట్టం ప్రకారం రుణాల చెల్లింపుదారులపై బ్యాంకులు కఠిన చర్యలు తీసుకోవడంతో గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.40,400 కోట్ల రుణాలు వసూలు అయ్యాయి. 

లోక్ అదాలత్ తదితర మార్గాల్లోనూ రుణ వసూళ్ల అవకాశం
2017-18 ఆర్థిక సంవత్సరంపై ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు పేర్కొంది. 2016-17లో రూ.38,500 కోట్ల మొండి బాకీలు వసూలయ్యాయిమొండి బకాయిలను తిరిగి వసూలు చేయడానికి దివాలా చట్టం, సర్ఫేస్ యాక్ట్, డెబిట్ రికవరీ ట్రిబ్యునల్, లోక్ అదాలత్ వంటి మార్గాల ద్వారా వసూలు చేసే అవకాశం బ్యాంకులకు ఉన్నది.

సర్పేస్ యాక్ట్ కింద రూ.26,500 కోట్ల చెల్లింపులు
వివిధ బ్యాంకులు వసూలు చేసిన మొండి బాకీల్లో దివాళా చట్టం కింద రూ.4,900 కోట్లు, సర్ఫేస్ చట్టం ప్రకారం రూ.26,500 కోట్లు వసూలు చేసినట్లు ఈ వార్షిక నివేదికలో తెలిపింది. బ్యాంకులు తీవ్రమైన ప్రయత్నాలు చేయడం వల్లే మొండి బకాయిల వసూళ్లు పెరిగాయని ఆర్బీఐ తెలిపింది.

స్పందించకుంటే సర్పేస్ యాక్ట్ ప్రకారం మూడు నెలల జైలు
దీనికి తోడు సర్ఫేస్ యాక్ట్ ప్రకారం ఆస్తులు వివరాలు, నెల రోజుల్లో ప్రాసెసెషన్ చెయ్యనివారికి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉండటంతో భారీ స్థాయిలో రుణాలు రీకవరి అయ్యాయి.
ఇదే సమయంలో లోక్ అదాలత్, డీఆర్‌టీఎస్‌ల కింద కేసులు తగ్గుముఖం పట్టగా, ఒత్తిడిలో ఉన్న ఆస్తులపై దివాలా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం ఇందుకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. 

దివాళా ప్రాసెస్‌పై బ్యాంకుల చర్యలు వేగవంతం ఇలా 
దివాలా చట్టం ప్రాసెస్‌కోసం చర్యలను వేగవంతం చేయడం, ఎన్‌సీఎల్‌టీఎస్ కింద మరిన్ని బెంచ్‌లను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం ఐబీసీ కింద కేసుల పరిష్కారం వేగవంతం అయిందని నివేదికలో ఆర్బీఐ అభిప్రాయపడింది. నిరంతరాయంగా సదరు సంస్థల బ్యాలెన్స్ షీట్స్‌ పర్యవేక్షించడంతోపాటు వీటిని పునర్‌వ్యవస్థీకరించుకోవాలని, అలాగే, బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీఎస్/ఆర్థిక సేవల సంస్థలూ తమవంతుగా కోతలు విధించుకోవాలని నివేదిక సూచించింది. తాకట్టుకింద పెట్టిన ఆస్తుల విక్రయంలో ప్రభుత్వరంగ బ్యాంకులకంటే ప్రైవేట్ బ్యాంకులు చర్యల్లో వేగం పెంచాయని, వివిధ మార్గాల్లో తమ అప్పులను తగ్గించుకునే ప్రయత్నాలను వేగవంతం చేశాయని తెలిపింది.

66 శాతానికి మొండి బాకీల ప్రొవిజనింగ్‌ కవరేజీ
మొండి బకాయిల నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రొవిజనింగ్‌ కవరేజీ నిష్పత్తి 2018, సెప్టెంబర్‌ నాటికి 66.85 శాతానికి చేరుకుంది. 2015లో ఈ నిష్పత్తి 50 శాతం దిగువన ఉండేది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందనడానికి కవరేజీ నిష్పత్తి పెరుగుదలే సంకేతమని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ అన్నారు. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో స్థూల మొండి బాకీలు (ఎన్‌పీఏ) రూ.23,860 కోట్ల మేర తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం చివరికల్లా స్థూల మొండి బాకీలు రూ.9.62 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

అంధుల కోసం ఆర్బీఐ ప్రత్యేక ఏర్పాట్లివి..
అంధులు, దృష్టి లోపాలున్నవారు కరెన్సీ నోట్లను సులువుగా గుర్తించేలా ఓ మొబైల్ ఫోన్ ఆధారిత పరిష్కారాన్ని అన్వేషిస్తున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం రూ.10, 20, 50, 100, 200, 500, 2,000 నోట్లు చలామణిలో ఉండగా, రూ.100 అంతకంటే ఎక్కువ విలువైన బ్యాంక్ నోట్లలో ఇంటెగ్లియో ముద్రణ ఆధారిత గుర్తింపు చిహ్నాలను పెట్టారు. వీటి సాయంతో దృష్టి లోపం, కంటిచూపు మందగించినవారు ఆయా నోట్లను ఇట్టే గుర్తించే వీలుంటున్నది. 

దేశంలో 80 లక్షల మంది అంధులు
దేశంలో దాదాపు 80 లక్షల మంది అంధులు లేదా దృష్టి లోపాలున్నవారు ఉన్నట్లు అంచనా. ఆర్బీఐ చర్యలు సఫలమైతే వీరందరికీ లాభించనున్నది. నిజానికి ఈ ఏడాది జూన్‌లోనే ఆర్బీఐ ఈ దిశగా అడుగులకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఇందుకు అనువైన వ్య వస్థ/పరికరం అభివృద్ధికి ఆసక్తి ఉన్న ఔత్సాహికులు, వ్యాపారులను ఆహ్వానించింది. నోట్లను చేతితో తాకినప్పుడు అవి ఎంత విలువైన కరెన్సీనో క్షణాల్లో చెప్పగలిగేలా ఈ వ్యవస్థ/పరికరం ఉండాలని ఆర్బీఐ  విడుదల చేసిన ఓ టెండర్ డాక్యుమెంట్‌లో పేర్కొన్నది.

సాఫ్ట్ వేర్ ఆధారిత పరిష్కారంతో నోట్ల గుర్తింపు
సాఫ్ట్‌వేర్ ఆధారిత పరిష్కారం ఉన్నైట్లెతే మొబైల్ ఫోన్లు లేదా ఇతర హార్డ్‌వేర్ పరికరాల్లో దాన్ని సులువుగా వినియోగించి నోట్లను గుర్తించే వీలుండాలన్నది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఇది పనిచేసేలా రూపొందించాలని కోరింది. రిచార్జ్ చేసుకునేలా, బ్యాటరీ సాయంతో నడిచేలా, చిన్నదిగా, సులభంగా వెంట తీసుకెళ్లేలా ఈ హార్డ్‌వేర్ ఆధారిత పరికరాలు ఉండాలని కూడా స్పష్టం చేసింది. 

ఇలా అంధులపై డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు
కాగా, ఇతరులు చూపే చేతి వేళ్లను మూడు మీటర్ల దూరం నుంచి లెక్కించలేనివారినే అంధులుగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నూతన మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇంతకుముందు ఇది ఆరు మీటర్లుగా ఉండేది. తాజా నిబంధనలతో దేశంలో అంధుల సంఖ్య 1.20 కోట్ల నుంచి 80 లక్షలకు తగ్గిపోగా, ఆర్బీఐ వీరి కోసం కరెన్సీ నోట్ల గుర్తింపు  పరిష్కారాలపై దృష్టి పెట్టింది.