Asianet News TeluguAsianet News Telugu

అమ్మకానికి మహారత్న: బీపీసీఎల్ ప్రై‘వేట్’ యత్నాలు షురూ!

తగ్గుతున్న జీఎస్టీ వసూళ్లు.. అటుపై అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు.. నిధుల కొరత వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్నగా పేరొందిన భారత పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రయివేట్ సంస్థకు అప్పగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ చమురు దిగ్గజానికి అమ్మేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇలా విక్రయించగా వచ్చే నిధులను లెక్క తేల్చే యత్నాల్లో ఉన్న కేంద్రం.. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకే ప్రణాళిక రూపొందించిందని సమాచారం.
 

Govt exploring options to sell majority stake in BPCL to global oil firm
Author
Hyderabad, First Published Sep 14, 2019, 12:25 PM IST

దేశంలో ఆర్థిక మందగమనం తారాస్థాయికి చేరుతున్న వేళ.. సర్కారు నిధుల కొరతను తీర్చుకొనేందుకు లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ సంస్థలకు విక్రయించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో రెండో అతిపెద్ద రిఫైనరీ, రిటైల్‌ ఇంధన సంస్థగా పేరున్న మహారత్న కంపెనీ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో (బీపీసీఎల్‌) తనకున్న కీలక వాటాను ప్రయివేట్ సంస్థకు అప్పగించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

ప్రపంచంలో ఇంధన దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్న ఒక సంస్థకు బీపీసీఎల్‌ను అప్పగించే దిశగా సర్కారు పావులు కదుపుతున్నట్టుగా అభిజ్ఞ వర్గాలు అందిస్తున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. బీపీసీఎల్‌ సంస్థలో తనకున్న కీలక వాటాను ప్రయివేట్ సంస్థకు ఏ మార్గంలో అప్పగిస్తే బాగుంటుందన్న విషయమై సర్కారు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రయత్నాలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు తెలిపారు. దేశ ఇంధన రంగానికి ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన బీపీపీఎల్‌, ఇండియన్‌ ఆయిల్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) సంస్థలు పెట్టని గోడల్లా నిలుస్తూ చమురు భరోసాను కల్పిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో దేశీయ ఇంధన రంగంలో పోటీకి ఊతం ఇచ్చేందుకు గాను దేశీయ ఇంధన రిటైల్‌ మార్కెట్లోకి విదేశీ, ప్రయివేటు రంగ సంస్థలను రంగంలోకి దించాలని మోడీ సర్కార్ ఎప్పటి నుంచో యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయత్నాలకు కార్యరూపం ఇచ్చేందుకే మోడీ సర్కారు బీపీసీఎల్‌లో వాటా విక్రయం దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనాల ప్రకారం దేశలో ఇంధనం డిమాండ్‌ 2040 నాటికి రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత ఇంధన మార్కెట్లో పాగా వేసేందుకు బహుళజాతి సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. 

ఈ క్రమంలోనే సౌదీకి చెందిన ఆరామ్‌కో సంస్థ రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌ పీజేఎస్‌సీ సంస్థలు చమురు శుద్ధి, ఫ్యూయెల్‌ మార్కెటింగ్‌ విభాగాల్లో పెట్టుబడులు పెట్టాయి. వివిధ ఇతర మార్గాల ద్వారా తమ వ్యాప్తిని పెంచుకోవాలని సంస్థలు భావిస్తున్నాయి. 

ఈ సంస్థలకు తోడు టోటల్‌ ఎస్‌ఏ, షెల్‌, బీపీ పీసీఎల్‌ తదితర సంస్థ భారత్‌లోని చమురు రిటైలింగ్‌ విభాగంలో తమ సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్‌ కొనుగోలుకు ఈ సంస్థలు ఆసక్తి చూపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

దేశీయ మహారత్న కంపెనీగా ఉన్న బీపీసీఎల్‌ కొన్నేళ్లుగా సంవత్సరాలుగా మెరుగైన లాభాలతో జాతికి సంపదను సృష్టించి పెడుతోంది. ఈ సంస్థలో సర్కార్‌కు దాదాపు 54 శాతం వరకు వాటా ఉంది. ఇప్పుడు దీనిని విక్రయించి సొమ్ము చేసుకోవాలని సర్కారు భావిస్తోంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా దాదాపు రూ.1,05 లక్షల కోట్ల మేర సొమ్మును రాబట్టాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. దీనికి తోడు ప్రభుత్వపు ఖర్చు అంతకంతకు పెరుగుతున్న వేళ.. దేశంలో ద్రవ్యలోటు కూడా నిర్ధేశిత స్థాయిని దాటిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

మరోవైపు ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం కారణంగా సర్కారుకు పన్ను ఆదాయం కూడా తగ్గుతోంది. దీంతో ఆర్థికంగా తమ ఉనికిని నిలబెట్టుకొనేం దుకు మంచి లాభాల్లో ఉన్న సంస్థను అమ్మతే మెరుగైన ఆదాయం వస్తుందన్నది సర్కారు ప్లాన్‌. 

నష్టాల్లో ఉన్న సంస్థలను కొనుగోలుకు ఎక్కువ మంది ముందుకు రారు. దీనికి తోడు అరకొరగా నిధులు లభిస్తాయి. అదే మహారత్న కంపెనీని విక్రయిస్తే మెరుగైన ఆదాయం వస్తుందన్నది సర్కారు ప్లాన్‌గా కనిపిస్తోంది. 

బీపీసీఎల్‌లో ప్రతిపాదిత వాటా విక్రయం జరిపితే ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న రూ.1.05 లక్షల కోట్ల డిజిన్వెష్ట్‌మెంట్‌ లక్ష్యంలో దాదాపు 40 శాతం మేర నిధులు అంటే దాదాపు రూ.40,000 కోట్ల వరకు నిధులు లభించే అవకాశాలు ఉన్నాయి. 

అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌, సుస్థిరంగా కొన్నేళ్లుగ లాభాలు ఆర్జిస్తున్నందున బీపీపీ ఎల్‌ సంస్థను సర్కారు 2017లో మహారత్న కంపెనీగా ప్రకటించింది. గతేడాది ఫార్చూన్‌ సంస్థ రూపొందించిన ప్రపంచంలోని అతిపెద్ద 1000 కార్పొరేషన్ల జాబితాల్లో బీపీసీఎల్‌ 672వ స్థానంలో నిలిచింది.

కామధేనువులా ఉన్న ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ సంస్థలలో వాటా విక్రయం విషయమై 2003లోనే ఒక విఫల యత్నం జరిగింది. ఈ సంస్థల్లోని వాటాలను గంపగుత్తగా ప్రయివేట్ సంస్థలకు విక్రయించాలని అప్పట్లోనే కేంద్ర సర్కార్ ప్రయత్నించింది. 

2003లో నాటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ (సీపీఐఎల్‌) సంస్థ అడ్డుకుంది. సర్కారు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీపీఐఎల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 1970లో ఆయా సంస్థలను జాతీయం చేస్తూ సర్కార్ ఒక చట్టం తీసుకు వచ్చిందని.. దీని ప్రకారం పార్లమెంట్‌ అనుమతి లేకుండా ఈ సంస్థల్లో వాటా అమ్మకానికి వీలు లేదని సీపీఐఎల్‌ వాదించింది. 

దీనికి అంగీకరించిన సుప్రీంకోర్టు సర్కారుకు సూచన చేస్తూ రెండు చమురు సంస్థల్లో వాటా అమ్మకం ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించింది. పార్లమెంట్‌ సమ్మతి లేకుండా వాటా విక్రయం చేపట్టొద్దని తెలిపింది. దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి ప్రతికూల నిర్ణయం రావడంతో అప్పట్లో సర్కారు వెనుకడుగు వేసింది. ఇప్పుడు పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ ఉండడంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీపీసీఎల్‌ను ప్రయివేటుకు విక్రయించే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios