ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఇకపై ఆర్జిత సెలవులను (Earned Leaves) 240 నుంచి 300 రోజులుగా పెంచే వీలుంది.
ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త వినిపించేందుకు సిద్ధం అవుతోంది. ఈ ఏడాది నుంచే కార్మిక చట్టాల సంస్కరణలను అమలు చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. కార్మిక సంస్కరణల అమలులో జాప్యం జరిగినప్పటికీ, కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ 2022లో నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయాలని చూస్తోంది.
ఇదే జరిగితే ప్రభుత్వోద్యోగులకు 300 ఆర్జిత సెలవులు (Earned Leave) లభించే శుభవార్త అందుతుంది. మోడీ ప్రభుత్వ లేబర్ కోడ్ నిబంధనలను అమలు చేస్తే, ఉద్యోగులకు Earned Leaves 240 నుంచి 300కి పెరగవచ్చు.
300 సెలవులు పొందవచ్చు
లేబర్ కోడ్ నిబంధనల మార్పుకు సంబంధించి, కార్మిక మంత్రిత్వ శాఖ, కార్మిక సంఘం మరియు పరిశ్రమల ప్రతినిధుల మధ్య పని గంటలు, వార్షిక సెలవులు, పెన్షన్, పిఎఫ్, టేక్ హోమ్ జీతం, పదవీ విరమణ మొదలైన వాటిపై చర్చ జరిగింది. ఉద్యోగుల ఆర్జిత సెలవులను 240 నుంచి 300 మందికి పెంచాలని డిమాండ్ చేశారు.
లేబర్ కోడ్‌ను అమలు చేయడానికి ముందు ప్రతి రాష్ట్రాన్ని తమ వెంట తీసుకెళ్లేందుకు మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందని కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలతో నిరంతరం మాట్లాడుతున్నామని, ఈ విషయంలో కేంద్రంతో రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ఏ పథకం, కార్యక్రమం వచ్చినా అందరినీ కలుపుకొని వెళ్తామని తెలిపారు. అయితే కొత్త కార్మిక చట్టాల అమలుకు ఎలాంటి తుది గడువు ఇవ్వడం కష్టమని, అయితే 2022 నాటికి మొత్తం నాలుగు లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తాయని భావిస్తున్నామన్నారు.
ఇదిలా ఉంటే కేంద్రప్రభుత్వం దేశంలోని 29 కేంద్ర కార్మిక చట్టాలు 4 కోడ్‌లుగా విభజించింది. ఇందులోని కోడ్ నియమాలలో వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు మొదలైన 4 లేబర్ కోడ్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు 13 రాష్ట్రాలు ఈ ముసాయిదా చట్టాలను సిద్ధం చేశాయి.
ఈ నాలుగు కోడ్‌లను పార్లమెంట్ ఆమోదించింది. అయితే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కోడ్‌లను, నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ నిబంధనలు రాష్ట్రాల్లో అమల్లోకి వస్తాయి. ఈ నిబంధనలు గతేడాది ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, రాష్ట్రాల సన్నాహాలు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది.
