ముంబై: ఈ ఏడాదిలో బంగారం ధర జోరుగా పెరిగింది. బంగారంపై కస్టమ్స్‌ సుంకం పెంపు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్షీణిత, వినియోగదారుల డిమాండ్‌, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల తదితర అంశాలు ధరలు పెరగడానికి కారణమయ్యాయి. కొత్త ఏడాది బంగారం ధరలు సరికొత్త స్థాయికి చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 10 గ్రాముల బంగారం రూ.45 వేలను కూడా తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

భౌగోళిక రాజకీయ ప్రకంపనలు, ఆర్థిక ఇబ్బందులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువలో ఒడిదుడుకులు.. పసిడి ధరలను పరుగులు పెట్టిస్తాయని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో బంగారం ధరలు పుంజుకున్నా, ప్రభుత్వ విధానాలు, స్టాక్‌ మార్కెట్ల లాభాలతో ద్వితీయార్ధంలో తగ్గుముఖం పట్టాయి. 

also read ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్...న్యూ ఇయర్ కానుకగా...

వచ్చే ఏడాది మాత్రం పసిడి ధరలు దౌడు తీయడం ఖాయమని మార్కెట్‌ పండితులు తేల్చి చెబుతున్నారు. ‘2020లో మదుపరులకు భౌగోళిక రాజకీయ ప్రతికూల పరిస్థితులు సవాల్‌ విసిరే వీలున్నది. అమెరికా-చైనా వాణిజ్య సంక్షోభం, మధ్యప్రాచ్య దేశాల్లో సంఘర్షణలు ఇబ్బందుల్ని సృష్టించవచ్చు. 

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో బంగారంపై పెట్టుబడులకు డిమాండ్‌ పెరుగవచ్చు. ఇది ధరల పెరుగుదలకు దారి తీస్తుంది’ అని కామ్‌ట్రెండ్జ్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ జ్ఞానశేఖర్‌ త్యాగరాజన్‌ పీటీఐతో అన్నారు. దీంతో 10 గ్రాములు ఎంసీఎక్స్‌లో రూ.41,000-41,500లను చేరవచ్చని, గరిష్ఠంగా రూ.44,500-45,000లను తాకవచ్చని అన్నారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)సహా 14 దేశాల సెంట్రల్‌ బ్యాంకులు తమ బంగారం నిల్వలను ఒక టన్నుకుపైగా పెంచుకున్నాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గణాంకాలు చెబుతున్నాయి. 2019లో ఆర్బీఐ పసిడి కొనుగోళ్లు పెద్ద ఎత్తున పెరిగాయని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్‌ తెలిపారు. 

బంగారం ధరల్లో పెరుగుదల వల్ల డిమాండ్‌ ప్రభావితమైందని, ఈ ఏడాదిలో మొత్తం డిమాండ్‌ 700-750 టన్నులు ఉండవచ్చని డబ్ల్యూజీసీ భారత్ ఎండీ సోమసుందరం పీఆర్‌ తెలిపారు. అమెరికా, యూరప్‌ దేశాల్లో గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్)కు డిమాండ్‌ అధికంగా ఉందన్నారు. ఆర్బీఐ పుత్తడి నిల్వలు 60 టన్నులను దాటవచ్చని అంచనా వేశారు. 

ఈ ఏడాది ప్రథమార్థంలో పది గ్రాముల బంగారం ధర రూ.31,500-32,000 స్థాయిలో ఉండటం వల్ల వినియోగదారులు ఆకర్షితులయ్యారు. కస్టమ్స్‌ సుంకం, జీఎస్టీ తర్వాత బంగారం కొనుగోలుదారులపై భారం పెరిగింది. జూలై తర్వాతి నుంచి ధరల పెరుగుదల మొదలుకావడంతో డిమాండ్‌ బలహీనపడింది.

also read బ్యాంకులకు వెళుతున్నారా అయితే ఈ వివరాలు తెలుసుకోండి...

ప్రపంచ దేశాల్లో చైనా, రష్యాలు అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్‌ పేర్కొన్నారు. భారత్‌, టర్కీ, పోలాండ్‌, కజకిస్తాన్‌ వంటి దేశాలు కూడా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చాయి. 

ఈ ఏడాది ఒకానొక దశలో 10 గ్రాముల పసిడి ధర రూ.39,900లను తాకిన విషయం తెలిసిందే. ప్రథమార్ధంలో బంగారానికి మార్కెట్‌ నుంచి మంచి ఆదరణ కనిపించిందని అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు.  అకాల వర్షాల వల్ల పంటలను రైతులు నష్టపోవడంతో బంగారం కొనుగోళ్ల ప్రభావం డిమాండ్‌పై కనిపించింది. 

బంగారం డిమాండ్‌లో గ్రామీణ ప్రాంతాల వాటాయే 70 శాతం ఉంటుందని అంచనా. వచ్చే రెండు, మూడేళ్ల కాలంలో బంగారం మార్కెట్‌ సరికొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుకునే అవకాశం ఉందని భారత బులియన్‌ అండ్‌ జువెలరీ అసోసియేషన్‌ (ఐబీజేఏ) జాతీయ అధ్యక్షుడు పృథ్విరాజ్‌ కొఠారి అభిప్రాయపడ్డారు. 2020లో బంగారం రూ.38,000-42,000 మధ్య కదలాడే అవకాశం ఉందన్నారు.