బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బంగారం ధరలు రోజురోజుకూ సరికొత్త గరిష్టస్దాయిలకు చేరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడం, మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమవడంతో పసిడి ధర రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. 

ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.943 పెరిగి రూ.44,472 పలికింది. పసిడితోపాటు వెండి కూడా పరుగులు పెట్టింది. గడిచిన ఆరు రోజుల్లో పసిడి రూ.2000కు పైగా పెరిగి సామాన్యుడికి అందనంటున్నది. 

మరోవైపు, పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి రూ.586 అధికమై రూ.50 వేలకు చేరువైంది. గత శనివారం రూ.49,404గా ఉన్న వెండి ధర ప్రస్తుతం రూ.49,990 వద్ద ముగిసింది. 

కరోనా వైరస్‌ మరిన్ని దేశాలకు పాకుతుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడం, అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్‌ నెలకొనడం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ విశ్లేషకులు తపన్‌ పటేల్‌ తెలిపారు.

Also Read ఇక ఇండియన్ బ్యాంకు ఏటీఎంల్లో 2000 నోటు మిస్..

న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,680 డాలర్లకు చేరుకోగా, వెండి 18.80 డాలర్లు పలికింది. వారం క్రితం ఇది 1,606.60 డాలర్లు, 18.32 డాలర్లుగా ఉన్నాయి. 

ఎంసీఎక్స్‌లో సోమవారం పదిగ్రాముల బంగారం ఏకంగా రూ 1100 భారమై ఏకంగా రూ 43,771 పలికింది. గత వారంలో పదిగ్రాముల బంగారం 1800 పెరగ్గా, ఈ ఒక్కరోజే ఈస్ధాయిలో పెరగడం విశేషం. 

ఈ నెల రెండో తేదీన సామాన్యుడికి దూరమైన స్వర్ణం పదిగ్రాముల పసిడి ఎంసీఎక్స్‌లో ఏకంగా ఒక్కరోజే రూ 230 పెరిగి రూ 41,230కి చేరింది. ఇక వెండి ధరలు సైతం కిలోకు రూ 171 పెరిగి రూ 47,160కి చేరాయి. బంగారం, వెండి వేగంగా పెరుగుతున్న తీరు చూస్తే ఈ రెండు హాట్‌ మెటల్స్‌ త్వరలోనే హాఫ్‌సెంచరీ(రూ 50,000) మైలురాయిని చేరతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.