న్యూఢిల్లీ: ముడిచమురు ధరల పతనంతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం ప్రపంచ కుబేరుల స్ధానాలనూ కదిలించింది. ఆసియాలో అత్యంత సంపన్నుడి స్ధానాన్ని భారత పారిశ్రామికదిగ్గజం ముఖేష్‌ అంబానీ కోల్పోయారు.

సోమవారం షేర్‌మార్కెట్‌ కుదేలవడంతో అంబానీ నికర సంపద ఏకంగా 580 కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోవడంతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్ధానాన్ని అలీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌మా ఆక్రమించారని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ పేర్కొంది.

also read విదేశాల్లో రాణా కపూర్ ఫ్యామిలీ ఆస్తులు... యెస్ బ్యాంకు స్కాంపై సీబీఐ పరిశోధన...

ముఖేష్‌ అంబానీ కంటే 260 కోట్ల డాలర్ల అధిక సంపద (4450 కోట్ల డాలర్లు)తో జాక్‌మా ఆసియా సంపన్నుల్లో నెంబర్‌వన్‌గా నిలిచారని పేర్కొంది.

కరోనా వైరస్‌ భయాలు ఈక్విటీ మార్కెట్లను వెంటాడుతున్న క్రమంలో 30 ఏళ్ల కనిష్టస్ధాయిలో ముడిచమురు ధరలు పడిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు సోమవారం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

రిలయన్స్‌ షేర్లు సైతం ఏకంగా 12 శాతం పతనమయ్యాయి. ఈ ప్రతికూల పరిణామాలు తాత్కాలికమేనని ముఖేష్‌ అంబానీ (62) తిరిగి సత్తా చాటుతారని ఈక్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌కు చెందిన హరీష్‌ హెచ్‌వీ అన్నారు. అంబానీ టెలికాం బిజినెస్‌ రానున్న సంవత్సరాల్లో మెరుగైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకొచ్చారు.

also read ముకేశ్ అంబానీకి షాక్ : ఒక్క రోజే వేల కోట్ల నష్టం...కారణం ?

మరోవైపు దేశీయ విలువైన కంపెనీల జాబితాలోనూ మార్పులు వచ్చాయి. టాటా సన్స్ అనుబంధ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. సోమవారం నాటి షేర్ మార్కెట్ పతనంలో టీసీఎస్ కూడా విలువ కోల్పోయినా ఆ సంస్థ షేర్ ఆరు శాతమే నష్టపోయింది. 

టీసీఎస్ మార్కెట్ విలువ రూ.7.40 లక్షల కోట్లుగా నిలిచింది. దీంతో టీసీఎస్ దేశంలోనే తొలి సంస్థగా నిలిచింది. షేర్ల పతనం తర్వాత ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ.7.05 లక్షల కోట్లకు పరిమితమైంది.