అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిణామాలతో గత కొన్ని రోజులుగా పసిడి ధర పరుగులు పెడుతోంది. బుధవారం ఒక్కరోజే రూ. 320 పెరగడంతో బంగారం ధర రూ. 34వేల మార్క్‌ను దాటింది. బులియన్‌ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల పుత్తడి రూ. 34,070 పలికింది. ఇది ఎనిమిది నెలల గరిష్టంగా రికార్డైంది. 

దేశ రాజధాని ఢిల్లీలో పసిడి పది గ్రాముల (99.9 %) ధర రూ.320 పెరిగి రూ.34,070 దాటితే, 99.5% బంగారం ధర రూ.33,920 వద్ద స్థిరపడింది. సావరిన్ గోల్డ్ ఎనిమిది గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.25,900లకు చేరింది. 

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే సంస్థపై క్రిమినల్‌ విచారణకు అమెరికా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అమెరికా-చైనా మధ్య జరిగే వాణిజ్య చర్చలపై అనిశ్చితి ఏర్పడింది. ఈ పరిణామాలపై దృష్టిపెట్టిన మదుపర్లు బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని భావించారని, తద్వారా పసిడి ధర పెరిగినట్లు మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. 

ఇన్వెస్టర్లు కూడా అమెరికా - చైనా మధ్య చర్చల సారాంశం కోసం వేచి చూస్తున్నారు. గత రెండు రోజుల్లో బంగారం ధర రూ. 450 పెరిగింది. అంటే ఈ వారంలో ఇప్పటివరకు 10 గ్రాముల పసిడి ధర రూ. 770 పెరగడం గమనార్హం. దేశీయంగా రిటైల్‌ ఆభరణ వర్తకులు కొనుగోళ్లు పెంచారు. 

దేశీయంగా ధరల పెరుగుదలకు అదే ప్రధాన కారణమని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. తత్ఫలితంగా అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విలువైన లోహాల్లోకి మళ్లించారు. దాంతో బంగారం, వెండి రేట్లు మరింత ఎగబాకాయి. 

న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 1,314.76 డాలర్లకు, వెండి 15.96 డాలర్లకు చేరుకుంది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో గడిచిన రెండ్రోజుల్లో పుత్తడి రేటు రూ.450 మేర పెరిగింది. వరుసగా నాలుగు రోజులుగా పుత్తడి ధర పెరుగుతూనే ఉండటం గమనార్హం. 

అటు వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు డిమాండ్‌ ఊపందుకోవడంతో కేజీ వెండి ధర రూ. 330 పెరిగి రూ. 41,330కి చేరింది. వంద వెండి నాణాల విక్రయ ధర రూ.1000 పెరిగి రూ.80 వేలకు, కొనుగోలు ధర రూ.79 వేలకు చేరుకున్నది.