న్యూఢిల్లీ: బంగారం ధరలు కొండెక్కనున్నాయా! ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న అతి విలువైన లోహాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమవడం, స్టాక్ మార్కెట్లు అంతంత స్థాయిలో రిటర్నులు పంచుతున్నాయి.

దీంతో పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారంపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడంతో ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. వీటికి తోడు పలు దేశాల్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితి నెలకొనడం, సెంట్రల్ బ్యాంకులు అత్యధికంగా కొనుగోళ్లు జరుపడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడటంతో బంగారం మరింత మిలమిల మెరువబోతున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుతం రూ.40 వేల స్థాయిలో కదలాడుతున్న పసిడి ధరలు మరో రెండు నెలలు అంటే ఈ ఏడాది చివరినాటికి రూ.42 వేల మార్క్‌కు చేరుకోనున్నదని అంటున్నారు. మధ్య తూర్పు దేశాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,650 డాలర్లకు, ఎంసీఎక్స్‌లో రూ.42 వేలకు చేరుకుంటుందని కామ్‌ట్రెండ్స్ రీసర్చ్ కో-ఫౌండర్, సీఈవో త్యాగరాజన్ తెలిపారు.

also read ధంతెరాస్ వేళ ....మెరవని బంగారం...

ఈ ఏడాది చివరినాటికి ధరల జోరు కొనసాగనున్నదన్న కామ్‌ట్రెండ్స్ రీసర్చ్ కో-ఫౌండర్, సీఈవో త్యాగరాజన్ తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ భారీ స్థాయిలో పసిడిని కొనుగోలు చేయడం, తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్న ఈక్విటీ మార్కెట్లతో మదుపరులు సురక్షితమైన బంగారం వైపు మళ్లడం కూడా ధరలు మరింత పుంజుకోవడానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.38,302 కాగా, కామెక్స్‌లో 1,506 డాలర్లుగా ఉన్నది. ఈ ఏడాది పసిడి గరిష్ఠ స్థాయిలో రిటర్నులు పంచిందని, ముఖ్యంగా ఇప్పటి వరకు ధరలు 15 శాతం వరకు పెరిగాయని, రూపాయి విలువ 1.4 శాతం పతనమవడం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని మోతీలాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ నవ్‌నీత్ దామాని తెలిపారు.

గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలతో సామాన్యుడికి అందనంత దూరంలోకి పసిడి చేరుకున్నది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.39,840 స్థాయిలో కదలాడుతున్నది.ఈక్విటీ మార్కెట్ల కంటే బంగారం, భూములపై పెట్టుబడులు పెట్టిన వారికి రిటర్నులు అధికంగా లభిస్తుండటంతో గతేడాదిగా వీటివైపు మొగ్గుచూపేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

ఆశావాదంగా కదలాడుతున్న ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నదని, అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.ఫలితంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కల దేశాలకు ఆర్థిక మాంద్యం దెబ్బ తగులబోతున్నదన్న సంకేతాలతో పలు సెంట్రల్ బ్యాంకులు ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా కొనుగోళ్లు జరుపడంతో రికార్డు స్థాయికి ఎగబాకే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. 

కొటక్ సెక్యూరిటీ హెడ్ రవీంద్ర రావు స్పందిస్తూ గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధర 1,460.1,530 డాలర్ల మధ్యలో ఉండనుండగా, రూపాయిల్లో మాత్రం రూ. 36,800 నుంచి రూ.39,400 మధ్యలో కొనసాగుతుందని అన్నారు. స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్‌కు 1,458 డాలర్ల వద్ద మద్దతు లభించవచ్చునని అంచనా.

also read  ఇక ఆన్ లైన్ లో చేనేత వస్త్రాల అమ్మకాలు

దీపావళి పండుగ వ్యాపారుల్లో వెలుగులను నింపలేకపోయింది. ఈసారి పసిడి అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని సోమవారం విడుదలైన వరల్డ్‌లైన్ నివేదిక ఒకటి చెబుతున్నది. పండుగ అంటేనే.. ఆభరణాలు, దుస్తులు. అయితే ఈ రెండింటి విక్రయాలు ఈ సీజన్‌లో చాలా తక్కువగా జరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెరుగాలని చేస్తున్న ప్రయత్నాలు అంతగా ప్రభావం చూపట్లేదని తేలిపోయింది. 

ధనత్రయోదశి, దీపావళి సగటు అమ్మకాల పరిమాణంతో పోల్చితే 66 శాతం దిగజారి నగల విభాగంలో రూ. 3,625గా నమోదైందని వరల్డ్‌లైన్ స్పష్టం చేసింది. దుస్తుల అమ్మకాల్లో 28 శాతం పడిపోయి రూ.1,746గా ఉన్నది. కాగా, సరుకులు, రెస్టారెంట్ల విభాగాల్లో వరుసగా 11 శాతం, 32 శాతం వృద్ధి కనిపించింది.