పెండ్లిళ్ల సీజన్: ఊపందుకున్న బంగారం కొనుగోళ్లు
పుత్తడి ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.225 పుంజుకుంది. కిలో వెండి ధర రూ.440 పెరిగింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండంతో పుత్తడి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు మళ్లీ ప్రియం అయ్యాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల ధర మరో రూ.225 అధికమై రూ.38,715 పలికింది.
also read తొలి భారతీయురాలిగా నీతా అంబానీకి అరుదైన గౌరవం
దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు పుంజుకోవడం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ తెలిపారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమవడం కూడా ధరలు పెరుగడానికి పరోక్ష కారణం.
పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారులు కొనుగోళ్లకు మద్దతు పలకడంతో కిలో వెండి ధర రూ.440 అధికమై రూ.45,480 పలికింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,461 డాలర్లకు చేరుకోగా, వెండి 16.90 డాలర్లు పలికింది.
also read ప్రీమియం సెగ్మెంట్లో ‘ఐఫోన్’దే హవా!
వాణిజ్యంపై అమెరికా-చైనా మధ్య నెలకొన్న ఘర్షణ మరింత ముదురుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో ధరలు పుంజుకున్నాయన్నారు.