బంగారం ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, రూపాయి పతనం తదితర కారణాల వల్ల మరోసారి బంగారం ధర ఆకాశాన్నంటింది. సోమవారం నాటి మార్కెట్లో రూ. 180 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 31,600కు చేరింది. అటు వెండి కూడా నేడు పసిడి దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువవడంతో రూ. 180 పెరిగింది. దీంతో నేటి బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 37,680 పలికింది.

చైనా ఉత్పత్తులపై అమెరికా మరోసారి దిగుమతి సుంకాలు పెంచనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా సాగుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని మదుపర్లు భావించినట్లు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 దీంతో పాటు దేశీయ నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కూడా డిమాండ్‌ ఉండటంతో ఈ లోహాల ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగానూ బంగారం స్వల్పంగా పెరిగింది. సింగపూర్‌ మార్కెట్లో పసిడి ధర 0.19 శాతం పెరిగి ఔన్సు 1,195.40 అమెరికన్‌ డాలర్లు పలికింది. వెండి కూడా 0.39శాతం పెరిగి ఔన్సు ధర 14.08అమెరికన్‌ డాలర్లుగా ఉంది.

ఇక దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.180 పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.31,600కి చేరుకోగా.. 99.5శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.31,450కి చేరింది.